BRS ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రెడీ.. 75 నుంచి 80 మంది పేర్లు ఫిక్స్ చేసిన కేసీఆర్..!
శ్రావణ మాసంలో అభ్యర్థుల ఫస్ట్ లిస్టును రిలీజ్ చేయడానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నది. సీఎం కేసీఆర్.. మూడు రోజులుగా ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో ఈ జాబితాపైనే కసరత్తు చేస్తున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: శ్రావణ మాసంలో అభ్యర్థుల ఫస్ట్ లిస్టును రిలీజ్ చేయడానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నది. సీఎం కేసీఆర్.. మూడు రోజులుగా ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో ఈ జాబితాపైనే కసరత్తు చేస్తున్నారు. మొదటి జాబితాలో సుమారు 75 నుంచి 80 మంది అభ్యర్థుల పేర్లు ఉండేలా చూస్తున్నారు. అందులో భాగంగానే గత కొన్ని రోజులుగా వడపోత కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ నెల 17 నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుంది. మంచి ముహూర్తం చూసుకుని ఫస్ట్ లిస్టును రిలీజ్ చేసే అవకాశముంది. ఇప్పటికే ముసాయిదా రూపొందినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నారు.
హరీశ్‌రావుతో చర్చలు
గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని పలు కార్యక్రమాలకు హాజరైన మంత్రి హరీశ్‌రావు శుక్రవారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతున్న టైమ్‌లో సీఎం కేసీఆర్ నుంచి ఫోన్ రావడంతో ఎర్రబెల్లి ఫామ్‌హౌజ్‌కు వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఖరారు చేసి ఫైనల్ లిస్టుకు తుది మెరుగులు దిద్ది అవసరమైన మార్పులు చేర్పులపై చర్చలు జరిపినట్టు సమాచారం. కీలకమైన స్థానాల గురించి ఆరా తీసినట్టు తెలిసింది.
ఏయే సెగ్మెంట్లలో పార్టీ బలంగా ఉన్నది, ఎవరికి టికెట్ ఇవ్వొచ్చు, ఆశావహులు ఎవరెవరున్నారు, పార్టీ వీక్‌గా ఉన్న స్థానాలేంటి, ఆల్టర్నేట్‌గా ఎవరిని నిలబెడితే గెలుపు ఖాయం, ఇతర పార్టీలకు ఉన్న అనుకూలతలేంటి, ఆ పార్టీ తరఫున బలమైన అభ్యర్థులెవరు.. ఇలా అనేక అంశాలపై హరీశ్‌రావుతో చర్చించినట్టు తెలిసింది. ఇతర పార్టీలకంటే ముందుగానే టికెట్లను ప్రకటించాలని బీఆర్ఎస్ భావిస్తున్నందున డ్రాప్టు లిస్టుకు ఫినిషింగ్ టచ్ ఇవ్వడంపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం.
సెప్టెంబర్ 6 సెంటిమెంట్..
ఈ నెల 18 తర్వాత ఏ రోజైనా అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ప్రకటించే చాన్స్ ఉన్నదనే వార్తలు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. కానీ సెప్టెంబరు 6వ తేదీ సెంటిమెంట్ కూడా దృష్టిలో ఉన్నట్టు గుర్తుచేశారు. ఫస్ట్ టర్ము కంప్లీట్ కావడానికి ముందే అసెంబ్లీని రద్దు చేయాలని భావించిన కేసీఆర్.. సెప్టెంబర్ 6, 2018న కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. నిమిషాల వ్యవధిలోనే రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్‌కు తీర్మానం కాపీని అందజేశారు. తర్వాత 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య మెజారిటీతో బీఆర్ఎస్ విజయం సాధించింది.
ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌తో ఫస్ట్ లిస్టును సెప్టెంబరు 6వ తేదీన రిలీజ్ చేస్తారా? లేక మంచి ముహూర్తం చూసుకుని ఈ నెల 18న తర్వాత ఏదో ఒక రోజు అనౌన్స్ చేస్తారా? అనే విషయంపై పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. గత నెలలోనూ దాదాపు వారం పాటు ఫామ్ హౌజ్‌లో ఉన్న కేసీఆర్.. అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వివిధ సెక్షన్ల ఓటు బ్యాంకును పరిగణనలోకి తీసుకుని కొత్త స్కీమ్‌లను ప్రకటించారు.
50కు పైగా అంశాలతో కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకోవడం మొదలు మైనార్టీలకు లక్ష సాయం, రైతు రుణమాఫీ పథకాన్ని సెప్టెంబరు సెకండ్ వీక్‌లోగా కంప్లీట్ చేయడం తదితరాలపై నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కూడా మూడు రోజుల నుంచి ఫామ్ హౌజ్‌లోనే మకాం వేసిన సీఎం కేసీఆర్ అభ్యర్థుల జాబితాపైనే లోతుగా కసరత్తు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఫస్టు లిస్టులో ఎవరెవరు..?
దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్‌లు ఇస్తామని పలు సందర్భాల్లో పార్టీ అధినేత కేసీఆర్ హామీ ఇవ్వడంతో ఫస్ట్ లిస్టులో ఎవరెవరి పేర్లు ఉంటాయనే ఆసక్తి అందరిలో నెలకొన్నది. ఆశావహులు సైతం ఒకింత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. హరీశ్‌రావుతో జరిపిన చర్చల వివరాలు బయటకు పొక్కే అవకాశం లేకపోవడంతో లిస్టు రిలీజ్ అయ్యే వరకు ఎదురుచూడక తప్పదని బీఆర్ఎస్‌లోని ఆస్పిరెంట్స్, సిట్టింగ్‌లు భావిస్తున్నారు. హరీశ్‌రావును హడావిడిగా ముఖ్యమంత్రి పిలిపించుకోవడానికి కారణం అభ్యర్థుల జాబితాను కొలిక్కి తీసుకురావడమేననే అభిప్రాయాలు పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి.