ప్రజాక్షేత్రంలోకి గాజర్ల అశోక్‌.. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక

మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్‌ అలియాస్‌ ఐతు గురువారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన అశోక్ తన సహచరులు, అనుచరులతో కలసి గాంధీభవన్‌లో రేవంత్ చేతుల మీదుగా కండువా కప్పుకున్నారు.

Update: 2023-10-12 13:36 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్‌ అలియాస్‌ ఐతు గురువారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన అశోక్ తన సహచరులు, అనుచరులతో కలసి గాంధీభవన్‌లో రేవంత్ చేతుల మీదుగా కండువా కప్పుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజా సంఘాలు, కమ్యూనిస్టులతో మంచి రిలేషన్ ఉన్న అశోక్​కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది. ఆయన చేరికతో దాదాపు నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ పార్టీ ఆశాభవం వ్యక్తం చేసింది.

25 ఏళ్ల తర్వాత..

ఉద్యమానికి ఊపిరు లూదిన వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల అశోక్‌ అలియాస్‌ ఐతు ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. పేదల ప్రజల కోసం దాదాపు 25 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో పనిచేసిన ఆయన ఇప్పుడు తన ఉద్యమ ప్రస్థానాన్ని నేరుగా ప్రజల కోసం అంకితం చేసేందుకు బయటకొచ్చారు. గతంలో భూర్జువా, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన రీతిలోనే ప్రస్తుతం ప్రజల పక్షాన నిలవాలని భావిస్తున్నారు. మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రజాపోరాటంలో భాగస్వామిగా కొనసాగనున్నారు. కుటుంబ వారసత్వంగా వచ్చిన ఉద్యమ నేపథ్యాన్ని బలం, బలగంగా మార్చుకుంటూ ‘నేను సైతం’ అంటూ ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. దీంతో తెలంగాణ విమోచనకు, సాయుధ రైతాంగ పోరాటానికి ఆయువుగా నిలిచిన పరకాల నియోజకవర్గ రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోతాయని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతున్నది.

విప్లవ కుటుంబ నుంచి.. కేసీఆర్ పై పోరాటానికి..

ప్రస్తుత జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామం అంటేనే గుర్తుకు వచ్చేది ‘గాజర్ల’ కుంటుంబం. అప్పటి పీపుల్స్‌ వార్‌ నుంచి ఇప్పటి మావోయిస్టు పార్టీకి అంకితమైన కుటుంబంగా పేరొందింది. ఆ కుటుంబానికి చెందిన వాళ్లంతా గతంలో ‘దొర’ల పాలనకు.. పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ప్రజలలో చైతన్యం తెచ్చి హక్కుల కోసం పోరాడారు. దీంతో ఇప్పుడున్న దొరల పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వెల్లడించారు. ఇక వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల కనకమ్మ, మల్లయ్య దంపతులకు రాజయ్య, సమ్మయ్య, సారయ్య, రవి, అశోక్‌లు సంతానం. పెద్ద కొడుకు రాజయ్య అనారోగ్యంతో మరణించగా రెండో కొడుకు సమ్మయ్య సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైరయ్యారు. తల్లిదండ్రులు కనకమ్మ, మల్లయ్యలు కన్నుమూయడంతో సారయ్య, రవి, అశోక్‌లు విప్లవపంథాను ఎంచుకుని పీడిత వర్గాల కోసం పోరాడుతున్నారు.

పోరాటానికి ఆజ్యం ‘సింగిల్‌’ విండో ఎన్నికలు..

వ్యవసాయ సహాకార పరపతి సంఘాల(సింగిల్‌విండో) ఎన్నికలకు ఆ గ్రామంలో చిచ్చుపెట్టగా ‘గాజర్ల’ కుటుంబం పోరాటబాట పట్టడానికి ఆజ్యం పోశాయి. గ్రామంలో 1987లో జరిగిన ఎన్నికలలో డైరెక్టర్‌గా పోటీ చేసిన గాజర్ల సారయ్య(భాస్కరన్న, ఆజాద్‌) కొన్ని కారణాలతో ఓటమి పాలై, పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడడానికి 1989లో అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరారు. అయితే, అప్పుడు పోలీసుల నిర్భందం, వేధింపులు, అణచివేత మూలంగా 1992లో గాజర్ల రవి అలియాస్‌ గణేష్, 1994లో గాజర్ల అశోక్‌ అలియాస్‌ ఐతులు కూడా ‘అన్న’ల బాట పట్టారు.

