ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ రెడీ.. మళ్లీ అదే ఫార్ములా!

ఎన్నికల ప్రచారానికి గులాబీ బాస్ కేసీఆర్ రెడీ అవుతున్నారు. ఈ నెల 15న హుస్నాబాద్ వేదికగా ప్రజా ఆశీర్వాద సభతో ఎన్నికల శంఖారావాన్ని సీఎం కేసీఆర్ పూరించబోతున్నారు.

Update: 2023-10-13 03:56 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి: ఎన్నికల ప్రచారానికి గులాబీ బాస్ కేసీఆర్ రెడీ అవుతున్నారు. ఈ నెల 15న హుస్నాబాద్ వేదికగా ప్రజా ఆశీర్వాద సభతో ఎన్నికల శంఖారావాన్ని సీఎం కేసీఆర్ పూరించబోతున్నారు. అధినేత సభ కోసం బీఆర్ ఎస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రత్యేకంగా సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భారీ జన సమీకరణతో బల ప్రదర్శన చేయాలని నిర్ణయించారు. 2014, 2018 ఎన్నికల సందర్భంగా హుస్నాబాద్ నుంచే సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ రెండు ఎన్నికల్లో సక్సెస్ అందుకోవడంతో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావటానికి అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టి ప్రత్యేక రాష్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ కు సెంటిమెంట్ కూడా ఎక్కువే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తొలిసారి 2014లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ హుస్నాబాద్ నుంచి ప్రారంభించారు. ఆ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 63 స్థానాల్లో కారు పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంతో కేసీఆర్ పాలనా పగ్గాలు చేపట్టారు.

ఆ తర్వత 2018 లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సందర్భంలో సైతం ఎన్నికల ప్రచారాన్ని మాత్రం హుస్నాబాద్ నుంచే ప్రారంభించారు. ఆ ఎన్నికల్లో 88 స్థానాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో కేసీఆర్ రెండో సారి సీఎం అయ్యారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్లాలన్న పట్టుదలతో ఉన్నారు. గత సెంటిమెంట్ ప్రకారం ఈ సారి కూడా హుస్నాబాద్ నుండే ఎన్నికల సమర శంఖారావం పురించలని నిర్ణయించినట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి హుస్నాబాద్ నియోజక వర్గం ఈశాన్య దిక్కున ఉంటుంది. అందుకే హుస్నాబాద్ ను కలిసొచ్చే ప్రాంతంగా భావిస్తున్న కేసీఆర్ ప్రతి ఎన్నికల్లోనూ తొలి సభ హుస్నాబాద్ లో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్వహించే సభ కోసం ఎస్ పోతారం గ్రామ సమీపంలో మైదానంలో సభకు ఏర్పాటు చేస్తున్నారు.

17న సిద్దిపేటలో..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ 17న సిద్దిపేట లో నిర్వహించే ఎన్నికల బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. సిద్దిపేట నాగదేవత గుడి నుంచి సిరిసిల్ల రోడ్డు వెళ్లే బైపాస్ రోడ్డు లో గల స్థలంలో సభ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే సభాస్థలిని మంత్రి తన్నీరు హరీశ్ రావు పరిశీలించి సభ ఏర్పాట్ల పై పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు.

గులాబీ శ్రేణుల్లో ఫుల్ జోష్..

ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఉంటే..గులాబీ బాస్ కేసీఆర్ ప్రచార శంఖారావం పురించేందకు సిద్దమవుతుండటంతో గులాబీ శ్రేణులు పుల్ జోష్ లో ఉన్నారు. భారీ బహిరంగ సభలు, ప్రచార వ్యూహాలతో నాయకులు సిద్దమవుతన్న క్రమంలో పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. హుస్నాబాద్ నియోజక వర్గం నుండి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముచ్చటగా మూడో సారి ప్రచార సభ ప్రారంభిస్తుండటంతో ఈ సారి సైతం పార్టీ విజయ తీరాలను చేరడం ఖాయమని నాయకులు, కార్యకర్తలు ధీమాగా ఉన్నారు.

Tags:    

Similar News