రేపు బీఆర్ఎస్‌ బీఫాంల పంపిణీ.. కొంతమందిని మార్చే అవకాశం?

సీఎం కేసీఆర్ ఆదివారం తెలంగాణ భవన్‌కు రానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేసి బీఫాంలు అందజేయనున్నారు. ఇప్పటికే కొన్ని స్థానాల్లో మార్పు తప్పదనే లీకులు ఇవ్వడంతో ఎవరెవరికి అధిష్టానం మొండిచెయ్యి చూపనుందనేది పార్టీ అభ్యర్థులు, నేతల్లో ఉత్కంఠ నెలకొంది.

Update: 2023-10-14 02:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ ఆదివారం తెలంగాణ భవన్‌కు రానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేసి బీఫాంలు అందజేయనున్నారు. ఇప్పటికే కొన్ని స్థానాల్లో మార్పు తప్పదనే లీకులు ఇవ్వడంతో ఎవరెవరికి అధిష్టానం మొండిచెయ్యి చూపనుందనేది పార్టీ అభ్యర్థులు, నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఆశావహుల్లో మాత్రం టికెట్లపై ఆశలు చిగురిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న ఐదు నియోజకవర్గాలకు సైతం అభ్యర్థులను ప్రకటించనున్నారు. మేనిఫెస్టోను రిలీజ్ చేస్తుండటంతో కొత్త పథకాలు, హామీలు ఏముండే అవకాశం ఉందనే ఆసక్తి నెలకొంది.

ప్రచారంపై గైడెన్స్..

ఆగస్టు 21న బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన అనంతరం దాదాపు 56 రోజుల తర్వాత ఈ నెల 15న కేసీఆర్ తెలంగాణ భవన్ కు వస్తున్నారు. ప్రజల్లోకి ఎలా వెళ్లాలి.. పదేళ్ల ప్రగతిపై ఎలా వివరించాలి.. సంక్షేమ, అభివృద్ధిని వివరించే విధానంపైనా సూచనలు చేయనున్నారు. విపక్షాలను ఎలా కట్టడి చేయాలి, ప్రచారంలో ఎలాంటి విధానాలు అనుసరించాలి, ప్రజలను ఎలా ఆకట్టుకోవాలనే అంశాలపై క్లుప్తంగా వివరించే అవకాశం ఉంది. అంతేకాదు అభ్యర్థులను ప్రకటించిన నాటి నుంచి ఇప్పటివరకు ఎవరెవరూ ప్రచారంలో దూసుకుపోతున్నారు, ఎవరి పనితీరు ఎలా ఉంది... ఇంకా ఎలాంటి ప్రణాళికలతో ముందుకు సాగాలి... వెనుకబడినవారు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు సాగాలనే అంశాలను చర్చించనున్నారు.

పలువురి మార్పు తప్పదా?

ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలతోపాటు ప్రైవేటు సర్వేల వివరాలను సైతం కేసీఆర్ క్లుప్తంగా వివరించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ అభ్యర్థులను ప్రకటించిన రోజే పనితీరు మెరుగుపడని అభ్యర్థులను మారుస్తామని కేసీఆర్ ప్రకటించారు. ప్రకటించిన 115మంది అభ్యర్థుల్లో రెండు నుంచి ఐదుగురి మార్పు అనివార్యమని, వారికి బీఫాం ఇవ్వబోరని, కొత్తవారికి ఇస్తారన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో అభ్యర్థుల్లో గుబులు పుట్టింది. ఇప్పటికే ఆసిఫాబాద్, ఖానాపూర్, బోధ్, కామారెడ్డి, వేములవాడ, ఉప్పల్, వైరా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చిన కేసీఆర్.. ఖానాపూర్, బోథ్, కోరుట్ల, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లోనూ కొత్తవారికి అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.

మిగిలిన సెగ్మెంట్లపై క్లారిటీ..

కాగా, నర్సాపూర్, నాంపల్లి, జనగామ, గోషామహల్ నియోజకవర్గాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. నేతలతో సంప్రదింపులు జరిపి ఇప్పటికే అభ్యర్థులను సెలక్ట్ చేశారు. వారిని ఆదివారమే ప్రకటించడంతోపాటు పార్టీ భీపాంలను అందజేయనున్నారు. అదేవిధంగా మల్కాజ్ గిరి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మైనంపల్లి హనుమంతరావు పార్టీకి రాజీనామా చేయగా, ఆ స్థానంలో మర్రి రాజశేఖర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి భీపాం ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే 54 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జులను నియమించగా మిగిలిన సెగ్మెంట్ల ఇన్ చార్జులను సైతం రెండు మూడ్రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

Tags:    

Similar News