సనాతనం ఆచరించని వారిపై యుద్ధం ప్రకటిస్తున్నారా?
సనాతనం పేరుతో ప్రధానిమోడీ దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే. కేశవరావు మండిపడ్డారు. ఆదివారం ఢిల్లీలో కేకే మీడియాతో మాట్లాడారు.
దిశ, తెలంగాణ బ్యూరో: సనాతనం పేరుతో ప్రధానిమోడీ దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే. కేశవరావు మండిపడ్డారు. ఆదివారం ఢిల్లీలో కేకే మీడియాతో మాట్లాడారు. సనాతనం ఆచరించే అందరూ ఏకమవ్వాలని ప్రధాని అన్నారని, అంటే సనాతనం ఆచరించని వారిపై యుద్ధం ప్రకటిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఇదివరకు దేశ ప్రజలను హిందూ, ముస్లిం పేరుతో విభజించారని, ఇప్పుడు సనాతనం అని, నాన్-సనాతనీ పేరుతో హిందువుల్లోనే విభజన తీసుకొస్తున్నారా? అని ప్రశ్నించారు. పురుషసూక్తంలో వర్ణ వ్యవస్థ గురించి ఉందని, ఇది సమాజంలో అసమానతలను సూచిస్తుందన్నారు. ‘నేను హిందువునే... దేవీ దేవతలను పూజిస్తాను.. కానీ సనాతనాన్ని నేను విశ్వసించను’ అన్నారు. సనాతనం అంటే పురషసూక్తం ఒక్కటే కాదని, సనాతనంలో పురుషసూక్తం కూడా భాగమేనన్నారు.
ఈ అంశంపై పీహెచ్‌డీ చేశానని, దీనిపై ఎంత లోతుగైనా మాట్లడతానని స్పష్టం చేశారు. కంచి పీఠం, రాఘవేంద్ర మఠంలో గతంలో కొన్ని కులాలవారిని రానివ్వకపోవడం వివాదం కాలేదా? అని ప్రశ్నించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అన్నారని, ప్రత్యేకత ఏంటో చెప్పలేదని మండిపడ్డారు. కొత్త పార్లమెంట్ భవనంలోకి వెళ్లడమే ప్రత్యేకత అని కూడా చెప్పడం లేదని దుయ్యబట్టారు. తొలి రెండ్రోజుల ఎజెండా చెప్పారని, మహిళ బిల్లు, బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశామన్నారు. ఆల్ పార్టీ సమావేశంలో ఇతర పార్టీలు కూడా మహిళా బిల్లు పెట్టాలని డిమాండ్ చేశాయన్నారు.