మేనిఫెస్టోలో పెట్టి ఏం ప్రయోజనం.. అమలుకు నోచుకోని గత హామీల పరిస్థితేంటి?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం అనేక వాగ్ధానాలతో బీఆర్ఎస్ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదివారం రిలీజ్ చేశారు. ఇదే సమయంలో గత ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల సంగతేంటనే చర్చ విపక్షాలతో పాటు ప్రజల్లోనూ చర్చలకు దారి తీసింది.
దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం అనేక వాగ్ధానాలతో బీఆర్ఎస్ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదివారం రిలీజ్ చేశారు. ఇదే సమయంలో గత ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల సంగతేంటనే చర్చ విపక్షాలతో పాటు ప్రజల్లోనూ చర్చలకు దారి తీసింది. ఫస్ట్ టైమ్ ఓటర్లతో పాటు విద్యార్థులు, యూత్, నిరుద్యోగులు ఈ మేనిఫెస్టోపై పెదవి విరుస్తున్నారు. ఐదేండ్లుగా అమలు చేయకుండా పక్కన పెట్టేసిన హామీల గురించి వివరణ లేకుండా కొత్త హామీలను మేనిఫెస్టోలో పెట్టి ఏం ప్రయోజనం అనే అభిప్రాయాలు అర్బన్ ప్రజల నుంచీ వ్యక్తమవుతున్నాయి. ఈసారి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలవుతాయో లేదో అనే సందేహాలను పలువురు వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలోని కొన్ని హామీలు అసలు ప్రారంభానికే నోచుకోలేదు.
మరికొన్ని అసంపూర్ణంగా, పాక్షికంగా అమలవుతున్నాయి. కొన్ని ప్రారంభమైనా అర్థంతరంగా ఆగిపోయాయి. గత మేనిఫెస్టోలో మొత్తం 24 హామీలను బీఆర్ఎస్ అధినేత ప్రకటించారు. ఇందులో కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోవి కాగా, మరికొన్ని కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అమలయ్యేవి. ఆసరా పింఛన్ల పెంపు, రైతుబంధు సాయం పెంపు, ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసు పెంపు మినహా మిగిలినవేవీ సంపూర్ణంగా అమలుకాలేదు. కొన్ని ‘నామ్ కే వాస్తే’ తరహాలో ప్రారంభమై లాజికల్ ఎండ్‌కు వెళ్లకుండా మధ్యలోనే ఉండిపోయాయన్నది పలు సెక్షన్ల ప్రజల అభిప్రాయం.
అసంపూర్తిగా రుణమాఫీ
రూ.లక్ష రూపాయల వరకు రైతు రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని గత ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఆరవ హామీగా పేర్కొన్నది. పవర్‌లోకి వచ్చిన తర్వాత రెండు విడతల్లో రూ.36 వేల వరకు మాత్రమే మాఫీ చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఏడాది పంద్రాగస్టు ముందు రోజు నుంచి ఈ ప్రక్రియను పునఃప్రారంభించింది. సెప్టెంబరు సెకండ్ వీక్‌కల్లా మొత్తం ప్రక్రియను పూర్తి చేస్తామన్నది. అందులో భాగంగా రూ.99,999 వరకు ఉన్న రైతులకు ఆగస్టు చివరి వారంలో మాఫీ చేయగా రూ.లక్ష రుణం ఉన్నవారికి ఇప్పటికీ పూర్తి స్థాయిలో మాఫీ కాలేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంకా రూ.8 వేల కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉన్నది.
దళితబంధు అంతే..
హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా దళితబంధు స్కీంను బీఆర్ఎస్ తెరమీదకు తెచ్చింది. లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున అందిస్తామని హామీ ఇచ్చింది. ఆ నియోజకవర్గంలో, వాసాలమర్రి గ్రామంలో శాచ్యురేషన్ పద్ధతిలో పూర్తిగా అమలుచేసినా ఇప్పటికీ చాలా గ్రామాల్లో ఈ స్కీం అమలుకావడం లేదు. గత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌లో రూ.17,700 కోట్లను కేటాయించినా సర్కారు ఒక్క పైసా విడుదల చేయలేదు. ఈ ఏడాది సైతం అంతే మొత్తంలో బడ్జెట్‌లో కేటాయింపులు జరిపినా నిధుల విడుదల ప్రశ్నార్థకంగా మారింది. కొంతమందికి సాయం అందినా స్థానిక ఎమ్మెల్యేలు 30% కమిషన్ తీసుకున్నారని స్వయంగా ముఖ్యమంత్రే వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ఆ స్కీమ్ గాల్లోనే వేలాడుతున్నది.
గృహలక్ష్మి, ఇండ్ల స్థలాలు
సొంత జాగ ఉన్నవారికి ఇల్లు కట్టుకోడానికి రూ.5లక్షల నుంచి 6 లక్షల సాయం చేయనున్నట్టు నాల్గవ హామీగా బీఆర్ఎస్ పేర్కొన్నది. కానీ ఈ సాయాన్ని ఇప్పుడు రూ.3 లక్షలకు కుదించింది. పేదల నుంచి దరఖాస్తులు తీసుకున్నా సాయం మాత్రం ఒక్కరికీ అందలేదు. మార్గదర్శకాలు రూపొందినా గాడిన పడలేదు. డబుల్ బెడ్‌రూమ్ స్కీమ్ కొనసాగుతుందని పేర్కొన్నప్పటికీ కట్టిన ఇండ్లను చాలా వరకు లబ్ధిదారులకు అందించలేదు. మంత్రులను, ఎమ్మెల్యేలను నియోజకవర్గాల్లో పేదలు నిలదీస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో కంప్యూటరైజేషన్ పద్ధతిలో డ్రా ద్వారా కేటాయింపు హంగామా నడుస్తున్నది.
