హంగ్ వచ్చే అవకాశం లేదు.. 80 సీట్లు ఈజీగా క్రాస్ చేస్తాం: రేవంత్

రాష్ట్రంలో హంగ్‌కు ఎలాంటి ఛాన్స్ లేదని, తాము ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Update: 2023-11-19 14:47 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో హంగ్‌కు ఎలాంటి ఛాన్స్ లేదని, తాము ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఓ ప్రైవేట్ హోటల్‌లో జర్నలిస్టు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో 80 నుంచి 85 సీట్లను సాధిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ వేవ్ ఉన్నదని, విజయం సులువుగా వరిస్తుందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీఆర్ఎస్ పతనం ఖాయమన్నారు. కాంగ్రెస్ రాగానే ధరణి దోపిడీపై దర్యాప్తు చేస్తామన్నారు. కల్వకుంట్ల భూముల లెక్కల్ని తేలుస్తామన్నారు. బీఆర్ఎస్‌కు పేగు బంధం తెగిపోయిందని, తెలంగాణపై కేసీఆర్‌కు ఎలాంటి హక్కు లేదన్నారు.

తమ మేనిఫెస్టోను చూసి కేసీఆర్ భయపడుతున్నారని, ఆయనే రాజముద్ర వేయడం సంతోషంగా ఉన్నదన్నారు. ఇక కాంగ్రెస్‌లో సీఎం ఎవరనేది అధిష్టానం తేల్చుతుందన్నారు. 24 గంటల ఉచిత కరెంట్‌ను తప్పకుండా అందజేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణపై సంపూర్ణ మద్దతు ఉన్నదని, ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఢిల్లీకి తీసుకువెళ్లేందుకు మందకృష్ణ కార్యచరణ సిద్ధం చేయాలన్నారు. మోడీతో ఆర్డినెన్స్ ఇప్పిస్తే, కాంగ్రెస్ ఒక్క నిమిషం ఆలోచించకుండా మద్దతిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో నక్సలైట్ల ఎజెండాను అమలు చేసిందని, భవిష్యత్‌లోనూ చేస్తుందన్నారు. ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు కావాలంటే కాంగ్రెస్‌కు ఓటేయ్యాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News