కోమటిరెడ్డి ఎలాంటోడో నాకు నకిరేకల్‌లోనే చెప్పారు: సీఎం కేసీఆర్
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కేసీఆర్ నల్లగొండలో పర్యటించారు.
దిశ, వెబ్‌డెస్క్: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కేసీఆర్ నల్లగొండలో పర్యటించారు. ఈ సందర్భంగా కంచర్ల భూపాల్ రెడ్డి గెలుపునకై ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడారు. నల్లగొండ పట్టణంలో మేధావులు, చదువుకున్న వాళ్లు, ఉద్యోగస్తులు ఉంటారు.. మీ అందర్నీ కోరుతున్నా.. జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓటేయండి అని అన్నారు. నల్లగొండలో ఇవాళ బ్రహ్మాండమైన డెవలప్మెంట్ కనబడుతోందని చెప్పారు. రూపాయికే కనెక్షన్ ఇచ్చి నల్లా నీళ్లు ఇస్తున్నాం. ఈ జరిగే అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో మీరు జారవిడుచుకోవద్దు అని సూచించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రగల్భాలు మీకు తెలుసు. వాళ్ల డబ్బు అహంకారంతోని ఇంతకు ముందే నాకు నకిరేకల్‌లో చెబుతున్నారు.
నకిరేకల్‌లో మేం గెలిచిన తర్వాత రామన్నపేట నుంచి నకిరేకల్ దాకా అందర్నీ పండవెట్టి తొక్కుతం అని మాట్లాడుతున్నారు. ఈ పండవెట్టి తొక్కేటోళ్లే కావాల్నా ఎమ్మెల్యేలు..? వీళ్లేనా మనకు కావాల్సింది. భూపాల్ రెడ్డి ఓడినా, గెలిచినా ప్రజల్లో ఉన్న వ్యక్తి. గతంలో కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ఓడినా.. గెలిచినా అదే ఇంట్లో ఉన్నాడు తప్ప ఇల్లు కూడా మార్చలేదని అన్నారు. నల్లగొండ నియోజకవర్గం మంచిగా అభివృద్ధి జరుగుతున్నది. దీన్ని ఇదే విధంగా కాపాడుకోవాల్సిన బాధ్యత నల్లగొండ వాసుల మీద ఉన్నది. ఏదో కల్లబొల్లి మాటలు నమ్మి గందరగోళమైతే నష్టపోయేది మీరే అని కీలక వ్యాఖ్యలు చేశారు.