రైతు రుణమాఫీపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్లుగా రుణమాఫీని అందరికీ సకాలంలో ఇవ్వలేకపోయామని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇవ్వలేకపోయామంటూ పరోక్షంగా ఒప్పుకున్నారు.

Update: 2023-11-02 16:31 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్లుగా రుణమాఫీని అందరికీ సకాలంలో ఇవ్వలేకపోయామని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇవ్వలేకపోయామంటూ పరోక్షంగా ఒప్పుకున్నారు. ఇంకా కొంతమంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉన్నదని అన్నారు. నిర్మల్‌లో గురువారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఆశించినట్లుగా రెండో టర్ములో సంపూర్ణ రుణమాఫీ చేయలేకపోయామన్న పరోక్ష సంకేతాన్ని ఇచ్చారు. అర్హులైన లబ్ధిదారుల్లో ఇంకా చాలా మందికి రుణమాఫీ జమ కావాల్సి ఉందన్న స్పష్టత ఇచ్చారు. ఎన్నికల కోడ్ కారణంగా రుణమాఫీకి కొన్ని ఇబ్బందులు తలెత్తినట్లు వివరించారు.

ఇప్పుడు రుణమాఫీ నిధులను జమ చేయాలన్నా ఎలక్షన్ కారణంగా సమస్యాత్మకం అవుతున్నదని వివరించిన కేసీఆర్.. ఎన్నికల సంఘం నుంచి అనుమతి వస్తే వారం.. పది రోజుల్లోనే అందరికీ పడతాయన్న భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కొందరు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారని, దానిపై ఇంకా నిర్ణయం వెలువడాల్సి ఉన్నదని, అది వచ్చిన తర్వాత స్పష్టత వస్తుందన్నారు. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఓకే చెప్తే పది రోజుల్లో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, లేదంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా పడిపోతాయని నిర్మల్ సభలో కేసీఆర్ నొక్కిచెప్పారు. తొమ్మిదేళ్ళ కాలంలో రెండు టర్ముల్లో సుమారు రూ. 37 వేల కోట్లను రుణమాఫీకి ఖర్చు చేసినట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ అభ్యర్థులంతా ఎన్నికల ప్రచారంలో రుణమాఫీ అంశాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. రెండు టర్ముల్లోనూ సంపూర్ణంగా అమలైనట్లు ప్రకటిస్తున్నారు. రుణమాఫీ కోసం ఈ టర్ములో సుమారు రూ. 21 వేల కోట్ల మేర నిధులు విడుదల కావాల్సి ఉండగా ఇప్పటివరకు రూ. 13 వేల కోట్లు మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఇంకా రూ. 8 వేల కోట్ల మేర నిధులు సకాలంలో సమకూరని కారణంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయలేకపోయినట్లు ఆర్థిక శాఖ అధికారులు గత నెలలో వివరించారు. పోలింగ్ తేదీకి వారం రోజుల ముందు ఇవ్వడం ద్వారా పొలిటికల్‌గా మైలేజ్ పొందవచ్చన్నది బీఆర్ఎస నేతల ఆలోచన. ఆ కారణంగానే గత నెలలో విడుదల చేయకుండా నవంబరులో జమ చేసేలా వెయిట్ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించుకోవడంలో ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొన్నది. ఈ కారణంగానే సంపూర్ణంగా అమలు చేయలేకపోయింది. నవంబరులో రిలీజ్ కోసం చేసుకున్న ఏర్పాట్ల సంగతి ఎలా ఉన్నా సంపూర్ణంగా అమలు చేయాలనుకున్నా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదువల్లనే ఇబ్బందులు వచ్చాయని తప్పించుకోడానికి దారులు వెతుక్కున్నది. ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి వస్తే వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేసి ఓటింగ్‌పై ప్రభావం చూపి పొలిటికల్ మైలేజ్ పొందడానికి వెసులుబాటు లభించినట్లవుతుంది. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోయినట్లయితే కాంగ్రెస్ మీదకు నెపం నెట్టి ఆర్థిక సమస్యలను డైవర్ట్ చేయడానికి మార్గం సుగమం అయినట్లవుతుంది.

Tags:    

Similar News