ఖమ్మంలో బీఆర్ఎస్ vs కాంగ్రెస్.. రసవత్తరంగా మారుతున్న రాజకీయం!
బీఆర్ఎస్, కాంగ్రెస్ నడుమ వార్ మొదలైంది. ఎన్నికల సమయం కావడంతో చేరికల మీద కాన్సంట్రేషన్ చేసిన కాంగ్రెస్ నాయకులు ఒడుపుగా ఒక్కరొక్కరినీ పార్టీలోకి లాగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ చదరంగం రసవత్తరంగా మారుతుంది. ఎప్పుడు ఎవరు ఎటు ఎగిరిపోతారో తెలియక ‘కాపలా’ కాయాల్సి వస్తుంది. ఒక్కరోజులోనే కాంగ్రెస్ ఇచ్చిన ఝలక్ తో అప్రమత్తమైన బీఆర్ఎస్.. తమ పార్టీ కేడర్ చేజారిపోకుండా కాపాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ లో చేరబోతున్నవారి పేర్లు ఇవే అంటూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారితోనే ప్రెస్ మీట్లు పెట్టించి కౌంటర్ ఇప్పిస్తుంది బీఆర్ఎస్. వెరసి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ‘సై’య్యాట కారణంగా జిల్లాలో రాజకీయ హీట్ పెరిగింది.
దిశ బ్యూరో, ఖమ్మం: బీఆర్ఎస్, కాంగ్రెస్ నడుమ వార్ మొదలైంది. ఎన్నికల సమయం కావడంతో చేరికల మీద కాన్సంట్రేషన్ చేసిన కాంగ్రెస్ నాయకులు ఒడుపుగా ఒక్కరొక్కరినీ పార్టీలోకి లాగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తాజాగా ఆదివారం బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ తీర్థం తీసుకోవడంతో మున్ముందు మరింత మంది ఈ చేరికల్లో ఉంటారన్న ప్రచారం తీవ్రమైంది. సోషల్ మీడియాలో వారి పేర్లు కూడా వైరల్ కావడంతో కొందరు బయటకు వెళ్లకుండా ఇంటికే పరిమితం కాగా.. మరికొందరు సీక్రెట్ షెల్టర్లకు పరిమితమయ్యారు. ఇంకొందరు ఫోన్లు స్విచ్చాఫ్ చేసి పెట్టుకుని టెన్షన్ పెట్టించారు.
అప్రమత్తమైన మంత్రి పువ్వాడ..
బీఫామ్ తీసుకునేందుకు హైదరాబాద్ వెళ్లిన మంత్రి పువ్వాడ విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. హుటాహుటీన సాయంత్రం వరకే ఖమ్మం చేరుకుని తన ఇంట్లో పార్టీ శ్రేణులతో మాట్లాడారు. కార్పొరేటర్లు, నాయకులు, ముఖ్యమైన అనుచరులను పిలిపించుకుని అభిప్రాయాలు సేకరించారు. పార్టీ మారే ఆలోచనలో ఉన్న కొందరికి, డౌటున్న ఇంకొందరికీ కౌన్సెలింగ్ ఇచ్చి భవిష్యత్ పై హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలోనే ప్రధానంగా మేయర్ నీరజ, కూరాకుల నాగభూషణం, కొందరు కార్పొరేటర్ల పేర్లు వినిపించగా వారినీ సముదాయించినట్లు సమాచారం. దీంతో సోమవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి, మేయర్, కూరాకుల చేరికలపై తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. తుది శ్వాస వరకు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామని వారు తెలిపారు. మంత్రి సైతం కాంగ్రెస్ పార్టీ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. తాను ఖమ్మంలో లేనప్పుడు బందిపోటు దొంగలు వచ్చారని, తాను ఉన్నప్పుడు వస్తే సినిమా అంటే ఎంటో చూపించేవాడినని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేట మొదలైందన్న పొంగులేటి..
బాలసానిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు వచ్చిన పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు సైతం బీఆర్ఎస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్ని శక్తులు ఏకమైనా, అక్రమంగా సంపాదించిన డబ్బు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఖర్చు పెట్టినా.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. హామీలు విస్మరించిన ప్రభుత్వాన్ని ప్రజలే బొందపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎందరో ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణను దగాకోరు కేసీఆర్ కు అప్పజెప్పడంతో ప్రజలందరూ ఆగమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా ఒక ఎత్తు.. ఇక నుంచి మరో ఎత్తని.. ఆట కాదు.. వేట మొదలైందని అభిప్రాయపడ్డారు. పార్టీలో చేరిన బాలసాని, కమర్తపు మురళి సైతం బీఆర్ఎస్ లో తాము పడ్డ ఇబ్బందులను తెలిపారు. నిరంకుశపాలనకు వ్యతిరేకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు లేదని, సన్నాయినొక్కులు నొక్కేవారే ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ లోకి మరికొంతమంది..?
ముగ్గురి, నలుగురి చేరికలతో ఆగే ప్రవాహం కాదని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ అడుగుజాడల్లో నడిచేందుకు అనేకమంది తమతో టచ్ లో ఉన్నారని వెల్లడించారు. బీఆర్ఎస్ నాయకులు చూపించే సినిమా చూడ్డానికి తాము సిద్ధంగా లేమని.. మున్ముందు తాము చూపించే సినిమా చూసేందుకు వారే సిద్ధంగా ఉండాలని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. బీఆర్ఎస్ లో అనేక మంది అనేక అవమానాలు ఎదుర్కొంటున్నారని, ఆత్మగౌరవంతో బతుకాలనుకునే వారు తమతో రావడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. సమయం కోసం వేచిచూస్తున్నారని తప్పకుండా కాంగ్రెస్ లో చేరుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పదికి పది స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు కోసం సమిష్టిగా కష్టపడుతామన్నారు.