‘మోడీ గ్యారెంటీ’ పేరిట బీజేపీ మేనిఫెస్టో.. విడుదలకు ముహూర్తం ఖరారు!
కాస్త ఆలస్యంగా అయినా ఈ నెల 17న మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు బీజేపీ రెడీ అయింది. ‘మోడీ గ్యారెంటీ’ పేరిట అది ఉండబోతున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
దిశ, తెలంగాణ బ్యూరో: కాస్త ఆలస్యంగా అయినా ఈ నెల 17న మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు బీజేపీ రెడీ అయింది. ‘మోడీ గ్యారెంటీ’ పేరిట అది ఉండబోతున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు భిన్నంగా ఉచిత విద్య, వైద్యంతో పాటు నిరుద్యోగులు, సామాన్యులు, రైతులకు లబ్ది చేకూర్చేలా అనేక అంశాలను అందులో రూపొందించినట్లు తెలిసింది. ప్రతీ వ్యక్తికి బీమా పథకాన్ని అమలు చేస్తామనే హామీ ఇవ్వాలని బీజేపీ చూస్తోంది. దీనికి తోడు స్థానికి సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేలా పలు నగరాల పేర్లను మారుస్తామనే అంశాన్ని సైతం మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అట్లనే రైతులకు వరి కనీస మద్దతు ధర క్వింటాకు రూ.3100కు పెంచాలని బీజేపీ భావిస్తోంది. ఆయుష్మాన్ భారత్ కింద ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షలను రూ.10 లక్షల వరకు పెంచే యోచనలో ఉంది.
అలాగే పెళ్లయిన ప్రతీ మహిళకు సంవత్సరానికి రూ.12 వేలు ఇవ్వాలని భావిస్తోంది. రూ.500కే సిలిండర్, తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, రాష్ట్రవ్యాప్తంగా జన ఔషధి కేంద్రాలు, వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.20 వేలు, యూపీఎస్సీ మాదిరిగానే టీఎస్ పీఎస్సీ పరీక్షలకు జాబ్ క్యాలెండర్ వంటి అంశాలు మేనిఫెస్టోలో ఉండనున్నాయి. ఐఐటీ ఎయిమ్స్ తరహాలో విద్యాసంస్థల ఏర్పాటు, పీఎం ఆవాస్ యోజన కింద అర్హులైన ప్రతీ పేద వ్యక్తికి ఇల్లు, రజక, నాయీ బ్రాహ్మణులు, వడ్రంగి, విశ్వబ్రాహ్మణులు, చేతివృత్తులు, చిరువ్యాపారులకు విశ్వకర్మ యోజన, ప్రైవేట్ ఫీజుల నియంత్రణపై చర్యలు, మహిళా సంఘాలకు, రైతులకు వడ్డీలేని రుణాల అందజేత వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ నెల 17న తెలంగాణలో పర్యటన సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేతులు మీదుగా విడుదల చేయనున్నారు.