‘నెల రోజుల్లో బీజేపీ గెలవడాన్ని అందరూ చూస్తారు’
మీడియా ప్రతినిధులు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రావద్దని, మీకు కావాల్సిన సమాచారం తామే అందిస్తామని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి జవదేకర్ అన్నారు. మీడియా పాయింట్‌ను బీజేపీ స్టేట్ ఆఫీస్ నుంచి సోమాజిగూడలోని కత్రియలో ఏర్పాటు చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: మీడియా ప్రతినిధులు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రావద్దని, మీకు కావాల్సిన సమాచారం తామే అందిస్తామని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి జవదేకర్ అన్నారు. మీడియా పాయింట్‌ను బీజేపీ స్టేట్ ఆఫీస్ నుంచి సోమాజిగూడలోని కత్రియలో ఏర్పాటు చేశారు. కాగా శుక్రవారం ఈ మీడియా సెంటర్‌ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రకాష్ జవదేకర్ మాట్లాడారు. నెల రోజుల్లో బీజేపీ గెలవడం అందరూ చూస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంటుందని, కాంగ్రెస్ మూడోస్థానానికి పరిమితమవుతుందని పేర్కొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతామన్నారు. బాధ్యులు ముఖ్యమంత్రి అయినా, కాంట్రాక్టర్లు అయినా వందకు వందశాతం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీజేపీ నేతలతో కలిసి శనివారం కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు వెళ్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అనేక సంవత్సరాలుగా ప్రతి ఎన్నికల సమయంలో ప్రత్యేకంగా మీడియా పాయింట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా కట్టినట్లు బీఆర్ఎస్ చెప్పుకుందని, డిస్కవరీ ఛానల్లో కూడా ప్రచారం చేసుకున్నారన్నారు. కానీ ప్రాజెక్టు ఇప్పుడు కుంగిపోయిందని, ప్రజాధనం మొత్తం రాళ్లు, నీళ్ల పాలయిందని కేంద్ర మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ హయాంలో రూ.30 వేల కోట్లు ప్రాజెక్టు వ్యయం ఉంటే.. సీఎం కేసీఆర్ రీడిజైన్ పేరిట 1.30 లక్షల కోట్లకు వ్యయాన్ని పెంచారని మండిపడ్డారు. ఇంజినీరింగ్ మార్వల్ అని గొప్పలు చెప్పుకున్నారని, జబ్బలు చరుచుకున్నారని, కేసీఆర్ ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకున్నారని ఎద్దేవాచేశారు.
అలాంటి ప్రాజెక్టు తెలంగాణకు గుదిబండగా మారిందని ఆయన పేర్కొన్నారు. కట్టిన నాలుగేండ్లకే పిల్లర్లు కుంగిపోయాయని ఆయన పేర్కొన్నారు. ఆ పిల్లర్లను తొలగించి వాటి స్థానంలో కొత్తవి నిర్మించాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారని, లేదంటే ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమయ్యే అవకాశం ఉందని చెప్పారన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు మెదపడం లేదని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంట్రాక్టు ఎవరికిచ్చారు? ఎంత ఖర్చయిందనే అంశాలపై కూడా స్పష్టత ఇవ్వలేదన్నారు. ప్రాజెక్టు ద్వారా రైతుకు ఎకరాకు వచ్చేది రూ.40 వేలు అయితే.. ప్రాజెక్టు మెయింటెనన్స్ కు ఎకరాకు రూ.85 వేలు ఖర్చవుతోందన్నారు. ఇంత వ్యత్యాసం ఉందంటే.. ఈ ప్రాజెక్టును కమీషన్ల కోసం కట్టినట్లా? కాంట్రాక్టర్ల కోసం కట్టినట్లా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
ప్రాజెక్టును పరిశీలించేందుకు వచ్చిన జలశాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక డాక్యుమెంట్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. లో క్వాలిటీ ఇసుక, మెటీరియల్ వాడారని నిపుణుల నివేదికలో తేలిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.., నిపుణులు, ఇంజినీర్ల మాటలు పక్కనపెట్టి తానే ఇంజినీర్ లాగా వ్యవహరించి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని, కేసీఆర్ నిర్ణయాల వల్ల ప్రాజెక్టు నిరుపయోగంగా మారే ప్రమాదం ఏర్పడిందన్నారు. పిల్లర్లు కుంగిపోవడంపై కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ కమీషన్లు తీసుకోవడంలో, తెలంగాణ సొమ్ము దోచుకోవడంలో సక్సెస్ అయ్యారని, కానీ ప్రాజెక్టు విషయంలో ఫెయిలయ్యారని ఎద్దేవాచేశారు. తెలంగాణలో దొరలా ఎవరు వ్యవహరిస్తున్నారో చిన్న పిల్లలను అడిగినా చెబుతారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.