హరీష్ రావు, కేటీఆర్‌‌‌కు మరో BIG టాస్క్.. ప్రత్యేక భేటీలో కేసీఆర్ దిశా నిర్దేశం!

బీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్‌ను మరింత పెంచనుంది. విపక్షాల్లో టికెట్లు దక్కని నేతలే టార్గెట్‌గా చేసుకొని గులాబీ గూటికి చేర్చనున్నారు. అందుకోసం నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జిలను నియమించేందుకు నేతల పేర్లను సైతం సేకరించారు.

Update: 2023-10-13 02:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్‌ను మరింత పెంచనుంది. విపక్షాల్లో టికెట్లు దక్కని నేతలే టార్గెట్‌గా చేసుకొని గులాబీ గూటికి చేర్చనున్నారు. అందుకోసం నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జిలను నియమించేందుకు నేతల పేర్లను సైతం సేకరించారు. వారు ఆయా సెగ్మెంట్లో విపక్షాల్లో ఉన్న అసంతృప్తి నేతలతో సంప్రదింపులు జరిపి గాలం వేయనున్నారు. అయితే, ఈసీ భారీగా అధికారులను తొలగించడంతో అనుకూలంగా ఉండేవారి కోసం పేర్లను పరిశీలిస్తుంది. మరోవైపు రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ అధినేత కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులతో కీలక భేటీ నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ పై చర్చించినట్లు సమాచారం.

బూత్ లెవల్ నుంచి పరిశీలన..

అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీ పెంచాలని భావిస్తుంది. అందులో భాగంగానే వరుస బహిరంగ సభలు, రోడ్‌షోలు, ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొనే ప్రచార సభలతో హోరెత్తించాలని డిసైడ్ అయ్యింది. ఎన్నికల క్షేత్రంలో విపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేయాలని భావిస్తోంది. అందుకోసమే కాంగ్రెస్, బీజేపీలో టికెట్లు రాని నేతలను, ఇతర పార్టీల్లో బలమైన నేతల వివరాలను సేకరిస్తున్నది. విపక్షాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఓవైపు బూత్‌ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు వివిధ పార్టీల బలాలు, బలహీనతలు, స్థానికంగా ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు, సామాజికవర్గాల వారీగా ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు. విపక్ష పార్టీల్లోని బలమైన నేతలు, వారి చేరికలకు ఉన్న అవకాశం, పార్టీలో చేర్చుకునేందుకు తీసుకోవాల్సిన చొరవ తదితరాలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.

ఫీడ్ బ్యాక్ ఆధారంగా..

అదే విధంగా ఓ ప్రైవేటు సంస్థ నుంచి కూడా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటున్నారు. ఆ సమాచారం ఆధారంగా రాబోయే రోజుల్లో ఇతర పార్టీల నుంచి చేరికలను వేగవంతం చేయాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. ఈ మధ్యకాలంలోనే కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలు తిరుపతి రెడ్డి, నందికంటి శ్రీధర్, బిల్యానాయక్, చామల ఉదయ్‌చందర్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డితో పాటు ఓ మాజీ మంత్రి కూడా త్వరలో బీఆర్‌ఎస్‌లో చేరికకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. వీరేకాదు మరికొంతమందిని సైతం ఎన్నికల నాటికి చేర్చకునేందుకు లిస్టును కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది. విడతలవారీగా పార్టీలో చేర్చుకొని విపక్షాలకు చెక్ పెట్టనుంది.

అభ్యర్థులకు ఒత్తిడి తగ్గించేలా..

పోటీచేసే పార్టీ అభ్యర్థులపై ఒత్తిడి తగ్గించడంతో పాటు పార్టీ అధినేత, ఇతర కీలక నేతలతో సమన్వయం కోసం 119 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్ చార్జిలను నియమించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. వారికే పూర్తి బాధ్యతలను అప్పగించనున్నట్లు సమాచారం. 54 నియోజకవర్గాల్లో ఇప్పటికే నియమించినట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రభుత్వ కార్పోరేషన్ల చైర్మన్లతో పాటు మరికొందరు క్రియాశీల నేతలతో కూడిన జాబితాను రూపొందించారు. అదే విధంగా గ్రేటర్‌ పరిధిలో కేటీఆర్‌, ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలో హరీశ్ రావు ప్రచారానికి సారథ్యం వహిస్తూనే తాము పోటీ చేసే సెగ్మెంట్లతో పాటు అప్పగించిన చోట సమన్వయ బాధ్యతలను చూడాల్సి ఉంటుంది.

కేసీఆర్ దిశా నిర్దేశం..

సీఎం కేసీఆర్ గురువారం ప్రగతిభవన్‌లో మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచారం, జన సమీకరణ, ఇతర పార్టీల నుంచి చేరికలు, నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జిల నియామకం, పార్టీ యంత్రాంగం నడుమ సమన్వయం తదితర అంశాలపై అనుసరించాల్సిన కార్యాచరణపై కేసీఆర్‌ దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో పలువురు కీలక అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అదే విధంగా అసంతృప్తులు, పెండింగ్ టికెట్లపై చర్చినట్లు తెలిసింది. బీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్న నేతల లిస్టుపై కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఈనెల 15న బీ ఫారాల అందజేత, ఎన్నికల స్ట్రాటజీ, మేనిఫెస్టో, సభలపై డిస్కస్ చేశారు. పార్టీ అభ్యర్థులకు దిశా నిర్దేశం చేయాల్సిన అంశాలపైనా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం.

Tags:    

Similar News