కేసీఆర్‌, రేవంత్‌, కిషన్ రెడ్డిలకు బిగ్ టాస్క్.. ఒక్కొక్కరి ముందు ఉన్న సవాల్ ఏంటో తెలుసా?

రాబోయే అసెంబ్లీ ఎన్నికలను బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఛాలెంజ్‌గా తీసుకున్నాయి. ప్రత్యర్థి పార్టీలను బోల్తా కొట్టించి ఎలాగైనా గెలిచి తీరాలని వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే రానున్న ఎలక్షన్స్ ఆయా పార్టీల అధినేతలకు సవాల్‌గా మారాయని చెప్పొచ్చు.

Update: 2023-10-03 01:48 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాబోయే అసెంబ్లీ ఎన్నికలను బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఛాలెంజ్‌గా తీసుకున్నాయి. ప్రత్యర్థి పార్టీలను బోల్తా కొట్టించి ఎలాగైనా గెలిచి తీరాలని వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే రానున్న ఎలక్షన్స్ ఆయా పార్టీల అధినేతలకు సవాల్‌గా మారాయని చెప్పొచ్చు. సిట్టింగ్ అభ్యర్థులపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అధిగమించడం గులాబీ బాస్ కేసీఆర్‌కు పరీక్షగానే మారింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికు బిగ్ టాస్క్‌గా మిగిలింది. ఇక 119 నియోజకవర్గాల్లో దీటైన క్యాండిడేట్లను గుర్తించి ఫైనల్ చేయడం బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డికి ఓ టెస్టుగానే ఉన్నదని చెప్పొచ్చు.

కేసీఆర్‌కు సిట్టింగ్‌లపై వ్యతిరేకత ఎదుర్కోవడం సవాలే..

దళితబంధు పథకంలో 30% కమిషన్లు తీసుకుంటున్నారని, ప్రజలకు అందుబాటులో ఉండరనే ఫిర్యాదులతో పాటు ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనేక కంప్లయింట్స్ వచ్చాయి. అనేక మందిని సీఎం హెచ్చరించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ కూడా జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోతే శ్రేణుల నుంచి వ్యతిరేకతతో పాటు పోల్ మేనేజ్‌మెంట్‌లో ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో కేసీఆర్ కొత్త ముఖాలను బరిలోకి దించే సాహసం చేయలేకపోయారన్నది ఆ పార్టీలోని నేతల నుంచి వినిపిస్తున్న వాదన. ఏడు చోట్ల సిట్టింగ్‌లను మార్చినందుకు, నాలుగు స్థానాల్లో పెండింగ్‌లో పెట్టినందుకు అక్కడి లోకల్ నేతల నుంచి వస్తున్న అసంతృప్తి ఇప్పటికీ కొలిక్కి రాలేదు. బుజ్జగింపులు, సర్దుబాట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ప్రజల్లో సిట్టింగ్‌ల పట్ల తీవ్రమైన వ్యతిరేకత, అసంతృప్తి ఉన్నందున ఎన్నికల ప్రచారంలో దానిని అధిగమించడం ఇప్పుడు అధినేతకు సవాలుగా మారింది.

రేవంత్‌కు పరీక్షగా అభ్యర్థుల ఎంపిక

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయకముందే అసంతృప్తి జ్వాలలు మొదలయ్యాయి. ఓబీసీ టికెట్ల పేరుతో పలువురు సీనియర్లు, బీసీ నేతలు వేరు కుంపటి పెట్టుకున్నారు. పీసీసీ, ఏఐసీసీపై ఒత్తిడి పెంచుతున్నారు. ఢిల్లీ స్థాయిలోనూ మంతనాలు జరుపుతున్నారు. దీనికి తోడు మొత్తం 119 స్థానాలకు వెయ్యికి పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో సింగిల్ అభ్యర్థిగా ఉండేవి సుమారు 35-40 వరకూ ఉన్నాయి. మిగిలిన వాటిలో ఇద్దరికంటే ఎక్కువ మంది ఆశావహులున్నారు. టికెట్ ఖరారు చేసిన తర్వాత వారిని కన్విన్స్ చేయడం రేవంత్‌రెడ్డికి పెద్ద సమస్యగా మారింది. అయితే రేవంత్‌రెడ్డిని ఇంతకాలం సీనియర్ నేతలు లెక్క చేయలేదు. క్రమంగా అది దారిలో పడిందనుకునే టైంలో టికెట్ల అసంతృప్తి వ్యవహారం తెరమీదకు వచ్చింది. సర్వేల ఆధారంగానే అభ్యర్థులు ఖరారవుతారని, రాష్ట్ర కమిటీతో సంబంధం లేకుండా ఏఐసీసీ మొత్తం చూసుకుంటుందని పీసీసీ చీఫ్ చెప్పడంతో ఆశావహులంతా ఢిల్లీ బాట పట్టారు. స్క్రీనింగ్ కమిటీ పరిశీలన దశలోనే అసంతృప్తి జ్వాలలు రావడంతో లిస్టు రిలీజ్ అయిన తర్వాత తీవ్రత ఎలా ఉంటుందోననే చర్చ జరుగుతున్నది. ఈ కారణంగానే ఎన్నికల షెడ్యూలు విడుదలైన తర్వాతే లిస్టు రిలీజ్ చేసే అవకాశముందనే ఊహాగానాలు వస్తున్నాయి.

కిషన్‌రెడ్డికి గెలుపు గుర్రాల గుర్తింపు టెన్షన్

ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలనుకుంటున్న బీజేపీకి మొత్తం 119 స్థానాల్లో దీటైన అభ్యర్థులు దొరకడం లేదు. సుమారు 6,000 దరఖాస్తులు వచ్చినా ఇందులో పోటీకి అర్హత కలిగిన వారెందరనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లోనూ మొత్తం స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల్లో 105 మంది డిపాజిట్ కోల్పోయారు. చాలాచోట్ల ‘నోటా’ కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడు సీట్లకు పరిమితమైన బీజేపీ 2018 ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుతోనే సరిపెట్టుకున్నది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వరకూ బీఆర్ఎస్‌కు దీటుగా, ప్రత్యామ్నాయంగా ఉన్న ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి బండి సంజయ్‌ని తప్పించి కిషన్‌రెడ్డికి పగ్గాలు అప్పజెప్పిన తర్వాత దాని పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. అభ్యర్థుల ఎంపిక దశలోనే ఆపసోపాలు పడుతున్న కిషన్‌రెడ్డికి వారిని గెలిపించుకోవడం కత్తిమీద సాములా మారింది.

Tags:    

Similar News