ఎట్టకేలకు కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్‌కు ముహూర్తం ఖరారు.. 72 మంది అభ్యర్థులు ఫైనల్!

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల లిస్టు ఈ నెల 15న విడుదల అయ్యే అవకాశం ఉన్నదని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. రేపటి వరకు మంచి ముహూర్తాలు లేవని, అందుకే ఎల్లుండి జాబితా విడుదల చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీలోకి ఓ నేత తెలిపారు.

Update: 2023-10-13 02:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల లిస్టు ఈ నెల 15న విడుదల అయ్యే అవకాశం ఉన్నదని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. రేపటి వరకు మంచి ముహూర్తాలు లేవని, అందుకే ఎల్లుండి జాబితా విడుదల చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీలోకి ఓ నేత తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన స్క్రీనింగ్ కమిటీ మీటింగ్‌లలో 72 మంది అభ్యర్థలు పేర్లు ఫైనల్ అయ్యాయని, సింగల్ నేమ్‌తోనే జాబితాను తయారు చేసినట్టు సమాచారం. దీంతో పాటు నేడు ఢిల్లీలో మరోసారి స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ జరగనున్నది. ఈ సమీక్షలో మరిన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశముంది. అనంతరం ఆ జాబితాను సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించనున్నారు. సీఈసీ మీటింగ్ సైతం నేడు పూర్తి కానున్నది. అయితే అన్ని సెగ్మెంట్లకు అభ్యర్థులను ఫైనల్ చేస్తారా? మరోసారి భేటీ నిర్వహిస్తారా? ఫస్ట్ లిస్టులో ఎంత మందిని ప్రకటిస్తారు? అనే అంశాలు నేడు తేలనున్నాయి. స్క్రీనింగ్, సీఈసీ మీటింగ్ తర్వాత కూడా అభ్యర్థులపై స్పష్టత రాకుంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి దాదాపు 72 మందితో తొలి జాబితా రిలీజ్ అయ్యే చాన్స్ ఉన్నదని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. నేడు జరిగే మీటింగ్ నిమిత్తం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఇక అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకోవడంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొన్నది. తమకు టిక్కెట్ వస్తుందో లేదనని చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పటికీ పలువురు ఆశావహులు ఢిల్లీ స్క్రీనింగ్ కమిటీ, ఏఐసీసీ నాయకులను కలుస్తూనే ఉండటం గమనార్హం.

గ్రేటర్‌లో కొత్త తలనొప్పి

స్క్రీనింగ్ కమిటీ తుది సమావేశం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టుండి మరో కీలకమైన ప్రతిపాదన తెరపైకి వచ్చింది. హైదరాబాద్ టికెట్లపై తమిళనాడు, నార్త్ సెటిలర్స్ కన్నేశారు. తమ వర్గాలకు టికెట్ ఇస్తేనే కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తామని తేల్చి చెప్పారు. కంటోన్మెంట్‌లో తమకు టిక్కెట్ ఇవ్వాలని తమిళనాడు సెటిలర్స్ ఒత్తిడి తెస్తున్నారు. కంటోన్మెంట్‌లో 65 వేలకు పైగా తమిళులు, కేరళ సెటిలర్స్ ఉన్నారని పార్టీకి ప్రాతిపాదించారు. నర్సింహా కన్నన్ లేదా రాజేంద్రన్‌కు టిక్కెట్ ఇవ్వాలని పార్టీ హైకమాండ్‌ను సైతం వారు కోరారు. కంటోన్మెంట్ టిక్కెట్ కోసం తమిళ అర్వం వర్గం నేతలు ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ, ఏఐసీసీ పెద్దలను కలిసినట్టు సమాచారం. మరోవైపు గోషామహల్ టికెట్ తమకే కావాలంటున్న నార్త్ సెటిలర్స్ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, యూపీ సెటిలర్లు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారని, మెజారిటీ ఓట్లు తమవేనంటూ నార్త్ సెటిలర్స్ స్పష్టం చేస్తున్నారు. దాదాపు 2 లక్షల 60 వేల ఓట్లలో సుమారు లక్ష ఓట్లు నార్త్ సెటిలర్స్‌వే ఉన్నాయని పార్టీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రేమ్ లాల్, నిర్మల్ యాదవ్, ఠాగూర్ రన్బీర్ సింగ్ పేర్లను పరిశీలించాలని ఆయా నేతలు కూడా ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది.

బస్సు యాత్రపై ఏం చేద్దాం?

ఇక రాష్ట్రంలో నిర్వహించాలనుకున్న బస్సు యాత్రపైనా కాంగ్రెస్ పార్టీ డైలమాలో ఉన్నది. టిక్కెట్ల ప్రకటన తర్వాతే బస్సు యాత్రను ప్రారంభిస్తే బెటర్ అంటూ పలువురి నేతల నుంచి అభిప్రాయాలు వచ్చినట్టు తెలుస్తున్నది. స్క్రీనింగ్ కమిటీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏఐసీసీ అగ్రనేతలతో బస్సు యాత్రపై ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆ తర్వాత దానిపై క్లారిటీ రానున్నట్టు పార్టీలోకి ఓ నేత తెలిపారు.

క్యాంపెయిన్ ప్రతినిధుల ఎంపిక

ఇప్పటికే అభ్యర్థులను సర్వే ఆధారంగానే ఎంపిక చేస్తున్న కాంగ్రెస్.. గ్రౌండ్ లెవల్‌లోనూ ప్రచార తీరును తెలుసుకునేందుకు పార్టీ క్యాంపెయిన్ ప్రతినిధులను నియమించనున్నది. ఈ టీమ్ పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడమే కాకుండా క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు గాంధీభవన్ వార్ రూమ్ కు తెలియజేస్తుంది. మరోవైపు అభ్యర్థులు గ్రౌండ్‌లో ఏం మాట్లాడాలి? క్యాండిడేట్లు మాట్లాడిన అంశాల్లో దేన్ని సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేయాలి? జనాలకు అర్థమయ్యే రీతిలో ప్రచారానికి కంటెంట్ తయారీ చేయడం లాంటివి ఈ టీమ్ మానిటరింగ్ చేయనున్నది. పొలిటికల్ సైన్స్ స్టూడెంట్లకు రిక్రూట్‌మెంట్‌లో ప్రయారిటీ ఉంటుందని పార్టీలోని ఓ వ్యక్తి తెలిపారు. వంద మందిని నియమించుకునేందుకు పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇందుకు నేడు ఆర్టీసీ క్రాస్​రోడ్స్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఎంపికైన ప్రతినిధులకు జీతంతో పాటు పుడ్, వసతి సౌకర్యాలను కూడా పార్టీ కల్పించనున్నది.

Tags:    

Similar News