తెలంగాణపై ‘డీకే’ గురి.. ఎన్నికలు పూర్తయ్యే వరకు మానిటరింగ్

తెలంగాణ కాంగ్రెస్‌పై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫోకస్ పెట్టారు. రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిస్థాయిలో ఇన్వాల్వ్ అయి హస్తం పార్టీ పవర్ కోసం కీ రోల్ పోషించనున్నారు.

Update: 2023-10-28 01:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‌పై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫోకస్ పెట్టారు. రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిస్థాయిలో ఇన్వాల్వ్ అయి హస్తం పార్టీ పవర్ కోసం కీ రోల్ పోషించనున్నారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు మానిటరింగ్ చేయనున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి కారణమైన డీకే.. తెలంగాణలోనూ పవర్‌లోకి తీసుకొస్తాడని ఏఐసీసీ బలంగా నమ్ముతున్నది. దీంతోనే డీకేకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. లీడర్లను కో-ఆర్డినేట్ చేయడం, పార్టీలో చేరికలు వంటివన్నీ గత కొన్నిరోజుల నుంచి ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. నెల రోజుల పాటు తన వ్యూహాలకు పదును పెడుతూ బీఆర్ఎస్ పార్టీని మట్టికరిపిస్తారని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నేడు సెకండ్ ఫేజ్ యాత్ర షురూ..

కాంగ్రెస్ పార్టీ విజయ భేరీ యాత్ర ఫేజ్-2 నేటి నుంచి ప్రారంభం కానున్నది. నేడు చీఫ్​గెస్టుగా డీకే శివకుమార్ రానున్నారు. ఆదివారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హాజరవుతారు. రాహుల్, ప్రియాంక గాంధీలు కూడా భాగస్వామ్యం కానున్నారని పార్టీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. నవంబరు 2 తేది వరకు ఈ యాత్ర జరగనున్నది. ఆరు రోజుల పాటు7 పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిల్లోని 17 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా యాత్ర సాగనున్నది. ఈ యాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతతో పాటు టీపీసీసీ సీనియర్ లీడర్లంతా పాల్గొననున్నారు.

ప్రతి జిల్లాకు ఓ సజేషన్ బాక్స్

కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించిన ఆరు గ్యారంటీలను జనాల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లనున్నారు. కాంగ్రెస్ వస్తే ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందో? బీఆర్ఎస్ మళ్లీ వస్తే జరిగే నష్టాలను క్షుణ్ణంగా వివరిస్తారు. దీంతో పాటు ప్రజల నుంచి సలహాలు, సూచనలు కూడా స్వీకరిస్తారు. ఈ మేరకు ప్రతి జిల్లాలో ఒక సజేషన్ బాక్స్ ఏర్పాటుతో పాటు టోల్ ఫ్రీ నంబరు, వెబ్ సైట్‌ను కూడా అందుబాటులోకి తేనున్నారు.

షెడ్యూల్ ఇలా..

చేవెళ్ల, మెదక్, భువనగిరి, నల్లగొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఈ యాత్ర జరగనున్నది.

ఫస్ట్ డే..

నేడు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని తాండురు నుంచి విజయభేరీ యాత్ర మొదలు కానున్నది. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్యలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ను నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 నుంచి 5 మధ్యలో పరిగిలో మరో మీటింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు చేవెళ్ల టౌన్‌లో పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు పార్టీ స్పష్టం చేసింది.

సెకండ్ డే..

రేపు మెదక్ పార్లమెంట్ పరిధి సంగారెడ్డిలో ఈ యాత్ర ప్రారంభం కానున్నది. మధ్యాహ్నం 2 నుంచి 3 మధ్యలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత నర్సాపూర్‌లో సాయంత్రం 4 నుంచి 5 లోపు మరో స్ట్రీట్ కార్నర్ మీటింగ్, మెదక్ టౌన్‌లో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు పాదయాత్ర జరుగుతుంది

థర్డ్ డే...

30న భువనగిరి పార్లమెంట్ పరిధి జనగామ నియోజకవర్గంలో ఉదయం 10 నుంచి 12 గంటల మధ్యలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్, ఆలేరులో సాయంత్రం 4.30 నుంచి 6 వరకు మరో స్ట్రీట్ కార్నర్ మీటింగ్, భువనగిరి టౌన్‌లో 6.35 నుంచి 8 వరకు పాదయాత్రను పూర్తి చేయనున్నారు.

ఫోర్త్ డే..

31న నల్లగొండ పార్లమెంట్ పరిధి నాగార్జున సాగర్‌లో ఉదయం 11 నుంచి 12 వరకు స్ట్రీట్ కార్నర్ మీటింగ్, సాయంత్రం 4.30 నుంచి 7.30 వరకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధి కొల్లాపూర్‌లో మరో మీటింగ్ నిర్వహించనున్నారు.

ఫిప్త్ డే..

నవంబరు 1న మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధి కల్వకుర్తిలో ఉదయం 10 నుంచి 12 వరకు కార్నర్ మీటింగ్, సాయంత్రం 5 నుంచి 6 వరకు జడ్చర్లలో మరో మీటింగ్‌తో పాటు సాయంత్రం 6.40 నుంచి 7.30 వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు.

సిక్త్ డే..

నవంబరు 2న మల్కాజిగిరి పార్లమెంట్ పరిధి మేడ్చల్‌లో ఉదయం 10 నుంచి 12 వరకు కార్నర్ మీటింగ్, కుత్బుల్లాపూర్‌లో సాయంత్రం 5 నుంచి 6 వరకు కార్నర్ మీటింగ్, సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకు పాదయాత్రతో రెండో విడత విజయభేరీ యాత్ర పూర్తి కానున్నది.

Tags:    

Similar News