పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 9 మంది ఓటమి
గత ఎన్నికల్లో కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు ఈసారి ఎన్నికల్లో ఓటర్లు షాకిచ్చారు. మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారగా వారిలో 9 మంది ఓటమి పాలయ్యారు.
దిశ, డైనమిక్ బ్యూరో: గత ఎన్నికల్లో కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు ఈసారి ఎన్నికల్లో ఓటర్లు షాకిచ్చారు. మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారగా వారిలో 9 మంది ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలుపొందిన హరిప్రియ నాయక్, రేగా కాంతరావు, వనమా వెంకటేశ్వరరావు, కందాళ ఉపేందర్ రెడ్డి, జాజుల సురేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గండ్రవెంకటరమణా రెడ్డి, ఆత్రం సక్కు, డి.సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ పారిన ఈ 12 మందిపై కాంగ్రెస్ టార్గెట్ చేసింది.
చిత్తుగా ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో ఈసారి బీఆర్ఎస్‌పై పోటీ చేసిన వీరిలో ఎల్బీనగర్ నుంచి, సుదీర్ రెడ్డి, మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డిలు మాత్రమే గెలుపొందారు. వీరిలో ఆత్కం సక్కుకు కేసీఆర్ టికెట్ నిరాకరించగా పోటీకి దూరంగా ఉన్నారు. మిగతా 9 మంది ఓటమి పాలయ్యారు. ఇక టీడీపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వర రావులు సైతం ఓటమి పాలయ్యారు. ఇక బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ గజ్వేల్, హుజూరాబాద్ రెండు చోట్ల పోటీ చేయగా రెండు స్థానాల్లో వెనకబడిపోయారు.