పరేడ్ గ్రౌండ్‌‌లో కేసీఆర్ సభ వాయిదాకు కారణం వర్షం కాదా?

హైదరాబాద్‌లో పబ్లిక్ మీటింగ్స్‌కు అటెండ్ అయ్యేందుకు సీఎం కేసీఆర్‌కు టైమ్ కలిసి రావడం లేదని టాక్. ఎప్పుడూ ఎదో ఒక అంశం అడ్డంకిగా మారుతోందనే ప్రచారం జరుగుతున్నది.

Update: 2023-11-25 03:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో పబ్లిక్ మీటింగ్స్‌కు అటెండ్ అయ్యేందుకు సీఎం కేసీఆర్‌కు టైమ్ కలిసి రావడం లేదని టాక్. ఎప్పుడూ ఎదో ఒక అంశం అడ్డంకిగా మారుతోందనే ప్రచారం జరుగుతున్నది. సీఎం హోదాలో ఆయన ఇంతవరకు సిటీలో జరిగే రాజకీయ బహిరంగ సభల్లో పాల్గొనలేకపోయారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నెల 25న పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే పబ్లిక్ మీటింగ్ వర్షం కారణంగా రద్దు చేసినట్టు పైకి చెప్తున్నప్పటికీ, ఇంటర్నల్‌గా ఏదో బలమైన కారణం ఉందనే చర్చ జరుగుతోంది.

జనాలు రారనే రిపోర్టు

పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే పబ్లిక్ మీటింగ్‌ను సక్సెస్ చేసేందుకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సిటీ ఎమ్మెల్యేలు పలు సమీక్షలు నిర్వహించారు. సభ నిర్వహణ కోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే ఒక్క రోజు ముందు వర్షం కారణంగా సభను రద్దు చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. కానీ రద్దు నిర్ణయం వెనుక జన సమీకరణ సమస్య ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. అనుకున్న స్థాయిలో సభకు జనాలు వచ్చే అవకాశం లేదని, మంత్రులు, ఎమ్మెల్యేలు జన సమీకరణపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదని నిఘా వర్గాలు రిపోర్టు ఇచ్చినట్టు తెలిసింది. ఒకవేళ అనుకున్న మేరకు జనం రాకపోతే సీఎం కేసీఆర్ పరువు పోతుందనే కారణంతో మీటింగ్‌ను క్యాన్సిల్ చేసినట్టు సమాచారం.

గతంలో రెండు సార్లు ఇలాగే

2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ మీటింగ్స్‌కు అటెండ్ అయ్యారు. చివరి మీటింగ్‌ను హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో పెట్టాలనే ఉద్దేశంతో ప్లాన్ చేశారు. కానీ జన సమీకరణ సమస్య ఉందని గ్రహించి, ఒక్క రోజు ముందు సభను రద్దు చేసుకున్నారు. డిసెంబర్ 2020లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్‌కు ప్రచార బాధ్యతలు, మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలకు పలు డివిజన్ల బాధ్యతలు అప్పగించారు. అయితే సీఎం కేసీఆర్ పబ్లిక్ మీటింగ్‌తో ఎన్నికల ప్రచారానికి ముగింపు ఇవ్వాలని భావించి, అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ జన సమీకరణ సమస్య వస్తుందనే కారణంతో అప్పుడు కూడా పబ్లిక్ మీటింగ్‌ను రద్దు చేసుకున్నట్టు టాక్.

Tags:    

Similar News