కుల సంఘాల నేతల అత్యుత్సాహం.. ఎన్నికలయ్యాక ఏంటి పరిస్థితి?
ఎన్నికలు వచ్చాయంటే చాలు అన్ని రాజకీయ పార్టీలకు కుల సంఘాల నేతలు, మత పెద్దలు గుర్తుకు వచ్చేస్తారు. వాటి ఆధారంగానే రాజకీయాలు నడిపేందుకు విశ్వప్రయత్నాలు చేస్తారు.
దిశ, శేరిలింగంపల్లి: ఎన్నికలు వచ్చాయంటే చాలు అన్ని రాజకీయ పార్టీలకు కుల సంఘాల నేతలు, మత పెద్దలు గుర్తుకు వచ్చేస్తారు. వాటి ఆధారంగానే రాజకీయాలు నడిపేందుకు విశ్వప్రయత్నాలు చేస్తారు. ఆయా కులాల ఓట్లు తమకే పోలయ్యే విధంగా మంతనాలు సాగిస్తారు. ఇందులో చాలా వరకు నేతలు సక్సెస్ అవుతారు. కానీ శేరిలింగంపల్లిలో మాత్రం ఆయా పార్టీల నాయకులకంటే ఎక్కువగా కుల సంఘాలే అత్యుత్సాహం చూపుతున్నాయని, మేము మీవెంటే అంటూ కుల సంఘాలు ఆయా పార్టీలకు మద్దతు ప్రకటిస్తూ కుల సంఘాలు, కొన్ని వర్గ సంఘాలు అభాసు పాలవుతున్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కొందరు వ్యక్తులు, కొన్ని సంఘాలు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం నవ్వుల పాలవుతుంది.
సంఘ సభ్యుల అత్యుత్సాహం..
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కొన్ని సంఘాల నాయకుల అత్యుత్సాహం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. నూతనంగా ఏర్పడిన ఆ సంఘ కార్యవర్గం ఈ ఎన్నికల్లో మేమంతా ఐక్యంగా ఉన్నామని నిరూపించుకునేందుకు నానా తంటాలు పడుతుంది. ఏదైనా మేమున్నాం అని చూపెట్టుకునేందుకు ఆసక్తి చూపుతుంది. ఇందులో భాగంగా ఇటీవల ఓ నాయకుడికి టికెట్ రాగానే ఉన్న పళంగా ఆ సంఘ సభ్యులు సదరు నాయకుడి దగ్గరకు వెళ్లి శాలువాలు కప్పి మేమెంతా మీ వెంటే ఉన్నాం, మా అందరి సపోర్టు మీకే అంటూ పూర్తిస్థాయి మద్దతు ప్రకటించారు. అది అలా ఉండగానే ఇటీవల మరో నాయకుడికి మరో పార్టీ నుండి టికెట్ వచ్చింది. వెంటనే అక్కడ వాలిపోయిన అదే సంఘ సభ్యులు మళ్లీ అక్కడికి వెళ్లి మీకే మా సంపూర్ణ మద్దతు అంటూ మరోసారి ఆ లీడర్‌కు కూడా కండువా కప్పి సన్మానాలు చేశారు. ఒకే సంఘం నాయకులు ఏ పార్టీ లీడర్ దగ్గరకు వెళ్తే ఆ పార్టీకి మద్దతు తెలుపుతూ చేస్తున్న హడావుడి చూసి శేరిలింగంపల్లి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.
వారికంటే మేమేం తక్కువ కాదు..
ఇక మరోసంఘం కూడా వారికి మేమేం తక్కువ కాదంటూ హడావుడి చేస్తుంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునేది చూస్తూ మిగతా వారు మా సంఘం పరువు బజారున పడేస్తున్నారంటూ పలువురు మండిపడుతున్నారు. ఓ సంఘానికి సంబంధించిన వారు ఇటీవల ఓ పార్టీకి మద్దతు తెలిపారు. అధ్యక్షుడు మినహా మిగతా కార్యవర్గం అంతా సపోర్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఓ పార్టీకి చెందిన వారు మాత్రం తమకేం సంబంధం లేదని, సంఘం ఎవరి సొత్తు కాదంటూ సోషల్ మీడియా సాక్షిగా నానా రచ్చ చేస్తున్నారు. అందరూ ఒకవైపు, వారొక్కరు ఒకవైపు అన్నట్లుగా సాగుతుంది ఆ సామాజిక వర్గ సంఘం తీరు. ఇక మరో సంఘానికి సంబంధించి కొందరు నాయకులు ఒక పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ఓ పత్రికలో వార్తలు రాగా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆ సంఘంలోని మిగతా సభ్యులు సంఘం నుండి ఎలాంటి ప్రకటన చేయలేదని, అవన్నీ వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని స్పష్టం చేశారు.
అసలేం జరుగుతుంది..
శేరిలింగంపల్లి రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. మూడు ప్రధాన పార్టీల నుండి బలమైన అభ్యర్థులు బరిలో నిలువడంతో ఇక్కడ ఎవరు గెలుస్తారు ఎవరు ఒడతారు అనేదానిపై సర్వత్రా చర్చ నడుస్తుంది. అయితే కులాల వారిగా, సంఘాల వారిగా విడిపోయి మేము ఇటు.. మీరు అటు అంటూ సాగుతున్న కుల, వర్గ రాజకీయాల వల్ల ఎవరికి లబ్ధిచేకూరుతుంది. ఎవరికి నష్టం వాటిల్లుతుంది అనేది ఇప్పుడప్పుడే రాజకీయ విశ్లేషకులు కూడా సరైన అంచనా వేయలేని పరిస్థితి.