కాంగ్రెస్ పార్టీ ‘పవర్’ ప్లాన్.. రంగంలోకి దిగనున్న ఎన్ఆర్‌ఐలు!

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వంద సీట్లు గెలవాలని లక్ష్యం పెట్టుకున్నది. పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ఇంటింటికీ చేరవేసి ప్రజల మద్ధతును కోరనున్నది. ఇప్పటి వరకు 70 సీట్లు వస్తాయని ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్.. ఆ సంఖ్యను వందకు పెంచాలని టార్గెట్ పెంచుకున్నది.

Update: 2023-10-22 02:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వంద సీట్లు గెలవాలని లక్ష్యం పెట్టుకున్నది. పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ఇంటింటికీ చేరవేసి ప్రజల మద్ధతును కోరనున్నది. ఇప్పటి వరకు 70 సీట్లు వస్తాయని ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్.. ఆ సంఖ్యను వందకు పెంచాలని టార్గెట్ పెంచుకున్నది. రాహుల్ బస్సు యాత్ర తర్వాత ఉత్తర తెలంగాణలోనూ పార్టీలో ఊపు రావడంతో ఈ సంఖ్యను చేరుకోవడం సులువేనని హైకమాండ్ అభిప్రాయ పడుతున్నది. దీంతోనే ఆరు గ్యారంటీలను ప్రతి గడపకూ చేరవేసి, ఓటర్లను ఆకట్టుకునే బాధ్యతలను ఏఐసీసీ ఎన్ఆర్ఐ టీమ్‌లకు అప్పగించింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాతో పాటు ప్రతి గడపకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల హామీలను ఎన్ఆర్ఐ టీములు విస్తృతంగా ప్రచారం చేయనున్నాయి. ఇప్పటికే లండన్‌లో లాంఛనంగా ఆరు-నూరు పేరిట ప్రచారం మొదలు పెట్టారు. దసరా తర్వాత రాష్ట్రంలోనూ ఆరు గ్యారంటీలు.. వంద సీట్ల కాన్సెప్ట్తో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఎన్ఆర్ఐ సెల్ గంపా వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.

ఐటీ కంపెనీలు.. ఎన్ ఆర్ ఫ్యామిలీలు

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్ఆర్ఐలంతా ఏకమయ్యారు. వివిధ దేశాల్లో ఉండే ఇండియన్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా ఎన్ఆర్ఐ ఇండియన్స్ అనే వాట్సాప్ గ్రూప్‌ను తయారు చేసుకున్నారు. వీరంతా దసరా తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయనున్నారు. ప్రధానంగా ఐటీ ఉద్యోగులు, ఎన్ఆర్ఐ ఫ్యామిలీలను సంప్రదించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ మోటివేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఎన్ఆర్ఐలకు సంబంధాలు కలిగిన ప్రతి గ్రామాన్ని టచ్ చేసి కాంగ్రెస్‌కు ఓటు బ్యాంక్ పెంచనున్నారు. శనివారం లండన్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని తెలంగాణలో ఎలా నిర్వహించాలనేది? మాజీ మంత్రి శ్రీధర్ బాబు ఎన్ఆర్ఐ టీములకు జూమ్ మీటింగ్ ద్వారా వివరించారు. ఇప్పటికే ఆన్‌లైన్, టెలీ కాల్స్, ఫోన్ల ద్వారా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతున్న ఎన్ఆర్ఐలు ఇక నుంచి ప్రత్యక్షంగానే ప్రచారం చేసేందుకు రంగంలోకి దిగనున్నట్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్ఆర్ఐ సెల్ పేర్కొన్నది. దాదాపు 30 రోజుల పాటు ఇక్కడే ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కృషి చేయనున్నట్లు ఓ ఎన్ఆర్ఐ వెల్లడించారు.

స్టూడెంట్స్‌కు రూ.5లక్షల ఏటీఎమ్ కార్డు

కాంగ్రెస్ పార్టీ యువత, మహిళలు, రైతులకు ఇవ్వబోయే వివిధ సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ వివరించనున్నారు. విద్యార్థుల కోసం రూ.5లక్షల ఏటీఎమ్ కార్డుతో పాటు రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మెగా డీఎస్సీ నిర్వహణ, ఒకే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ వంటి స్కీములను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లనున్నారు. గల్ఫ్ సంక్షేమ బోర్డు, ఎన్నారై సెల్ బోర్డును సైతం ఏర్పాటు చేయనున్నామని వివరించనున్నారు.

ఇద్దరు స్పెషల్ అబ్జర్వర్లు

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం, రాజకీయ వ్యూహాల అమలు, పార్టీ కార్యక్రమాలపై మానిటరింగ్ చేసేందుకు ఏఐసీసీ ఇద్దరిని స్పెషల్ అబ్జర్వర్లుగా నియమించింది. అశోక్ శంకర్రావ్ చవాన్, ఎన్ఎస్ బోసు రాజుకు ప్రత్యేకంగా తెలంగాణ ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను పార్టీ అప్పగించింది.

Tags:    

Similar News