కాంగ్రెస్ తుక్కుగూడ సభ తుస్సుమంది: బీజేపీ ఎంపీ
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తోడుదొంగలు అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కే.లక్ష్మణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తోడుదొంగలు అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కే.లక్ష్మణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 17 గురించి మాట్లాడే నైతిక హక్కు ఎంఐఎం, కాంగ్రెస్‌లకు లేదన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లనే తెలంగాణ భారత్‌లో విలీనం అయిందని, లేకపోయి ఉంటే పాకిస్థాన్‌లోనో, ఇస్లామిక్ రాజ్యాంగనో మిగిలిఉండేదన్నారు. భావితరాలు కాంగ్రెస్, ఎంఐఎంలను క్షమించరన్నారు. ఆ రెండు పార్టీలు కులం, మతం పేరుతో సమాజాన్ని వేరు చేయాలనే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
సీడబ్ల్యూసీ సమావేశాలు నిరాశాజనకంగా, పసలేని సమావేశాలుగా మిగిలాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా తుక్కు అయిన కాంగ్రెస్ తుక్కుగూడలో నిర్వహించిన సభ తుస్సుమన్నదని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రామనే ధీమాతోనే అమలుకు సాధ్యంకాని హామీలను కాంగ్రెస్ గుప్పించిందన్నారు. 6 గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ హామీలను తెలంగాణ ప్రజలు విశ్వసించరన్నారు. సభలో నేతల మాటలు కేసీఆర్ రాసిచ్చిన స్క్రిప్ట్ లాగే ఉందని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చింది మేమే అంటూ కాంగ్రెస్ తెలంగాణ సమాజాన్ని అవమానపరుస్తుందన్నారు. 1200 మంది చనిపోవడానికి ఈ సోనియమ్మనే కారణం కాదా? అని ప్రశ్నించారు. ఉద్యమకారులకు భూములు అంటూ ఎవరిని మోసం చేస్తున్నారన్నారు. ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల సహాయం అని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు మూడు లక్షలకు మార్చి, కొంతమందికే ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నాడని దుయ్యబట్టారు.
తెలంగాణలో ప్రకటించిన 6 గ్యారెంటీలను కాంగ్రెస్ అధికారంలో ఉన్న నాలుగు రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేసేందుకు ప్రజాలేవరు సిద్ధంగా లేరన్నారు. ఆదాయవనరులు ఎక్కడి నుంచి తెచ్చి ఉచితలు పంచుతారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టాలను ఎవరూ మర్చిపోలేదన్నారు. మాయమాటలు చెప్పి ఓట్లను దండుకోవడం కోసమే కాంగ్రెస్ హామీలు ఇస్తుందని విమర్శించారు. బీజేపీచేసిన అభివృద్ధి పైనే ఎన్నికలకు పోతుంటే కాంగ్రెస్ ఉచితలను, సనాతన ధర్మంపై దాడి చేస్తూ ఎన్నికలకు వెళ్తుందని ఆరోపించారు. కర్ణాటకలో దొంగ హామీలు ఇచ్చి దొండిదారిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి కర్ణాటకను తీసుకొచ్చారని ధ్వజమెత్తారు.