అమరులు ఆజాద్‌.. రమ..

పీపుల్స్‌వార్‌లో చేరిన గాజర్ల సారయ్య అలియాస్‌ భాస్కర్‌ పేరిట చిట్యాల దళకమాండర్‌గా పని చేసి అంచలంచెలుగా ఎదిగి పీపుల్స్‌వార్‌ నుంచి మావోయిస్టు పార్టీగా మారిన పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్‌గా, మిలటరీ ప్లాటూన్‌ కమాండర్‌గా పనిచేసి ఏటూరునాగారం అటవీప్రాంతం కంతనపల్లి అడవుల్లో 2008 ఏప్రిల్‌ 2న జరిగిన ఎన్‌కౌంటర్‌లో తన సహచరి రమతోపాటు ఊపిరి వదిలారు. ఆ ఎన్‌కౌంటర్‌ ఇప్పటికీ సంచలనంగా మిగిలిపోగా న్యాయ విచారణ సైతం కొనసాగింది.

చర్చల ప్రతినిధిగా గణేష్‌...

ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2004–05లో ప్రభుత్వంతో జరిగిన ‘శాంతి’ చర్చలలో అప్పటి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో కలిసి పార్టీ తరుపున ప్రతినిధిగా గణేష్​ పాల్గొన్నారు. అప్పటికే ఆయన ఆంధ్రా–ఒడిసా బార్డర్‌ కమిటీకి ప్రాతినిథ్యం వహిస్తుండడం గమనార్హం. అయితే, అప్పటి ప్రభుత్వ విధానాలతో పార్టీకి పొసగకపోవడంతో తిరిగి మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లాడు. ప్రతీ సారీ ఎక్కడ ‘ఎన్‌కౌంటర్‌’ జరిగినా ‘గాజర్ల’ సోదరుల పేర్లు వినబడటం చిట్యాల ప్రాంత వాసులకు నిత్యకృత్యంగా మారింది. మెరుపుదాడులు చేయడం, వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో ముగ్గురు ‘గాజర్ల’ సోదరులు ఆరితేరిన వారుగా ఇప్పటికీ పార్టీలో, పోలీసు వర్గాలలో పేరుండడం గమనార్హం.

అనారోగ్యంతో ‘ఐతు’ లొంగుబాటు

రెండున్నర దశాబ్దాల ఉద్యమ ప్రస్థానానికి ‘అనారోగ్యం’ కారణమవడంతో దండకారణ్య స్పెషల్‌జోన్‌ కమిటీ మెంబర్‌గా పనిచేస్తున్న గాజర్ల అశోక్‌ అలియాస్‌ ఐతు 2016లో వరంగల్‌ పోలీసులకు లొంగిపోయి సాధారణ జీవనం గడుపుతున్నాడు. తనతోపాటు తన సోదరులు ‘నమ్ముకున్న’ సిద్ధాంతానికి కట్టుబడి ఉపాధి కోసం సిమెంట్‌ ఇటుకల తయారీ పరిశ్రమ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు.

పరకాల ‘కాంగ్రెస్‌’ అభ్యర్థిగా పేరు చర్చ..?

శాసనసభ ఎన్నికల్లో భాగంగా పరకాల కాంగ్రెస్‌ అభ్యర్థిగా గాజర్ల అశోక్‌ పేరు తెరపైకి రావడం కాంగ్రెస్‌లో హాట్ టాఫిక్ అయింది. రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన పరకాల స్థానం నుంచి ‘బరి’లో నిలిపేందుకు కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోన్నది. ఇప్పటికే పరకాల స్థానం కోసం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, నియోజకవర్గ ఇన్‌చార్జీగా ఉన్న ఇనగాల వెంకట్రామిరెడ్డిలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సడన్‌గా పార్టీ అధిష్టానం అశోక్‌పై దృష్టి సారించడం ఆసక్తికరంగా మారింది. పరకాల స్థానం నుంచి అశోక్‌ను బరిలో నిలపడం ద్వారా భూపాలపల్లి, ములుగు, మంథని, నర్సంపేట నియోజకవర్గాలలో ప్రభావం ఉంటుందనేది కాంగ్రెస్ విశ్వాసం.

Tags:    

Similar News