మా సంగతేంది.. ఏఐసీసీ నేతలపై పెరుగుతున్న ఒత్తిడి

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలుకు టైమ్ దగ్గర పడుతుండడంతో అభ్యర్థులను ఖరారు చేయడంపై కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. ఢిల్లీలోని వార్ రూమ్‌లో తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతున్నది.

Update: 2023-10-08 08:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలుకు టైమ్ దగ్గర పడుతుండడంతో అభ్యర్థులను ఖరారు చేయడంపై కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. ఢిల్లీలోని వార్ రూమ్‌లో తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతున్నది. మొత్త, 119 స్థానాల అభ్యర్థులను ఈ మీటింగులో ఖరారు చేయడంపై నేతలు దృష్టి పెట్టారు. ఇక్కడ ఫిల్టర్ అయిన జాబితాను కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ పరిశీలించి ఫైనల్ చేయనున్నది. ఎల్లుండి ఢిల్లీలోనే జరిగే ఈ భేటీలో రాష్ట్రానికి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొననున్నారు. పరిశీలన అనంతరం ఏఐసీసీకి జాబితా వెళ్లనున్నది. ఒకేసారి జాబితాను రిలీజ్ చేస్తుందా?.. లేక విడతలవారీగా చేస్తుందా?.. ఈ అంశాలపై క్లారిటీ రావాల్సి ఉన్నది. వారం రోజుల్లోనే మొత్తం అభ్యర్థులను ప్రకటించేలా కసరత్తు జరుగుతున్నది.

టికెట్ కోసం ఒకవైపు ఆశావహులు గంపెడాశలు పెట్టుకోగా మరోవైపు వివిధ కుల సంఘాల నేతలు, కాంగ్రెస్ అనుబంధ విభాగాలు కూడా అంతే నమ్మకాన్ని పెట్టుకున్నాయి. ఓబీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలంటూ రెండు వారాల క్రితమే ఢిల్లీకి వెళ్ళి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు రాష్ట్ర బీసీ నేతలు విజ్ఞప్తి చేశారు. బీసీలకు కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందని, బీఆర్ఎస్ ఇచ్చిన సీట్ల కంటే ఎక్కువే ఉంటాయని పీసీసీ చీఫ్ రేవంత్ పలుమార్లు స్పష్టం చేశారు. కానీ నమ్మకం కుదరకపోవడంతో స్క్రీనింగ్ కమిటీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశాల సందర్భంగా ఒత్తిడి పెంచడం కోసం రాష్ట్ర నేతలు వారి వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇంకోవైపు మహిళా కాంగ్రెస్ సైతం కనీసం పాతిక సీట్లను మహిళలకే ఇవ్వాలని పట్టుబడుతున్నది. గతంలోనే ఢిల్లీ వెళ్ళి ఈ డిమాండ్‌ను పార్టీ అధిష్టానం ముందు ఉంచింది. తాజాగా స్క్రీనింగ్ కమిటీ భేటీ సందర్భంగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేత సునీతారావ్ వార్ రూమ్ బైటే ఉన్నారు. దీనికి తోడు యూత్ కాంగ్రెస్ సైతం ఐదు సీట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నది. రాష్ట్రంలో కమ్మ సామాజికవర్గ ప్రాధాన్యతను, నిష్పత్తిని దృష్టిలో పెట్టుకుని కనీసంగా పది సీట్లను ఇవ్వాలంటూ రేణుకా చౌదరి నేతృత్వంలోని ఆ కుల సంఘ నేతలు ఇటీవల మల్లికార్జున ఖర్గేకు విజ్ఞప్తి చేశారు. లిస్టును తయారుచేసే సమయంలో అన్ని వైపుల నుంచి పార్టీ అగ్రనేతలపై ఒత్తిడి పెరుగుతుండడంతో చివరికి ఏమవుతుందనేది ఉత్కంఠగా మారింది.

స్క్రీనింగ్ కమిటీ భేటీలో మొత్తం 119 స్థానాల గురించి లోతుగా చర్చించిన తర్వాత స్పష్టత రానున్నది. కుల సమీకరణాలు, విజయావకాశాలు, అసంతృప్తి బెడద.. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని జాబితాను కొలిక్కి తేవడం పీసీసీ, ఏఐసీసీ నేతలకు సవాలుగా మారింది. ఈ నెల 14వ తేదీకల్లా మొత్తం జాబితాను దశలవారీగా ప్రకటించాలని ఏఐసీసీ భావిస్తున్నదని ఒక సీనియర్ నేత సూచనప్రాయంగా తెలిపారు.

Tags:    

Similar News