ఎంపీపై హత్యాయత్నం ఎఫెక్ట్: బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ కీలక పిలుపు

దుబ్బాక అసెంబ్లీ పరిధిలో ప్రచారం చేసుకుంటున్న బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో జరిగిన దాడి ఒక వ్యక్తిగా ఆయన మీద జరిగినది కాదని.. పార్టీ అధినేతగా తన మీద జరిగిన దాడి అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

Update: 2023-10-30 11:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక అసెంబ్లీ పరిధిలో ప్రచారం చేసుకుంటున్న బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో జరిగిన దాడి ఒక వ్యక్తిగా ఆయన మీద జరిగినది కాదని.. పార్టీ అధినేతగా తన మీద జరిగిన దాడి అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో కత్తులతో దాడులు చేయడం, హింసకు పాల్పడడాన్ని సమాజం ఖండించాలన్నారు. బాన్సువాడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పదేండ్లలో ఎన్నికల్లో ఎప్పుడూ తాము ఇలాంటి హింసకు పాల్పడలేదు.. కత్తులతో దాడి చేయాలంటే మాకు కత్తులు దొరకవా.. మాకు చేతుల్లేవా?.. మాకు తిక్కరేగితే మీరు మిగులుతారా?.. అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. మాకు కూడా కత్తులతో దాడి చేసే దమ్మున్నదని, మేమూ అదే పనిచేస్తే దుమ్ము కూడా మిగలదన్నారు.

గన్‌మెన్ అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి ప్రభాకర్‌రెడ్డికి ప్రాణాపాయం తప్పిందని, కాపాడే ప్రయత్నంలో ఆయన కూడా గాయపడ్డారని అన్నారు. దాడులు చేసే వాళ్ళు తస్మాత్ జాగ్రత్త అని కేసీఆర్ హెచ్చరించారు. దాడుల్ని ఆపకపోతే, సెల్ఫ్ కంట్రోల్ చేసుకోకపోతే.. అదే పని మేమూ చేస్తే మీరు మిగలరని వార్నింగ్ ఇచ్చారు. చేతకాని దద్దమ్మలు, వెధవలు, పనిచేయడం చేతకానోళ్ళు, ఎన్నికలను ఫేస్ చేసే దమ్ము లేనోన్లు ఇలాంటి హింసకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇటువంటి సంఘ విద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు బీఆర్ఎస్ నేతలకు కార్యకర్తలకు అధినేత పిలుపునిచ్చారు.

Tags:    

Similar News