ప్రవళిక ఆత్మహత్య.. భావోద్వేగంతో బండి సంజయ్ కీలక పిలుపు
హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో ప్రైవేటు హస్టల్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న ప్రవళిక శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లికి చెందిన ఆమె మరణం రాష్ట్రంలో కలకలం సృష్టించింది.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో ప్రైవేటు హస్టల్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న ప్రవళిక శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లికి చెందిన ఆమె మరణం రాష్ట్రంలో కలకలం సృష్టించింది. దీనిపై రాజకీయ నాయకులు వరుసగా స్పందిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా.. ప్రవళిక ఆత్మహత్యపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు. ప్రవళిక ఆత్మహత్యపై ఆందోళన చేస్తూ రోడ్డుమీదకు వచ్చిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేయడాన్ని ఖండించారు. ప్రవళిక ఆత్మహత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. విద్యార్థులకు మద్దతుగా రోడ్డుమీదకు వచ్చిన బీజేపీ నేతలపై దాడులు చేయడం ఏంటని పోలీసులపై బండి సంజయ్ సీరియస్ అయ్యారు.
దాడి చేసిన పోలీసులపై కేసులు నమోదు చేయాలని పిలుపునిచ్చారు. ఆత్మహత్యలు వద్దు ఆగ్రహావేశాలతో తిరగబడదామని విద్యార్థులకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. అరాచక పాలనలో మరో ఆడబిడ్డ ఆయువు తీసుకోవడం గుండెలు పిండేస్తోంది.. కానీ, నిరుద్యోగ యువతా! ఆత్మహత్యలు వద్దన్నారు. ఆశ, ఆశయం, ఉరకలెత్తిన ఉత్సాహం, ఉరిమి తరిమిన మీ పౌరుషంతోనే తెలంగాణ సాకారం అయిందని వెల్లడించారు. అమరుల ఆకాంక్షల సారథులైన మీరు నిరాశపడితే.. ఆత్మబలిదానాలు చేసిన అమరులను అవమానించడమేన్నారు. నిరంకుశత్వాన్ని నిగ్గుతేల్చే నిప్పు కణికలా ఎగిసిపడాలని పిలుపునిచ్చారు. బీజేపీ మీ వెంటే ఉంటుంది. మీకోసం పోరాడుతుంది. మంచి రోజులు మన ముందే ఉన్నాయి.. దొరల అరాచక పాలనను గద్దెదించి సత్తా చాటుదామన్నారు. మరొక్కసారి బరువైన గుండెతో కోరుతున్నా.. ఆత్మహత్యలు వద్దు ఆగ్రహావేశాలతో తిరగబడదామని పిలుపునిచ్చారు.