తెలంగాణ అప్పు రూ.3.66 లక్షల కోట్లు
ప్రజల ఆకాంక్షల మేరకే సోనియమ్మ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని కేంద్ర మాజీమంత్రి చిదంబరం పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజల ఆకాంక్షల మేరకే సోనియమ్మ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని కేంద్ర మాజీమంత్రి చిదంబరం పేర్కొన్నారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా.. ప్రజల సమస్యలు ఇప్పటికీ అలానే ఉండటం దారుణమన్నారు. కేసీఆర్ పాలనలో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిందన్నారు. రాష్ట్రంలో రూ.3.66 లక్షల కోట్ల అప్పులు చేసి, కేసీఆర్ తెలంగాణ ప్రజలపై భారం వేశాడన్నారు. కేసీఆర్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం బాగా పెరిగిందన్నారు. దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణే అని పేర్కొన్నారు. జాతీయ సగటు కన్న ఎక్కువ అని స్పస్టం చేశారు.
నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని, పాల ధరలూ విపరీతంగా ఉన్నాయన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలూ రాష్ట్రంలోనే ఎక్కువ ఉన్నాయన్నారు. వ్యాట్ ఎక్కువ వసూలు చేస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణే అని గుర్తుచేశారు. తెలంగాణ నిరుద్యోగ రేటు 7.8 (పురుషులు), 9.5 (మహిళలు)గా ఉన్నదన్నారు. గ్రామీణ నిరుద్యోగ రేటు జాతీయ సగటు కన్నా అధికంగా రాష్ట్రంలో 15.1 శాతం ఉన్నదన్నారు. రాష్ట్రంలో 1.91 లక్షల పోస్టులు ఖాళీగా ఉండగా, 20 వేల టీచర్ పోస్టులను కూడా భర్తీ చేయలేదన్నారు. టీఎస్‌పీఎస్సీలో 22 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్ అయ్యారని, వాళ్లకి ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం దారుణమన్నారు. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇస్తే ఆరు గ్యారంటీలను అమలు చేయడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతామని చెప్పారు.