తెలంగాణలో ‘మూడే’దెవరికి.. ఆదిలోనే కేసీఆర్‌కు భారీ ఎదురుదెబ్బ!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విడుదల చేసింది. నవంబర్ 30 తేదీన రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సీఈసీ రాజీవ్ కుమార్ ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించి వెల్లడించారు.

Update: 2023-10-09 10:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విడుదల చేసింది. నవంబర్ 30 తేదీన రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సీఈసీ రాజీవ్ కుమార్ ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించి వెల్లడించారు. కాగా, షెడ్యూల్ ప్రకారం.. తెలంగాణ ఎన్నికల గెజిట్ నవంబర్ 3వ తేదీన విడుదల కానుంది. నవంబర్ 10వ తేదీ నామినేషన్ల స్వీకరణకు చివరి తేది. నవంబర్ 13వ తేదీన నామినేషన్ల పరిశీలన.. నవంబర్ 15 నామినేషన్ల ఉపసంహరణకు డెడ్ లైన్ విధించారు. నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించి అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. షెడ్యూల్ విడులైన క్రమంలో తెలంగాణ పాలిటిక్స్‌లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతుంది.

జ్యోతిషాలను ఎక్కువగా నమ్మే సీఎం కేసీఆర్‌కు ఈసీ తాజాగా విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్‌లో తేదీలు ఏ మాత్రం కలిసి వచ్చేలా లేవనే ప్రచారం జోరందుకుంది. సీఎం కేసీఆర్‌కు ఆరో నంబర్ సెంటిమెంట్. ఆయన ఏ పని చేసినా, ప్రారంభించినా 6 వచ్చే విధంగా చూసుకుంటారు. సీఎం కేసీఆర్‌ లక్కీ నంబర్ 6. ఆయన వాహనం నంబర్, సెల్ ఫోన్ నంబర్ అన్నీ ‘ఆరు’తో మమేకమై ఉంటాయి. ఆయన కాన్వాయ్‌లోనూ ఆరు వాహనాలు ఉంటాయి. కేసీఆర్ జీవితంలో 6కు అంతటి ప్రాధాన్యం ఉంది. రాజకీయంగా కేసీఆర్ వేసిన, వేసే ప్రతి అడుగూ ఆరుతోనే ముడిపడి ఉంటుంది. 2018 తెలంగాణ అసెంబ్లీని సైతం సెప్టెంబర్ 6వ తేదీనే రద్దు చేశారు. కేసీఆర్‌కు లక్కీ నెంబర్ అయిన 6వ (అక్టోబర్) తేదీన 2018 ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈసీ విడుదల చేసింది. కేసీఆర్ సెంటిమెంట్ ప్రకారం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 88 సీట్లు సాధించి ఘన విజయం సాధించింది.

ఈ షెడ్యూల్‌లో కలిసిరాని డేట్స్

తాజాగా ఈసీ విడుదల చేసిన తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌లో తేదీలు సీఎం కేసీఆర్‌కు ఏ మాత్రం కలిసి వచ్చేలా లేవని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ సెంటిమెంట్ నెంబర్ 6 వచ్చేలా ఏ తేదీ లేదు. ఎన్నికల గెజిట్ నవంబర్ 3, నామినేషన్ల స్వీకరణ 10, నామినేషన్ల పరిశీలన 13, ఉపసంహరణ 15, పోలింగ్ 30, కౌంటింగ్, రిజల్స్ట్ 3వ తేదీన ఉన్నాయి. ఇందులో కేసీఆర్ సెంటిమెంట్ నెంబర్ అయిన 6 ఒక్క చోట కూడా లేకపోవడం గమనార్హం. రెండు పర్యాయాలు ఘన విజయం సాధించిన కేసీఆర్.. ఈ సారి హ్యాట్రిక్ విజయం సాధించాలని చూస్తున్నారు. అందుకు తగ్గట్లే వ్యూహాలు రచిస్తున్నారు. అన్ని పార్టీల కంటే ముందే ఏకంగా 115 మంది అభ్యర్థులను ప్రకటించారు.

కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూలులో తెలంగాణకు సంబంధించి కీలకమైన తేదీలన్నీ మూడుతో ముడిపడి ఉండడంతో ‘మూడే’దెవరికి అనేది ఆసక్తికరంగా మారింది. మూడోసారి పవర్‌లోకి రావడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్, రెండు టర్ములు అధికారానికి దూరంగా ఉండి కనీసం మూడో టర్ములోనైనా అదృష్టాన్ని పరీక్షించుకోడానికి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాల్లో ఎవరికి లక్, ఎవరిక బ్యాడ్‌లక్ అనే గుసగుసలు మొదలయ్యాయి.

Tags:    

Similar News