అమలుకాని రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ వేతనం
రైతు సమన్వయ సమితి పేరుతో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో యూనిట్లను ఏర్పాటు చేసింది. అందులోని సభ్యులకు గౌరవ వేతనం ఇస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో 7వ హామీగా బీఆర్ఎస్ పేర్కొన్నది. ఆ సమితుల్లో అధికార పార్టీ కార్యకర్తలను సభ్యులుగా పెట్టడంపై విమర్శలనూ ఎదుర్కొన్నది. అసెంబ్లీ వేదికగా ‘మేం మా పార్టీ వారినే నియమిస్తాం..’ అంటూ స్వయంగా ముఖ్యమంత్రే వ్యాఖ్యానించారు. కానీ ఇప్పటికీ ఆ సభ్యులకు గౌరవ వేతనం అందని ద్రాక్షగానే ఉండిపోయింది.
అలంకారంగా హెల్త్ ప్రొఫైల్ స్కీమ్
కంటివెలుగు ప్రోగ్రామ్‌ను అద్భుతమైనదిగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. ఈ తరహాలోనే రాష్ట్ర ప్రజలందరికీ వైద్య పరీక్షలు చేయడానికి మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి అందరి హెల్త్ ప్రొఫైల్‌ను డిజిటలైజ్ చేస్తామని గత ఎన్నికల సందర్భంగా 17వ హామీగా పేర్కొన్నది. ఆర్భాటంగా ములుగు, సిరిసిల్ల జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది. తూతూ మంత్రంగా సాగిన ఈ స్కీమ్ కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లగానే వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ చూసి వెంటనే ట్రీట్‌మెంట్ మొదలయ్యేలా ఉంటుందని గొప్పగా ప్రకటించుకున్నా అతీగతి లేకుండా ఉండిపోయింది.
ఆచరణకు నోచుకోని ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన
వ్యవసాయ ఉత్పత్తులకు వ్యాల్యూ ఎడిషన్ చేసి విదేశాలకు ఎగుమతి మొదలు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడానికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను స్థాపించనున్నట్టు 16వ హామీగా గత ఎన్నికల మేనిఫెస్టోలో బీఆర్ఎస్ పేర్కొన్నది. నాలుగున్నరేండ్లు గడిచినా అది హామీగానే మిగిలిపోయింది. ఇటీవల జపాన్‌కు చెందిన ఒక కంపెనీతో అవగాహన కుదిరినట్టు ప్రభుత్వం ప్రకటించుకున్నది. కానీ రైతులకు ఇప్పటివరకూ ఈ హామీతో ఒరిగిన ప్రయోజనమేమీ లేదు. మరోవైపు ఐకేపీ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్న హామీ కూడా కాగితాలకే పరిమితమైంది.
రెడ్డి, వైశ్య కార్పొరేషన్ల ఏర్పాటూ అంతే..
ఆర్థికంగా వెనకబడిన వర్గాల సంక్షేమం కోసం రెడ్డి, వైశ్య కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని గత మేనిఫెస్టోలో 13వ హామీగా బీఆర్ఎస్ పేర్కొన్నది. ఐదేండ్లు కావస్తున్నా ఈ హమీని పట్టించుకోలేదు. వైశ్య కార్పొరేషన్ ఏర్పాటును డిమాండ్ చేస్తూ ఇటీవల వైశ్య సంఘాలు ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేశాయి. రెడ్డి కార్పొరేషన్ డిమాండ్ విషయంలో గతేడాది జూన్‌లో మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆయా జిల్లాల్లో కలెక్టర్లకు రెడ్డి సంఘాలు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాయి.
పెన్షనర్లకు ప్రత్యేక డైరెక్టరేట్ ఉత్తదే
పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తామని గత ఎన్నికల్లో బీఆర్ఎస్ హామీ ఇచ్చినా ఇప్పటికీ అది అందని ద్రాక్షగానే ఉండిపోయింది. దీని ఊసెత్తని కేసీఆర్.. 2023 మేనిఫెస్టోలో మాత్రం కాంపెన్సేటరీ పెన్షన్ స్కీమ్ స్థానంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావడానికి అధ్యయనం చేస్తామని, ఇందుకోసం కమిటీని నియమిస్తామని, నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. పాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మాటలకే పరిమితం కావడంతో ఇప్పుడు ఓపీఎస్ విషయంలో అధ్యయన కమిటీ, నివేదిక, నిర్ణయం అనే హామీతో ఉద్యోగులు, పెన్షనర్లు పెదవి విరుస్తున్నారు.
కొత్త హామీలు
కేసీఆర్ భీమా - ప్రతి ఇంటికీ ధీమా
= తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి తలా రూ.5 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్
అన్నపూర్ణ స్కీమ్
= వైట్ రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం సరఫరా
సౌభాగ్యలక్ష్మి
= మహిళలకు నెలకు రూ.3 వేల గౌరవ భృతి
= రూ.400కే గ్యాస్ సిలిండర్
= మిగతా హామీలన్నీ పాత పథకాలకు కొనసాగింపు