అదిరిపోయే ప్లాన్‌తో సిద్ధంగా బీఆర్ఎస్.. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రావడమే ఆలస్యం!
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ఎప్పుడు విడుదలవుతుందా? అని ఆ పార్టీ ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఇంతకంటే ఎక్కువ ఆసక్తి బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ఎప్పుడు విడుదలవుతుందా? అని ఆ పార్టీ ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఇంతకంటే ఎక్కువ ఆసక్తి బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతున్నది. ఆ పార్టీ ఫస్ట్ లిస్టును ప్రకటించిన తర్వాత పలు నియోజకవర్గాల్లో టికెట్ రానివారి అసంతృప్తి భగ్గుమంటుందని లెక్కలేసుకున్నది. దీన్ని అడ్వాంటేజ్‌గా మల్చుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. అవసరమైతే ఆ అసంతృప్తువాదులను గులాబీ గూటికి లాగేయాలనుకుంటున్నది. అది కుదరనిపక్షంలో ఇతర ప్రలోభాలతో ఆ పార్టీలో కొనసాగిస్తూనే తనదైన శైలిలో బీఆర్ఎస్‌కు లబ్ధి చేకూరే వ్యూహాన్ని అమలు చేయాలనుకుంటున్నది. కాంగ్రెస్ లిస్టును ప్రకటించిన తర్వాత కనీసంగా 30-40 స్థానాల్లో ఇలాంటి ఇబ్బందులుంటాయని, వాటిని అనుకూలంగా మల్చుకోవడంపైనే ఫోకస్ పెట్టింది.
ఆ పార్టీలో కొనసాగుతూనే అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా రెబల్‌గా నిలబెట్టడంపై ఆలోచనలు మొదలయ్యాయి. స్థానికంగా వారికి ఉన్న బలంతో ఓట్లలో చీలిక తేవడం ద్వారా ఆ పార్టీ క్యాండిడేట్‌ను వీక్ చేయవచ్చనేది గులాబీ నేతల భావన. అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత ఆశావహుల్లో అసంతృప్తి చోటుచేసుకోవడం సహజమేనని గుర్తుచేస్తున్న గులాబీ నేతలు ఒకేసారి 115 స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్‌లో నాలుగైదు చోట్ల మాత్రమే ఇలాంటిది చోటుచేసుకున్నదని, కానీ, కాంగ్రెస్‌లో మాత్రం చాలాచోట్ల ఇది బహిర్గతమవుతుందనేది అభిప్రాయపడ్డారు. అలాంటి అవకాశం కోసమే వారు ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో కాంగ్రెస్ ఫస్ట్ లిస్టు రిలీజ్ అయిన తర్వాత మొదలయ్యే అసంతృప్తి జ్వాలలు మొత్తం స్థానాలకు ప్రకటించిన తర్వాత ఊహించని స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ అసంతృప్తే ఆ పార్టీకి చేటు చేస్తుందని, పరోక్షంగా అది బీఆర్ఎస్‌కు అనుకూలంగా మారుతుందనేది వారి వాదన. ఏయే స్థానాల్లో అసంతృప్తివాదులు ఉన్నారో గుర్తించి వారి ద్వారా లబ్ధి పొందాలనేది బీఆర్ఎస్ స్థానిక నేతల ఆలోచన. వారి బలం, బలహీనతలకు అనుగుణంగా ఎలాంటి వ్యూహాన్ని రూపొందించాలన్నదానిపై కసరత్తు మొదలు పెట్టనున్నారు. పార్టీ అధిష్టానం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా దానికి కార్యరూపం ఇవ్వనున్నారు. మూడోసారి పవర్‌లోకి వచ్చి హ్యాట్రిక్ సాధించాలన్నది టార్గెట్‌గా పెట్టుకోవడంతో కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టడానికి ఆ పార్టీ నేతలనే అస్త్రంగా వాడుకోవాలన్నది బీఆర్ఎస్ వ్యూహం. ఒక్కో స్థానానికి సగటున నలుగురు చొప్పున పోటీ పడుతున్నందున వారితోనే ఆ పార్టీ అభ్యర్థి విజయానికి చెక్ పెట్టాలన్నది ఆలోచన.
గత ఎన్నికల సమయంలో పోలింగ్‌కు రెండు వారాల ముందు వరకూ కాంగ్రెస్ గెలుపు ఖాయమనే ధీమా ఆ పార్టీలో వ్యక్తమైందని, కానీ చివరి రోజుల్లోనే మొత్తం సీన్ మారిపోయిందని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు గుర్తుచేస్తున్నారు. ఈసారి కూడా అలాంటి వినాశన చర్యలు ఆ పార్టీ నుంచే మొదలవుతాయని, అవి తమ పార్టీకి అనుకూలంగా మారుతాయన్న ధీమాతో ఉన్నారు. వారి పార్టీ అభ్యర్థులను వారే ఓడించుకుంటారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ లిస్టులు రిలీజ్ కావడంతోనే యాక్టివిటీలు ప్రారంభమవుతాయని, రోజుల వ్యవధిలోనే క్షేత్రస్థాయిలో బలాబలాల ఈక్వేషన్లు మారిపోతాయని, అంతిమంగా బీఆర్ఎస్‌కు మేలు జరుగుతుందన్న నమ్మకాన్ని పలువురు గులాబీ నేతలు వ్యక్తం చేశారు.
బీసీ అభ్యర్థుల అసమ్మతి, ఢిల్లీ వరకూ చేరిన గొడవలు, అసంతృప్తివాదులను కన్విన్స్ చేయడంలో ఆ పార్టీ నాయకత్వం వైఫల్యం.. ఇలాంటి అంశాలన్నింటినీ బీఆర్ఎస్ నిశితంగా గమనిస్తున్నది. రెండు పార్టీల మధ్య వలసలు ఇప్పటికే ప్రారంభమైనా కాంగ్రెస్ లిస్టు విడుదల తర్వాత అనూహ్యంగా పెరుగుతుందని భావిస్తున్నది. అభ్యర్థులకు పోలైన ఓట్లలో స్వల్ప మార్జిన్ మాత్రమే ఉంటుందని, ఇదే విజయానికి నిర్ణయాత్మకమవుతుందని గుర్తుచేస్తున్నారు. అసంతృప్తివాదులు చీల్చే ఓట్లు కీలకమవుతాయని, అందువల్లనే ఆ పార్టీ తలరాతను నిర్ణయించేది టికెట్ రాని నిరాశావహులేనన్నది బీఆర్ఎస్ నేతల అభిప్రాయం. అలాంటి పరిస్థితి కోసమే ఎదురుచూస్తున్నారు. నామినేషన్ల పర్వం ముగిసేనాటికి ఒక అంచనా ఏర్పడుతుందని, ప్రచార పర్వం ముగిసేనాటికి క్లారిటీ వచ్చేస్తుందని వ్యాఖ్యానించారు.