కాటా శ్రీనివాస్ vs నీలం మధు.. పటాన్ చెరు టికెట్ దక్కెది ఎవరికో..?
అధికార బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చాలా కాలం బీఆర్ఎస్‌లో పనిచేసిన ఆయన పటాన్ చెరులో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
దిశ బ్యూరో, సంగారెడ్డి: అధికార బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చాలా కాలం బీఆర్ఎస్‌లో పనిచేసిన ఆయన పటాన్ చెరులో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించిన విషయం తెలిసిందే. అయితే పార్టీ అదిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికే మరోసారి అవకాశం ఇచ్చింది. దీంతో కలత చెందిన నీలం మధు పార్టీకి రాజీనామా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పటాన్ చెరు బరిలో ఉంటానని చెప్పి పాదయాత్ర కూడా చేపట్టారు. పాదయాత్ర మధ్యలోనే ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో అక్కడికి వెళ్లారు. ఎట్టకేలకు శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ నేపథ్యంలో పటాన్ చెరు రాజకీయంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీంతో ఇప్పటికే పార్టీలో పనిచేస్తున్న కాటా శ్రీనివాస్ గౌడ్‌కు టికెట్ ఇస్తారా..? లేదా పార్టీలో చేరిన నీలం మధుకు అవకాశం ఇస్తారా..? అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
సేవా కార్యక్రమాలతో గుర్తింపు...
పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన నీలం మధు ముదిరాజ్ చాలా కాలంగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. ఆ గ్రామానికి సర్పంచ్ అయినప్పటికీ సేవా, ఇతర పార్టీ కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి వికలాంగులకు మూడు చక్రాల స్కూటీలు, ఫోటో గ్రాఫర్లకు, ఇతర వర్గాలకు ఇన్స్ రెన్సూలు చేయించారు. అంతే కాకుండా పార్టీ పరంగా చేపట్టిన కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించి రాష్ట్రంలోనే గుర్తింపు పొందారు. శివోత్సం, చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ, ఇతర ఏ కార్యక్రమం అయిన వేలాది మంది తరలివచ్చి సక్సెస్ చేసేలా నిర్వహించి పేరు తెచ్చుకున్నారు.
టికెట్ ఆశించి భంగపడిన మధు..
నీలం మధు అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి పటాన్ చెరు స్థానాన్ని ఆశించారు. అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా సిట్టింగ్‌లకు పార్టీ మరోసారి అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే పటాన్ చెరు స్థానాన్ని కూడా మహిపాల్ రెడ్డికే ఇచ్చారు. దీనితో టికెట్ ఆశించిన నీలం మధు ముదిరాజ్ తీవ్ర కలత చెందారు. ఈ సారి పటాన్ చెరులో బీసీలకు అవకాశం కల్పించాలని పలు సందర్భాల్లో డిమాండ్ చేయగా అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. ఇదే అంశాన్ని మధు ముదిరాజ్ తెరమీదకు తీసుకువచ్చాడు. ముదిరాజ్‌లకు కనీసం ఒక్కసీటు కూడా ఇవ్వరా అంటూ అందోళన కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ అధిష్టానం నచ్చ జెప్పే ప్రయత్నం చేసింది. టికెట్ ఇవ్వడంతో పాటు ముదిరాజ్‌లకు న్యాయం జరగాలని డిమాండ్‌తో మధు పట్టుబట్టి కూర్చోవడంతో పార్టీ నుంచి స్పందన రాలేదు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని పాదయాత్ర మొదలుపెట్టారు.
పాదయాత్ర నుంచి ఢిల్లీకి...
బీఆర్ఎస్ పార్టీ తనకు అవకాశం కల్పించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని ప్రకటించిన నీలం మధు ముదిరాజ్ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు. ఆ పాదయాత్రకు మంచి స్పందన కూడా వచ్చింది. అయితే రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న కుల ప్రాతిపదికన టికెట్ల కేటాయింపు వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం నీలం మధుపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి ఆహ్వానం అందుకున్న మధు గత మూడు క్రితమే ఢిలీకి వెళ్లారు. అక్కడే మకాం వేసి పార్టీ పెద్దలతో చర్చల్లో పాల్గొన్నారు.
ఎట్టకేలకు కాంగ్రెస్‌లోకి.. టికెట్ ఎవరికి..?
ఎట్టకేలకు నీలం మధు ముదిరాజ్ శుక్రవారం ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీకి సంబంధించిన ఇతర పెద్ద నాయకులతో కలిసి ఆయన పార్టీ తీర్థం పుచ్చుకన్నారు. అయితే ఇప్పటికే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా కాటా శ్రీనివాస్ గౌడ్ పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పొటీ చేసి ఓటమి చెందారు కూడా. ఈ సెంటిమెంట్ కూడా తనకు పనిచేస్తుందని, తనకే టికెట్ ఖాయమైందని భావించి ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఇంతలో నీలం మధు ముదిరాజ్‌ను కాంగ్రెస్ అధిష్టానం పార్టీలోకి తీసుకోవడంతో పరిస్థితుల్లో మారనున్నాయా..? అనే చర్చ జరుగుతున్నది. కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధు ముదిరాజ్.. ఈ ఇద్దరిలో కాంగ్రెస్ టికెట్ ఎవరిని వరించనున్నదో అనే అంశం ఇప్పుడు ఆసక్తిగా మారింది.