అధికార పార్టీ ఎమ్మెల్యేలకు గడ్డుకాలం.. కేటీఆర్ ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యక్ష్యం!

అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో పెండింగ్ పనులపై స్థానికంగా ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరుగుతోంది. అందుకు సంబంధించిన ఫైళ్లతోపాటు కొత్త పనుల కోసం ఎస్టిమేషన్ వేసిన వాటితో మంత్రి కేటీఆర్ చుట్టూ తిరుగుతున్నారు.

Update: 2023-09-24 11:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో పెండింగ్ పనులపై స్థానికంగా ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరుగుతోంది. అందుకు సంబంధించిన ఫైళ్లతోపాటు కొత్త పనుల కోసం ఎస్టిమేషన్ వేసిన వాటితో మంత్రి కేటీఆర్ చుట్టూ తిరుగుతున్నారు. అయితే.. ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఉందని.. నిధుల విడుదల కాకుండా ఇతర పనులు చేయించుకోవాలని ఎమ్మెల్యేలకు సూచిస్తున్నట్లు సమాచారం. బదిలీలు, పైరవీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

మంత్రి కోసం వెయిటింగ్..

ప్రభుత్వం అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పార్టీ నేతలతోపాటు కాంట్రాక్టర్లు సైతం పనులు చేపట్టారు. చేసిన పనులకు ఏళ్లుగా ప్రభుత్వం నుంచి నిధులు రిలీజ్ కాలేదు. కొంతమందికి టోకెన్లు ఇచ్చినా.. మంజూరు కాకపోవడంతో నియోజకవర్గాల్లోని కాంట్రాక్టర్లు, నేతలు ఎమ్మెల్యేపై ఒత్తిడి పెంచుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ఒత్తిడి పెరుగుతోంది. దీంతో సంబంధించిన ఫైళ్లతో నేతలు ప్రగతిభవన్ బాటపట్టారు. మంత్రి కేటీఆర్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తున్నారు. మంత్రి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారు. లేదంటే ప్రగతి భవన్ వచ్చే వరకు వేచిచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. దళితబంధు, మైనార్టీలు, బీసీలకు లక్ష సాయంతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో పెండింగ్ బిల్లులు గానీ, కొత్త పనుల మంజూరు, ప్రత్యేక నిధులు అడగొద్దని ఎమ్మెల్యేలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచిస్తున్నట్లు సమాచారం. అధికారుల, ఉద్యోగుల బదిలీలు, పైరవీలకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.

ఎమ్మెల్యేలకు గడ్డుకాలం?

కాంట్రాక్టర్లతోపాటు సొంతపార్టీ నేతలు గ్రామాల్లో సైతం అభివృద్ధి పనులు చేశారు. అప్పులు చేసి మరీ పనులు పూర్తిచేశారు. అయినప్పటికీ ప్రభుత్వం పనులకు సంబంధించిన నిధులు విడుదల చేయలేదు. దీంతో నిత్యం ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కిందిస్థాయి నేతలే కీలకం కావడంతో ఈ తరుణంలో పెండింగ్ బిల్లులు మంజూరు లేక అసహనంతో ఉన్నారు. మరోవైపు పనుల కోసం చేసిన అప్పులకు వడ్డీ పెరుగుతుండటంతో మనోవేదనకు గురవుతున్నట్లు పార్టీకి చెందిన ఓ నేత పేర్కొన్నారు. గ్రామంలో వాటర్ పైప్ లైన్ కాంట్రాక్టు పట్టి అప్పు చేసి మరీ పూర్తి చేశానని, ఏడాదికిపైగా గడిచినా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టోకెన్లతోనే సరిపుచ్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేసే పరిస్థితి లేకపోవడంతో ఎమ్మెల్యేలకు గడ్డుకాలం నెలకొంది.

Tags:    

Similar News