రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ మరింత డౌన్.. మెరుపు వేగంతో దూసుకెళ్తోన్న కాంగ్రెస్!
రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ మరింతగా డౌన్ అవుతున్నది. కర్ణాటక ఎలక్షన్ రిజల్ట్ నాటికి కమలం, గులాబీ పార్టీల మధ్య పోటీ నెలకొనగా ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. బీజేపీ గ్రాఫ్ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ మరింతగా డౌన్ అవుతున్నది. కర్ణాటక ఎలక్షన్ రిజల్ట్ నాటికి కమలం, గులాబీ పార్టీల మధ్య పోటీ నెలకొనగా ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. బీజేపీ గ్రాఫ్ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతున్నది. మరోవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య గ్యాప్ గణనీయంగా తగ్గుతున్నది. సిక్స్ గ్యారంటీస్ ప్రకటన తర్వాత బలపడుతున్న కాంగ్రెస్ ఇటీవల బీఆర్ఎస్ నుంచి చేరికలతో మరింతగా పుంజుకున్నట్లు తెలంగాణ ఇంటెన్షన్స్ నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. వారం రోజుల్లో మూడు వేల మంది నుంచి సేకరించిన అభిప్రాయాలతో ప్రస్తుతం బీఆర్ఎస్ ఓట్ షేర్ 40% ఉంటే, కాంగ్రెస్‌కు 35%, బీజేపీకి 8% ఉన్నట్లు వెల్లడైంది. రాష్ట్ర ఓటర్లలో సుమారు 38% మంది తటస్థంగా ఉన్నారని, వీరంతా ఓటింగ్ సమయానికి వేర్వేరు అంశాలతో ఆ సమయానికి నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుంటారని ఆ సంస్థ పేర్కొన్నది.
పోల్ ట్రాకర్ సర్వేలో కాంగ్రెస్ హవా :
అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో పబ్లిక్ పల్స్ కోసం పోల్ ట్రాకర్ అనే సంస్థ సర్వే నిర్వహించగా తెలంగాణలో కాంగ్రెస్ 42% ఓట్లతో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుందని, 70 సీట్లు వస్తాయని అంచనా వేసింది. సెప్టెంబరు ఫస్ట్ వీక్‌లో సుమారు 1.23 లక్షల మంది నుంచి అభిప్రాయాలను సేకరించగా 63-69 సీట్లు గెల్చుకుంటుందని వెల్లడించింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 34% ఓట్ల షేర్‌తో 35-40 స్థానాల్లో గెలుస్తుందని తెలిపింది. మూడవ స్థానంలో 10% ఓట్లతో గరిష్టంగా ఐదు స్థానాల్లో మజ్లిస్, ఐదు స్థానాల్లో బీజేపీ గెలుస్తున్నట్లు పేర్కొన్నది. ఇదే విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ తన ట్విట్టర్ అకౌంట్‌లో మాత్రం 69-71 స్థానాల్లో, బీఆర్ఎస్ 39-41 సీట్లలో, మజ్లిస్ 6-7 చోట్ల, బీజేపీ 5-6 సెగ్మెంట్లలో గెలుస్తున్నట్లు పేర్కొన్నది. తాజా సర్వే ప్రకారం కాంగ్రెస్ 71 స్థానాల్లో గెలుస్తుందని నొక్కిచెప్పింది.
తగ్గుతున్న హంగ్ అభిప్రాయం
అసెంబ్లీ ఎన్నికల తర్వాత హంగ్ వస్తుందనే అభిప్రాయం క్రమంగా తగ్గుతున్నది. రెండు నెలల క్రితం 14% మంది హంగ్ అభిప్రాయాన్ని వెల్లడిస్తే ఇప్పుడు అది 6%కి తగ్గిపోయింది. ఈ అభిప్రాయాన్ని వెల్లడించినవారంతా బీఆర్ఎస్, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత, స్థానిక అభ్యర్థుల మీద విశ్వాసం లేకపోవడం, పార్టీ పట్ల ఉన్న అభిప్రాయం, ఆ పార్టీ అగ్రనేతలమీద ఏర్పర్చుకున్న భావన, ఇస్తున్న హామీలు, ఇప్పటికే ఇచ్చిన హామీల అమలు.. ఇలాంటివన్నీ తటస్థుల మీద ఓటింగ్ సమయానికి ప్రభావం చూపనున్నట్లు తేలింది. కాంగ్రెస్ పార్టీ సిక్స్ గ్యారంటీలను ప్రకటించిన తర్వాత వారం రోజుల్లోనే 1.8% ఓటింగ్ షేర్ పెంచుకుంటే ఇటీవల బీఆర్ఎస్ నుంచి వచ్చిన చేరికలతో మరో 1.9% మేర పెరిగింది. రెండు వారాల్లోనే 3.7% మేర ఓటర్ల ఆదరణ చూరగొన్నట్లు ఆ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది.