రాష్ట్ర ప్రజల సొమ్ముతో పక్క రాష్ట్రంలో సోకు రాజకీయాలు.. సీఎం కేసీఆర్ పై వెఎస్ షర్మిలా రెడ్డి విమర్శలు
సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శలు గుప్పించారు.
దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజల సొమ్ముతో పక్క రాష్ట్రంలో బందిపోట్ల సోకు రాజకీయాలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపించిన పాపానికి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు మహారాష్ట్ర ప్రజలకు ఊడిగం చేస్తున్నారని అన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వం’ మొత్తం పక్క రాష్ట్రానికి తరలిపోయిందన్న ఆమె.. కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రా? లేక మహారాష్ట్రకా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, ప్రజల సమస్యలు పరిష్కరించకుండా బందిపోట్లలాగా ఇక్కడి సంపదను కొల్లగొట్టి పక్క రాష్ట్రంలో ఖర్చు చేస్తున్నారని చెప్పారు. ప్రజలను గాలికొదిలి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పక్క రాష్ట్రానికి వెళ్లిందంటే.. తెలంగాణపై కేసీఆర్ కున్న చిత్తశుద్ధి ఏంటో గమనించాలని రాష్ట్ర ప్రజలను కోరారు.
రాష్ట్రంలోని గ్రామాలు సందర్శించడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, సీఎంకు తీరిక లేదు కానీ రాజకీయాల కోసం పక్క రాష్ట్రానికి వెళ్లే సమయం మాత్రం ఉందని ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రానకి వెళ్తున్న క్రమంలో దారిపొడువునా ప్రజలను అవస్థలకు గురి చేసిన దొంగలు టీఆర్ఎస్ నేతలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ తిరిగి సమస్యలు తెలుసుకోలేని బందిపోట్లు.. పక్క రాష్ట్రాల ప్రజలను ఉద్ధరిస్తామనడం ఈ దశాబ్దపు పెద్ద జోక్ అని షర్మిల అన్నారు. తెలంగాణ ప్రజలారా ఇకనైనా మేలుకోవాలని.. రాజకీయాలకు రంగులు మార్చే ఈ బీఆర్ఎస్ దొంగలను రాష్ట్రం నుంచే కాదు ఈ దేశం నుంచే తరిమికొట్టాలని షర్మిల కోరారు.
Read More..