ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం.. సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై సీఎం కేసీఆర్ స్పందించారు. సోమవారం బాన్సువాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఎంపీపై జరిగిన దాడి గురించి సీఎం మాట్లాడారు. చేతగాని దద్దమ్మ పార్టీ ప్రతిపక్ష పార్టీ అని మండిపడ్డారు.
దిశ, వెబ్‌డెస్క్: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై సీఎం కేసీఆర్ స్పందించారు. సోమవారం బాన్సువాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఎంపీపై జరిగిన దాడి గురించి సీఎం మాట్లాడారు. చేతగాని దద్దమ్మ పార్టీ ప్రతిపక్ష పార్టీ అని మండిపడ్డారు. చేతగాని వెధవలు ఇలాంటి చర్యలకే పాల్పుడుతారని సీరియస్ అయ్యారు. విషయం తెలియగానే వెళ్లి పరామర్శించాలనుకున్నాను కానీ, మంత్రి హరీష్ వెంటనే అక్కడకు వెళ్లి పరామర్శించి, ‘ప్రాణాలకేం ప్రమాదం లేదు. మీరు మీటింగ్ ముగించుకొని రండి’ అని హరీష్ రావు చెప్పాక ఆగిపోయానని సీఎం అన్నారు. ఎన్నికల్లో ఎదుర్కోలేక హింసలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభాకర్‌పై దాడి జరిగిందంటే నాపై దాడి జరిగినట్లే అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులు ఇంతకుముందెన్నడూ చూడలేదని అసహనం వ్యక్తం చేశారు. ఓటు ఒక బ్రహ్మాస్త్రం.. దాన్ని సరైన పద్ధతుల్లోనే వాడితేనే మన తలరాత మారుతది. లేకపోతే ఇలాంటి అరాచక శక్తులు మళ్లీ గద్దెనెక్కి మనల్ని తొక్కేయాలని చూస్తారని సూచించారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీకి మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు అనేక పార్టీలు వస్తాయి.. అనేక మంది నాయకులు అనేక మాటలు చెప్తారు. కానీ ఆలోచన చేసి ఓటు వేయాలి. ఆగమాగం కావొద్దు. సొంత విచక్షణతో ఓటు వేయాలి. ఎవరో చెప్పారు అని ఓటేస్తే పరిస్థితి ఉల్టాపల్టా అవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు.