చక్రం తిప్పుతున్న కాంగ్రెస్.. గులాబీ బాస్ లెక్క తప్పుతోందా?
మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సీఎం రికార్డు సృష్టించాలని గులాబీ బాస్, సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. ప్రతిపక్షాలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదన్న ఆలోచనతో గెలుపు కోసం అవసరమైన వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సీఎం రికార్డు సృష్టించాలని గులాబీ బాస్, సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. ప్రతిపక్షాలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదన్న ఆలోచనతో గెలుపు కోసం అవసరమైన వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల భిన్నంగా మారుతుండటంతో కేసీఆర్ లెక్క తప్పుతున్నదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా 2014 నుంచి వరుసగా రెండు సార్లు ఎదురు లేకుండా దూసుకుపోతున్న బీఆర్ఎస్ కు ఈసారి పరిస్థితులు భిన్నంగా మారాయి. రెండు దఫాల బీఆర్ఎస్ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేక పెరిగింది. ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీలు బలపడ్డాయి. అయితే ప్రతిపక్ష పార్టీలని విడివిడిగా పోటీ చేస్తామని గతంలో ప్రకటనలు చేయడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి అది తమకు అనుకూలంగా మారుతుందని కేసీఆర్ లెక్కలు వేసుకోగా అనూహ్యంగా పరిస్థితులు తారుమారు అయ్యాయి. తెలంగాణలో పోటీకి టీటీడీపీ విముఖత చూపగా అదే బాటలో వైఎస్సార్ టీపీ కూడా నిర్ణయం తీసుకుంది. తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ప్రకటించారు. అంతకు ముందే టీజేఎస్ సైతం కాంగ్రెస్ తో కలిసి నడుస్తామని ప్రకటన చేశారు.
కాంగ్రెస్ పెరుగుతున్న మద్దతు:
తెలంగాణ ఇచ్చిన పార్టీగా రెండు సార్లు విఫలమైనా ఈసారి ఆ ఛాన్స్ వదులుకునేందుకు హస్తం నేతలు సిద్ధంగా లేరు. ఎలాగైనా కేసీఆర్ సర్కార్ ను ఇంటికి పంపించి అధికారంలోకి రావడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ క్రమంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ కేసీఆర్ కు చెక్ పెట్టే ప్రణాళికలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ ఉధ్యమంతో అనుబంధం ఉన్న టీజేఎస్ అధినేత కోదండరామ్ తో చర్చలు జరిపి కలిసి నడిచేందుకు ఒప్పించగా తాజాగా షర్మిల సైతం బేషరతుగా కాంగ్రెస్ కు మద్దుతు ప్రకటిస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చవద్దనే ఉద్దేశంతోనే తాము పోటీ నంచి తప్పుకున్నట్లు ఆమె ప్రకటించారు. మరోవైపు కమ్యూనిస్టులతో చర్చలు ముగిసిపోలేదని శుక్రవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ఆసక్తిగా మారింది. దీంతో సీపీఐ, సీపీఎం పొత్తులపై సస్పెన్స్ గానే మారింది. 17 స్థానాల్లో పోటీ చేస్తామని సీపీఎం ప్రకటన చేసినా రేవంత్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆ నిర్ణయం వెనక్కి తీసుకుంటారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
కేసీఆర్‌కు కఠిన సవాలు:
ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ పోటీకి దూరంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయం తీసుకునప్పటికీ టీడీపీ శ్రేణులు ఎవరికి ఓటు వేయాలనే నిర్ణయాన్ని పార్టీ స్పష్టం చేయలేదు. దీంతో టీడీపీ ఓట్లు కీలకంగా మారపోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న 25 స్థానాల్లో సెటిలర్ల ప్రభావం ఉండటంతో వీరంతా ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఉత్కంఠ రేపుతున్నది. కాంగ్రెస్ బలపడటంతో సెటిలర్ల ఓటర్లను సాధ్యమైనంత వరకు తమ వైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. కానీ జనసేన రూపంలో బీజేపీ సైతం సెటిలర్లు, కమ్మ సామాజిక వర్గం ఓటర్లపై గురి పెట్టింది. కానీ చంద్రబాబు అరెస్టు విషయంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సెటిలర్లు, టీడీపీ శ్రేణులు బీఆర్ఎస్ పై గుర్రుగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో టీడీపీ ఓటర్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం రోజు రోజుకు బలపడుతున్నది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్ని కాంగ్రెస్ వైపు మళ్లుతున్నాయన్న సంకేతాలు బీఆర్ఎస్ అభ్యర్థులకు టెన్షన్ గా మారుతోందన్న టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లకుండా బీఆర్ఎస్ చంద్రబాబు మద్దతు కోరినా కోరవచ్చనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.