ఎన్నికల బరిలో నిలిచిన చదువు రాని అభ్యర్థులు వీళ్లే!

119 అసెంబ్లీ స్థానాలు. బరిలో ఉన్న అభ్యర్థులు 2,290 మంది. వీరిలో పూర్తిగా చదువు రాని వారి సంఖ్య 89. ‘చదువు రాని వాడవని దిగులు చెందకు’ అని అనుకున్నాయేమో ఆయా పార్టీలు.

Update: 2023-11-27 02:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: 119 అసెంబ్లీ స్థానాలు. బరిలో ఉన్న అభ్యర్థులు 2,290 మంది. వీరిలో పూర్తిగా చదువు రాని వారి సంఖ్య 89. ‘చదువు రాని వాడవని దిగులు చెందకు’ అని అనుకున్నాయేమో ఆయా పార్టీలు. పొట్ట కోస్తే అక్షరం ముక్క రాని వారికి సైతం టిక్కెట్లు ఇచ్చి ఎన్నికల బరిలోకి దింపాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి చదువు పూర్తిగా రాని అభ్యర్థుల సంఖ్య 90 శాతానికి పైగా ఉండటం గమనార్హం. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిరక్షరాస్యులైన అభ్యర్థులు 48 మంది ఎన్నికల్లో పోటీ చేయగా, ఈసారి ఆ సంఖ్య 89కి పెరిగింది.

ఇక, ఎలాంటి విద్యార్హతలు లేని అభ్యర్థులు 26 మంది కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తమకు విద్యార్హతలు లేకున్నా, చదవడం, రాయడం వచ్చునని ఈ అభ్యర్థులు తమ తమ ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొనడం గమనార్హం. 5వ తరగతి పూర్తి చేసిన వారు 91 మంది ఉండగా, 8వ తరగతి వరకు చదువుకున్నవారు 117 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక టెన్త్​పాసైన వారు 441 మంది ఉండగా, 12వ తరగతి వరకు చదువుకున్న అభ్యర్థులు 330 మంది ఉన్నారు. డిగ్రీ పూర్తి చేసిన వారు 242, పీజీ చదివినవారు 477 మంది అభ్యర్థులు ఉన్నారు. డాక్టరేట్​పూర్తి చేసిన వారు 32 మంది, డిప్లొమా చదివిన వారు 53 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

ఇంతమందా..!

క్రితంసారి జరిగిన ఎన్నికలతో పోలిస్తే దాదాపు రెట్టింపు సంఖ్యలో నిరక్షరాస్యులైన అభ్యర్థులు పోటీ చేస్తుండటంపై ఓటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా చదువు రానివారితో కలిపి 10వ తరగతి వరకు చదివిన అభ్యర్థుల సంఖ్య 764 మంది ఉండటంపై విస్మయం చెందుతున్నారు. దీనినిబట్టి ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థుల విద్యార్హతలకన్నా, వారి ఆర్థిక స్థితిగతులకే ప్రాధాన్యత ఇచ్చినట్టు స్పష్టం అవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ‘పైసా పేకో.. తమాషా దేఖో’ అన్నట్టుగా అభ్యర్థులు అర్థబలంతో టికెట్లు తెచ్చుకుని ఎన్నికల బరిలో నిలబడ్డారని, ఇలాంటి వాళ్లు చట్ట సభలకు ఎంపికైతే ప్రజా సమస్యలపై ఎలా పోరాడగలుగుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కనీసం అధికారులను ప్రశ్నించగలరా? అని ఓటర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిరక్షరాస్యత కలిగినవారు ఎన్నిక కావడం వల్ల ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలా కృషి చేస్తారని విశ్లేషకులు కూడా ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News