ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు భారీ డ్యామేజ్.. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో కేసీఆర్!
‘కాళేశ్వరం ప్రాజెక్టు మానవ అద్భుతం.. కేసీఆర్ మానస పుత్రిక.. స్వయంగా ఆయనే డిజైన్ చేశారు.. నాలుగేండ్లలోనే పూర్తి చేశాం.. ఇది కేసీఆర్ మానస పుత్రిక.. స్వయంగా ఆయనే డిజైన్ చేశారు.. నాలుగేండ్లలోనే పూర్తి చేశారు.’ అంటూ గులాబీ నేతలు గొప్పలు చెప్పుకున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ‘కాళేశ్వరం ప్రాజెక్టు మానవ అద్భుతం.. కేసీఆర్ మానస పుత్రిక.. స్వయంగా ఆయనే డిజైన్ చేశారు.. నాలుగేండ్లలోనే పూర్తి చేశాం.. ఇది కేసీఆర్ మానస పుత్రిక.. స్వయంగా ఆయనే డిజైన్ చేశారు.. నాలుగేండ్లలోనే పూర్తి చేశారు.’ అంటూ గులాబీ నేతలు గొప్పలు చెప్పుకున్నారు. కానీ ప్రస్తుతం లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీ రెండు పిల్లర్లు కుంగిపోవడంతో దాని ఉనికి ప్రశ్నార్థకం మారింది. దీంతో బీఆర్ఎస్ డిఫెన్సులో పడింది. ఇరిగేషన్ శాఖను చూస్తున్న కేసీఆర్.. ఈ ఘటనను సమర్ధించుకోలేక, ఖండించలేక ఆత్మరక్షణలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న బీఆర్ఎస్.. 50 ఏండ్ల పాలనలోని వైఫల్యాలను ఏకరువు పెడుతున్నది. కేసీఆర్ మొదలు కేటీఆర్, హరీశ్‌రావు, పలువురు మంత్రులు ఆ పార్టీని తూర్పారపడుతున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టు ముఖచిత్రాన్ని బీఆర్ఎస్ మార్చివేసిందని, కేసీఆర్ సీఎంగా ఉండడం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీటి సౌకర్యాన్ని కల్పించామని, దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా రాష్ట్రం ఆవిర్భవించిందని గొప్పలు చెప్పుకుంటున్నారు. అతి తక్కువ కాలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకున్నామని, ఎండాకాలంలోనూ రిజర్వాయర్లు నీళ్ళతో నిండుకుండలా ఉన్నాయని ఉదహరించారు.
బ్రేక్ వేసిన తాజా ఘటన
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం తర్వాత దానిని సందర్శించేందుకు లోకల్ ప్రజా ప్రతినిధులు అనేక గ్రామాల నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా తరలించే ఏర్పాట్లు చేశారు. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలూ కాళేశ్వరం నిర్మాణం గొప్పదనాన్ని ఆదర్శంగా తీసుకున్నారని ఘనంగా బీఆర్ఎస్ చెప్పుకున్నది. ప్రస్తుతం నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కాళేశ్వరం ప్రాజెక్టునే ప్రస్తావిస్తూ కేసీఆర్ గొప్పదనంగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్లు కుంగిపోవడం వారి ప్రచారానికి బ్రేకులు వేసినట్లయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 26 నుంచి వచ్చే నెల 9 వరకు అనేక నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత ప్రశ్నార్థకం కావడంతో ఇకపైన కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రాజెక్టుకు ఇంజినీరింగ్ డిజైన్ చేసింది తానేనంటూ అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా కేసీఆర్ చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ డిజైన్, ఇంజినీరింగ్ పనితనం, నిర్మాణంలోని నాణ్యతా లోపం ఆయన మెడకు చుట్టుకునే పరిస్థితులు నెలకొన్నాయి. బ్యారేజీ నిర్మాణ నాణ్యతలో లోపం ఉన్నదని అంగీకరిస్తే తప్పును ఒప్పుకున్నట్లవుతుంది. బ్యారేజీ పటిష్టతకు ప్రమాదమేమీ లేదని సమర్థించుకునే ప్రయత్నం చేస్తే మొత్తం వివరాలను ఆయన వెల్లడించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ప్రచారం సందర్భంగా ఎలాంటి వైఖరి తీసుకోవాలన్నది ఆయనకు ముందు నుయ్యి..వెనక గొయ్యి.. లాగా మారింది.
