ఆ విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు: సీపీఐ నారాయణ

నెల్లూరులో ప్రారంభమైన లిక్కర్ స్కాం హైదరాబాద్‌కు చేరిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ వ్యాఖ్యనించారు. వైసీపీ నాయకులకే లిక్కర్ తయారీ కంపెనీలున్నాయని ఆరోపించారు.

Update: 2023-11-09 14:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరులో ప్రారంభమైన లిక్కర్ స్కాం హైదరాబాద్‌కు చేరిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ వ్యాఖ్యనించారు. వైసీపీ నాయకులకే లిక్కర్ తయారీ కంపెనీలున్నాయని ఆరోపించారు. గురువారం గూడూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. లిక్కర్ స్కాంలో కీలక పాత్ర ఆంధ్రాలో వైసీపీ నాయకులు, తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులదేనన్నారు. అయితే ఆ రెండు పార్టీలు బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తుండడంతో లిక్కర్ స్కాం ఢిల్లీకి చేరిందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఆప్ నేత సిసోడియాను లిక్కర్ స్కాంలో జైలుకు పంపించారన్నారు. ప్రస్తుతం అదే కేసులో కేజ్రీవాల్ అరెస్టుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కై తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరావు ఇంటిపై సీబీఐ, ఈడీ లతో దాడులు చేయించి ఇళ్లు, వాహనాలు సీజ్ చేశారన్నారు. అలాగే ఆంధ్రలో మోడీ, అమిత్ షాల సహకారం లేనిదే నాలుగు దఫాలు సీఎంగా పనిచేసిన చంద్రబాబును జైలుకు పంపించలేన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయనే విషయాన్ని తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారన్నారు. కాళేశ్వరం కుంభకోణంతో బీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారిందని, ఎన్నికల అనంతరం వీఆర్ఎస్ (వాలంటరీ రిటైర్మెంట్ సంస్థ)గా మారుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఆ పార్టీ పతనం ప్రారంభమైందన్నారు.

Tags:    

Similar News