కేసీఆర్‌ టెన్షన్ మొత్తం కాంగ్రెస్ పాపులారిటీపైనే.. ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టి!

‘కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఏ మేరకు ఆదరణ ఉంది? రాబోయే ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపనుంది? అనే అంశాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టిసారించారు.

Update: 2023-10-04 01:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ‘కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఏ మేరకు ఆదరణ ఉంది? రాబోయే ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపనుంది? అనే అంశాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టిసారించారు. పార్టీ నేతల నుంచి జిల్లాల వారీగా వివరాలను తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా మూడు జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టి.. వ్యూహాలను రచిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ కు కౌంటర్ గా స్ట్రాటజీలను రూపొందించినట్లు సమాచారం. ఈ సారి కూడా కొడంగల్ లో రేవంత్ ను ఓడించాలని ప్రణాళికలు రూపొందించి అమలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తున్నది.

ప్రత్యేక ప్రణాళికలు

రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటున్నది. ప్రజల్లో రోజురోజుకు ఆ పార్టీ పట్ల ఆదరణ పెరుగుతున్నట్లు ప్రభుత్వ, ప్రైవేటు సర్వేల్లో వెల్లడవుతున్నది. దీంతో కాంగ్రెస్ కు అడ్డుకట్ట వేసేందుకు కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పరిస్థితి? ఆ పార్టీ నేతల బలం? బీఆర్ఎస్, కాంగ్రెస్ కు మధ్య తేడా ఏమిటి? అనే ఫీడ్ బ్యాక్ ను పార్టీ నేతల నుంచి కేసీఆర్ సేకరిస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పై ఉన్న ఆదరణ గురించి కూడా తెలుసుకుంటుండడం గమనార్హం. నెలరోజులుగా కాంగ్రెస్ గ్రాఫ్ ఏ మేరకు పెరిగింది? 6 గ్యారెంటీలు ప్రజల్లోకి ఏమేర వెళ్లాయనే వివరాలను కేసీఆర్ ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

మూడు జిల్లాలపై ప్రత్యేక దృష్టి

ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ కాంగ్రెస్ కు పట్టున్న జిల్లాలు. ఇక్కడ అధిక సీట్లు సాధించేలా ఆపార్టీ ప్రణాళికలు రచిస్తున్నది. ఈ జిల్లాల్లో గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరారు. అయితే ఈ ఉమ్మడి జిల్లాల్లో మళ్లీ ఎక్కువ స్థానాలు గెలిచి అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతున్నది. బీఆర్ఎస్ అసమ్మతి నేతలు, టికెట్లు ఆశించి భంగపడ్డవారిని తమ పార్టీలో చేర్చుకుటున్నది. ఇప్పటికే ఈ ఉమ్మడి జిల్లాల్లో బలంగా ఉన్న హస్తంపార్టీ చేరికలతో మరింత బలోపేతం అవుతున్నది. అయితే ఎలాగైనా కాంగ్రెస్ ను ఓడించాలని బీఆర్ఎస్ ప్రణాళికలు రూపొందిస్తున్నది. అందుకోసం వ్యూహాలను రచిస్తున్నది. ఈ మూడు జిల్లాల్లో గతం కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని అభివృద్ధి కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఒకవైపు పెండింగ్ పనులు పూర్తి చేస్తూనే.. ప్రత్యేక నిధులను సైతం కేటాయిస్తూ ముందుకు సాగుతున్నది.

స్పెషల్ ఫండ్స్ కు హామీ

కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గాలపై కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించారు. ఆయా నియోజకవర్గాల్లోని పెండింగ్ పనులతోపాటు నూతన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల స్పీడ్ పెంచారు. అదే విధంగా స్పెషల్ ఫండ్ హామీలు ఇవ్వడంతోపాటు గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత బలోపేతం చేస్తామని హామీలు ఇస్తున్నారు. అంతేగాకుండా కాంగ్రెస్ లో అసంతృప్తితో ఉన్న సెకండ్ స్థాయి లీడర్లకు సైతం గులాబీ కండువా కప్పుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ నాటికి మరింత స్పీడ్ పెంచాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు అడ్డుకట్టవేసేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రణాళికలు ఏమేరకు సత్ఫలితాలిస్తాయో చూడాలి.

రేవంత్‌కు కౌంటర్‌గా..

ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యంగా రేవంత్ రెడ్డి విమర్శల స్పీడ్ పెంచారు. సభలు, సమావేశాలతోపాటు సోషల్ మీడియాలోనూ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అదే విధంగా తాజాగా కాంగ్రెస్ ప్రకటించిన 6గ్యారెంటీలైన మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీంతో రేవంత్ స్పీడ్ కు అడ్డుకట్టవేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. అందులో భాగంగానే తొలుత కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ ను కట్టడి చేసేందుకు కిందిస్థాయి నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారు. సెకండ్ స్థాయి లీడర్ కాంగ్రెస్ లో లేకుండా చేయాలని నేతలకు పదవుల హామీలు, ప్రలోభాలకు తెరదీసినట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు, నీటి సమస్య, ఉద్యోగ, ఇతర అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని, అవినీతి పెరుగుతుందనే ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తుంది.

Tags:    

Similar News