ప్రచారం నుంచి కాళేశ్వరం డిలీట్?
బీఆర్ఎస్ పార్టీకి మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్లు కుంగిపోయిన ఘటన తలనొప్పిగా మారింది. ఈ ప్రాజెక్టును పరివాహక ప్రాంతాలైన నియోజకవర్గాల్లో గొప్పగా చెప్పుకోవాలనుకున్న అధికార పార్టీ నేతలకు తాజా ఘటన ఊపిరి తీసుకోనివ్వడంలేదు. పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని ఏకరువు పెట్టే పలు అంశాల జాబితా నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తావనను పక్కన పెట్టక తప్పని అనివార్య పరిస్థితి నెలకొన్నది. ఇంకా ఐదు వారాల పాటు జరిగే ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ కాళేశ్వరం ఊసు ఎత్తే చాన్స్ లేకుండా పోయింది. ఈ అంశంలో ఎలాంటి వైఖరి తీసుకున్నా అది బీఆర్ఎస్ అభ్యర్థులకే నెగెటివ్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజీకి ఏర్పడిన ప్రమాద తీవ్రతపై ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. స్పష్టమైన అవగాహన లేనందున పిల్లర్లు కుంగిపోవడంతో ఏం ప్రమాదం ముంచుకొస్తుందోననే డైలమాలో పడ్డారు. ఊర్లు కొట్టుకుపోతాయా..? ప్రాణనష్టం జరుగుతుందా..? ఆస్తి నష్టం ఉంటుందా..? పంట ముంపుకు గురవుతుందా..? ఇలాంటి సందేహాలను అధికారులూ నివృత్తి చేయలేకపోతున్నారు. ప్రభుత్వం, అధికారుల నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడడం ద్వారానే ఇలాంటి అనుమానాలకు బ్రేక్ పడనున్నది. ఎన్నికల సమయంలో బ్యారేజీ నిర్మాణ నాణ్యతకు సంబంధించిన అంశం బహిర్గతమైతే అధికార పార్టీకి చిక్కులు వస్తాయనే కారణంతో వాస్తవం వెలుగులోకి రాకుండా కేసీఆరే అధికారులపై ఒత్తిడి తెస్తున్నారన్న విమర్శలూ వస్తున్నాయి.
ముందు నుంచీ విపక్షాల ఆరోపణలు
కాళేశ్వరం కమిషన్ల ప్రాజెక్టు అంటూ ముందు నుంచీ విపక్షాలు విమర్శిస్తున్నాయి. రూ.లక్ష కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో భారీ స్థాయిలో అవినీతి, అవకతవకలు జరిగాయని తూర్పారపడుతున్నాయి. రాష్ట్రంలో మూడు రోజుల బస్సు యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన ప్రాజెక్టుగా దీనిని అభివర్ణించారు. ఈ ప్రాజెక్టులో భారీ స్థాయిలో కేసీఆర్ ఫ్యామిలీకి కమిషన్లు ముట్టాయని, ఇందుకోసమే ఈ ప్రాజెక్టును కట్టారని ఆరోపించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సైతం గతంలో ఈ ప్రాజెక్టులోని అవినీతి అంశాలను తేటతెల్లం చేయడానికి వెళ్తే పోలీసులు అడ్డుకున్న అంశాన్నీ ప్రస్తావించారు. ఆయన పర్యటన ముగిసిన మూడు రోజుల్లోనే పిల్లర్లు కుంగిపోయిన ఘటన చోటుచేసుకున్నది. ఈ ప్రాజెక్టు కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎంలా మారిందని ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. తదితరులు కామెంట్ చేశారు. తాజా ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎంక్వయిరీకి ఆదేశిస్తుందా?.. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యవహారంపై స్పందిస్తుందా?.. ఎన్నికల మైలేజ్ కోసం మాత్రమే వాడుకుంటుందా?.. ఇవన్నీ ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ప్రజాధనం దుర్వినియోగమైన తీరుపై దర్యాప్తు జరిపించాల్సిందిగా సీబీఐ, ఈడీ తదితర సంస్థల దగ్గర ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని బీజేపీ కదిలిస్తుందా.. లోపాయకారీ ఒప్పందం కారణంగా సైలెంట్‌గా ఉంటుందా.. ఇవీ ప్రజల్లో జరుగుతున్న చర్చలు.
మానవ తప్పిదమా?.. విద్రోహ చర్యా?
