ఆ పోలింగ్ స్టేషన్లను ఆధీనంలోకి తీసుకున్న కేంద్ర బలగాలు
పోలింగ్‌కు మూడు రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో కేంద్ర బలగాలు ఫుల్ యాక్షన్ మోడ్‌లోకి వచ్చేశాయి. మావోయిస్టు ప్రభావిత పోలింగ్ స్టేషన్లను ఆధీనంలోకి తీసుకుంటున్నాయి.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పోలింగ్‌కు మూడు రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో కేంద్ర బలగాలు ఫుల్ యాక్షన్ మోడ్‌లోకి వచ్చేశాయి. మావోయిస్టు ప్రభావిత పోలింగ్ స్టేషన్లను ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. అత్యవసర పరిస్థితి తలెత్తితే ఎదుర్కోవడానికి క్విక్ రియాక్షన్ టీములను సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అణువణువు జల్లెడ పడుతున్నాయి. ప్రతి గ్రామంలో తిరుగుతూ సెన్సిటివ్ ప్రాంతాల్లో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహిస్తున్నారు. కూంబింగ్, తనిఖీలను ముమ్మరం చేశారు. డ్రోన్ కెమెరాల సాయంతో నిఘాను పర్యవేక్షిస్తున్నారు.
614 పోలింగ్ స్టేషన్లు గుర్తింపు
అసెంబ్లీకి ఈనెల 30న పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈసారి ఆయా రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీగా పోటీ ఉన్న నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ప్రధానంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. కొన్ని రోజుల ముందు ఎన్నికలను బహిష్కరించాలని, బీఆర్ఎస్, బీజేపీలను తన్ని తరిమేయాలంటూ పిలుపునిచ్చిన మావోయిస్టులు ఇటీవల తమ యాక్షన్టీములు రంగంలోకి దిగాయని పోస్టర్లు విడుదల చేయడంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్, రామగుండం, ఆదిలాబాద్, మహబూబాబాద్, నిర్మల్ జిల్లాల్లో 614 మావోయిస్టు ప్రభావిత పోలింగ్స్టేషన్లను గుర్తించారు. వీటిలో ఎక్కువ శాతం బెల్లంపల్లి, భద్రాచలం, అశ్వారావుపేట, కొత్తగూడెం, ఇల్లందు, పినపా క, ములుగు, భూపాలపల్లి, మంథని, చెన్నూరు, ఆసిఫాబాద్, సిర్పూర్(టీ) అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు.
ముందు జాగ్రత్తగా రంగంలోకి..
ఎన్నికల బందోబస్తు నిమిత్తం ఇప్పటివరకు రాష్ర్టానికి 23 వేలకు పైగా కేంద్ర బలగాలు వచ్చాయి. వీటిలో అసోం రైఫిల్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, సశస్ర్త్ సీమాబల్ బలగాలు ఉన్నాయి. దాదాపు 12 వేల మందిని మావోయిస్టు ప్రభావిత పోలింగ్స్టేషన్లు ఉన్న ప్రాంతాల్లో మోహరించారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ర్ట సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
స్ట్రాంగ్ రూంలు సైతం..
ఇక, ఈవీఎం మిషన్లను భద్రపరిచే స్ర్టాంగ్రూంలు కూడా కేంద్ర బలగాల ఆధీనంలో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఎక్కడైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే రంగంలోకి దిగటానికి ఉన్నతాధికారులు క్విక్రియాక్షన్ టీములను రంగంలోకి దింపారు. ఈ టీముల్లో పూర్తిగా కేంద్ర బలగాలే ఉండటం గమనార్హం. మావోయిస్టుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమస్య ఎదురు కాకున్నా ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.