బండి సంజయ్‌కి కీలక బాధ్యతలు.. సీఎం‌ కేసీఆర్‌‌ను తలదన్నేలా అమిత్ షా ప్లాన్!

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాష్ట్రంలో బీజేపీ వేగం పెంచింది. ముఖ్యంగా ఈ ఎన్నికలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా రాష్ట్ర నేతలతో వ్యూహాత్మకంగా అడుగులు వేయిస్తున్నాడు.

Update: 2023-10-30 14:14 GMT

దిశ, కరీంనగర్: ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాష్ట్రంలో బీజేపీ వేగం పెంచింది. ముఖ్యంగా ఈ ఎన్నికలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా రాష్ట్ర నేతలతో వ్యూహాత్మకంగా అడుగులు వేయిస్తున్నాడు. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు కీలక బాధ్యతలు అప్పగించినట్లు వార్తలు విస్తృతమయ్యాయి. బీజేపీ తెలంగాణ స్టార్ క్యాంపెయినర్‌గా బండి సంజయ్‌‌ను కొనసాగించాలని హైకమాండ్ నుంచి పిలుపు వచ్చినట్లు వార్తలు ఊపందుకున్నాయి. అంతేకాదు.. రాష్ట్రవ్యాప్త ప్రచార నిమిత్తం బండి సంజయ్‌కు అధిష్టానం హెలికాప్టర్ కేటాయించినట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర పార్టీని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం బండి సంజయ్‌తో అమిత్ షా ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలిసింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సమన్వయంతో కృషి చేయాలని సూచించినట్లు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా బండి సంజయ్‌కి ఉన్న ఫాలోయింగ్‌ను పార్టీకి ఉపయోగపడేలా అధిష్టానం ప్రణాళిక రచించినట్లు అర్థమవుతోంది. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో పలు ఎన్నికల్లో ఎన్నడు లేని విధంగా విజయాలు సాధించిన క్రెడిట్ సంజయ్‌కి ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే పలు బహిరంగ సభల్లో బండి సంజయ్ హెలికాప్టర్ వినియోగించనున్నారు. సంజయ్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌తో పాటు మరొకరికి కూడా హెలికాప్టర్లు కేటాయించినట్లు తెలిసింది. అయితే, కరీంనగర్ అసెంబ్లీ బరిలో బండి సంజయ్ నిలవడంతో ప్రతిరోజూ రెండు సభల్లో పాల్గొని సాయంత్రం ఐదు గంటలకు కరీంనగర్ చేరుకుని నియోజకవర్గంలో ప్రచారం చేపడుతారు. అయితే, ఏ ఏ నియోజకవర్గాల్లో పాల్గొనాలి, ఎన్ని సభల్లో బండి సంజయ్ ప్రసంగం ఉండాలి అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, బీఆర్ఎస్ తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తూ రోజుకు రెండు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్‌ను మించి బండి సభలు ఉండాలని అమిత్ షా ప్లాన్ చేసినట్లు సమాచారం.

Tags:    

Similar News