కాళేశ్వరం ప్రాజెక్టును ఇంతకాలం గొప్పగా చెప్పుకున్నందున తాజాగా పిల్లర్లు కుంగిన ఘటనపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన ఇస్తుందన్నది కీలకంగా మారింది. నిర్మాణ నాణ్యతలో లోపం జరిగిందంటే అది ఎన్నికల్లో నెగెటివ్‌గా మారుతుందనే అనుమానంతో విద్రోహ చర్య అంటూ ప్రకటన చేస్తుందా? అనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. భారీ శబ్దం వచ్చిన తర్వాత ఈ ఘటన జరిగిందనే వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనే కుట్రతో అసాంఘిక శక్తులు ఈ పనికి పాల్పడ్డాయనే కొత్త అంశాన్ని తెరమీదకు తెస్తుందేమోననే మాటలూ వినిపిస్తున్నాయి. అధికారులు, ప్రభుత్వం నుంచి వచ్చే సమాధానంపైనే ఇప్పుడు ప్రజల్లో ఆసక్తి నెలకొన్నది.
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాం: ఎస్ఎన్ సుబ్రమణ్యం, సీఈఓ-ఎండీ, ఎల్ అండ్ టీ
‘నాణ్యత, భద్రతాపరంగా అంతర్జాతీయ ప్రమాణాలతో మేడిగడ్డ బ్యారేజీని నిర్మించాం. ఈ బ్యారేజీ వేలాది హెక్టార్ల భూములను సాగులోకి తెస్తుంది. ప్రజల జీవితాలను మార్చడంలో మౌలిక సదుపాయాల రంగానికే కొత్త నిర్వచనంగా మారాం. సుమారు 1.80 కోట్ల ఘనపు మీటర్ల మట్టిని తవ్వి ఈ బ్యారేజీని నిర్మించాం. సుమారు 18.50 లక్షల ఘనపు మీటర్ల సిమెంటు కాంక్రీట్‌ను వినియోగించాం. ఇది దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా టవర్‌కు వాడినదాంతో పోలిస్తే ఏడు రెట్లు ఎక్కువ. దాదాపు 1.35 లక్షల టన్నుల ఇనుమును వాడాం. ఇది పారిస్‌లోని ఈఫిల్ టవర్‌కు వాడినదానికి 15 రెట్లు ఎక్కువ. దాదాపు ఐదున్నర లక్షల చ.మీ. మేర ఫామ్ వర్క్ చేశాం. 25 వేల టన్నుల హైడ్రో మెకానికల్ పనులు చేశాం’
సవాళ్లను అధిగమిస్తూ రికార్డు: ఎస్వీ దేశాయ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఎల్ అండ్ టీ.
‘మేడిగడ్డ బ్యారేజీ నిర్మించిన ప్రాంతం నైసర్గికంగా, భౌగోళికంగా అనేక ప్రతికూలతో కూడుకున్నది. ఆ సవాళ్లన్నింటినీ అధిగమించి నిర్మించాం. నిర్మాణ వేగంలో ప్రపంచంలోని కొన్ని రికార్డులను అధిగమించాం. ఒక్క రోజులోనే 16,722 ఘనపు మీటర్ల సిమెంట్ కాంక్రీట్ పనులు కంప్లీట్ చేసి రికార్డు సృష్టించాం. మూడు రోజుల వ్యవధిలో ఇది 25,584 ఘనపు మీటర్లకు చేరుకున్నది. ఒక్క నెలలోనే 1.94 లక్షల ఘ.మీ. మేర కంప్లీట్ చేశాం. భారత నిర్మాణ రంగం చరిత్రలోనే ఇదో మైలురాయి.’
బ్యారేజీ సాంకేతిక వివరాలు :
బ్యారేజీ పొడవు : 1.6 కి.మీ. (1,632 మీటర్లు)
మొత్తం రేడియల్ క్రెస్ట్ గేట్లు : 85
బ్యారేజీలో నీటి నిల్వ ఎత్తు : 100 మీటర్లు
స్టోరేజీ స్టాక్ : 16.17 టీఎంసీలు
కాంక్రీట్ పైయర్లు : 4/6 మీటర్ల వెడల్పు, 110 మీటర్ల పొడవు, ఎత్తు 25 మీటర్లు
నిర్మాణం ప్రారంభం : 02.05.2016
పనుల తర్వాత ప్రారంభోత్సవం : 21.6.2019
బ్యారేజీ వ్యయం : రూ.1,849 కోట్లు