తెలంగాణలో పవన్ కల్యాణ్‌కు BIG షాక్.. అన్ని చోట్లా డిపాజిట్ గల్లంతు

పవన్ కల్యాణ్ తెలంగాణలోని బీజేపీ పార్టీతో చేతులు కలిపి.. 8 స్థానాల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే.

Update: 2023-12-03 08:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: పవన్ కల్యాణ్ తెలంగాణలోని బీజేపీ పార్టీతో చేతులు కలిపి.. 8 స్థానాల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు కూడా పవన్ బీజేపీ-జనసేన కూటమి తరపున ప్రచారం చేశారు. వరంగల్, సూర్యాపేట, కొత్తగూడెం సభలతో పాటు హైదరాబాద్ కూకట్‌పల్లిలో రోడ్ షో నిర్వహించారు. అయినప్పటికీ ఆయన ప్రచారం ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. జనసేన అభ్యర్థుల్లో ఒక్కరికీ డిపాజిట్ రాలేదు. కనీసం ఒక్క చోట కూడా డిపాజిట్ దక్కలేదు. కూకట్‌పల్లిలో ప్రేమ్ కుమార్, తాండూరులో శంకర్ గౌడ్, నాగర్‌కర్నూలులో లక్ష్మణ్ గౌడ్, కోదాడలో మేకల సతీష్ రెడ్డి, ఖమ్మంలో రామకృష్ణ, వైరాలో సంపత్ నాయక్, కొత్తగూడెంలో సురేందర్ రావు, అశ్వారావుపేటలో ఉమాదేవి డిపాజిట్లు కోల్పోయారు. బీజేపీ ముఖ్య అభ్యర్థులతో పాటు జనసేన నేతలు కూడా ఓటమి దిశగా పయనిస్తున్నారు.

జనసేన మాత్రమే కాదు.. బీజేపీ ముఖ్యనేతలకు కూడా ఊహించని షాక్ తగిలింది. కాషాయదళంలోని హేమాహేమీలంతా ఓటమి దిశగా పయనిస్తున్నారు. కరీంనగర్‌లో బండి సంజయ్‌, కోరుట్లలో ధర్మపురి అర్వింద్, దుబ్బాకలో రఘునందన్ రావు, గోషామహల్‌లో రాజాసింగ్ కూడా వెనకంజలో ఉన్నారు. ఈటల రాజేందర్‌కు కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. గజ్వేల్‌తో పాటు హుజూరాబాద్‌లోనూ ఈటల రాజేందర్‌ ఇబ్బందుల్లో ఉన్నారు. ఈటల గజ్వేల్‌లో రెండో స్థానంలో ఉండగా.. హుజూరాబాద్‌లో ఏకంగా మూడో స్థానానికి పరిమితమయ్యారు.


Similar News