కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులకు ప్రగతి భవన్‌ నుంచి ఫోన్.. కారణమిదే!

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఎక్కువ మంది ఇండిపెండెంట్లను, విపక్ష పార్టీల రెబల్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోకుండా వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం.

Update: 2023-11-12 02:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఎక్కువ మంది ఇండిపెండెంట్లను, విపక్ష పార్టీల రెబల్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోకుండా వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం వారితో మంతనాలు జరుపుతున్నది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వారికి వెంటనే కావాల్సిన వనరులను సమకూర్చుతున్నది. బుజ్జగింపులకు లొంగి, పోటీ నుంచి తప్పుకునే అవకాశం ఉన్న కాంగ్రెస్ రెబల్స్‌కు బీఆర్ఎస్‌లోని కీలక నేతలే ఫోన్ చేస్తున్నట్టు సమాచారం. పోటీలో కొనసాగాలని, అందుకు కావాల్సిన ఖర్చును తామే భరిస్తామని హామీ ఇస్తున్నట్టు చర్చ జరుగుతోంది.

ఓట్ల చీలికపైనే ఆశలు

ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంత ఎక్కువగా చీలితే విజయం అంత సులువు అవుతుందని గులాబీ లీడర్లు అంచనా వేస్తున్నారు. అందుకోసం ఎక్కువ మంది స్వతంత్ర అభ్యర్థులు, కాంగ్రెస్ రెబల్స్ బరిలో ఉండాలని భావిస్తున్నారు. చాలా సెగ్మెంట్లలో పదుల సంఖ్యలో ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు. అలాగే టికెట్ దక్కని కాంగ్రెస్ లీడర్లు సైతం పోటీకి దిగారు. ఇందులో ఎవరికి స్థానికంగా ఏ మేరకు బలం ఉందోనని బీఆర్ఎస్ పెద్దలు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఎక్కువ ఓట్లు చీల్చే లీడర్లను గుర్తించి, వారిని పోటీలో కొనసాగించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. ప్రధానంగా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులపై ఫోకస్ పెట్టినట్టు టాక్ ఉంది. ఎక్కువ ఓట్లు చీల్చే కాంగ్రెస్ రెబల్స్‌కు నేరుగా ప్రగతిభవన్ వర్గాలే ఫోన్ చేసి, పోటీలో కొనసాగాలని ఎంకరేజ్ చేస్తున్నట్టు సమాచారం.

ప్రచారానికి సహకారం

పోటీలో ఉంటే, ప్రచారానికి కావాల్సిన నిధులను తామే సమకూరుస్తామని కాంగ్రెస్ పార్టీ రెబల్స్‌కు బీఆర్ఎస్ పెద్దలు ప్రపోజల్స్ పెడుతున్నట్టు రాజకీయవర్గాల్లో టాక్ ఉంది. గట్టి పోటీ ఇచ్చే రెబల్స్‌కు నేరుగా బీఆర్ఎస్ కీలక నేతలు ఫోన్ చేసి మాట్లాడుతున్నట్టు సమాచారం. ఇందుకోసం స్థానికంగా ఉండే పార్టీ ఇన్‌చార్జులు రెబల్స్ వద్దకు వెళ్లి సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తున్నది. పోటీలో ఉండేందుకు అంగీకారం తెలిపిన వారికి వెంటనే కొంత నగదును అందిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని, ప్రధాన అభ్యర్థుల ప్రచారానికి దీటుగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నట్టు ప్రచారం ఉంది.

ఆ మూడు జిల్లాలపై ఎక్కువ ఫోకస్

ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ రెబల్స్‌పైనే బీఆర్ఎస్ ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. ఆ మూడు జిల్లాల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వస్తాయని ప్రచారం జరుగుతున్నది. ఆ జిల్లాల్లో ఎక్కువ మంది రెబల్స్ పోటీలో ఉంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పెద్ద మొత్తంలో చీలిపోతాయని, దీంతో తమ అభ్యర్థుల విజయం సులువు అవుతుందని ధీమాలో బీఆర్ఎస్ ఉంది. నామినేషన్లను ఎట్టి పరిస్థితుల్లో విత్ డ్రా చేసుకోవద్దని లీడర్లకు సన్నిహితంగా ఉన్న వ్యక్తుల ద్వారా ప్రపోజల్స్ పెడుతున్నట్టు తెలిసింది.

Tags:    

Similar News