అమరుల పేర్లు కూడా తెలుసుకోలేని దిక్కుమాలిన సర్కార్..వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ఫైర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ది అమరుల పేర్లు కూడా తెలుసుకోలేని దిక్కుమాలిన సర్కార్ అని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ ది అమరుల పేర్లు కూడా తెలుసుకోలేని దిక్కుమాలిన సర్కార్ అని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర సాధన కోసం 1500 మంది ప్రాణాలు కోల్పోతే.. తెలంగాణ కోసం 1200 మంది అమరవీరులయ్యారని సొంత లెక్కలను కేసీఆర్ బయటపెట్టారని, కానీ అందులో ఆదుకున్నది 528 మందిని మాత్రమేనని ఆమె మండిపడ్డారు. మిగిలిన 700 మంది అమరుల త్యాగాలను, చరిత్రను చెరిపేసే ప్రయత్నం కేసీఆర్ చేశారని ధ్వజమెత్తారు. అమరుల ప్రాణ త్యాగం.., దొరకు దక్కిన అధికార వైభోగమని ఆమె చురకలంటించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టిన వారు ఎందరో అయితే ఆ ఫలాలను అందరికీ దక్కకుండా చేసిన ఉద్యమ ద్రోహి కేసీఆర్ అని విరుచుపడ్డారు.
అసువులుబాసిన అమరుల ఆశయాలు గోదారి పాలైతే .. స్వరాష్ట్ర సంపద అంతా కేసీఆర్ పాలైందని మండిపడ్డారు. త్యాగాల మీద, రక్తపు చుక్కలపై పీఠం ఎక్కిన దొర.. నేడు అమరుల కుటుంబాలను ఆదమరిచాడని విరుచుకుపడ్డారు. ఇన్నాళ్లు వాళ్ళెవరో అన్నట్లు, గుర్తుకు లేనట్లు నాటకాలాడి, 9 ఏండ్లుగా లేని ప్రేమ ఎన్నికల వేల పుట్టుకొచ్చిందని చురకలంటించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే సంకేతాలతోనే కేసీఆర్ కు అమరవీరులు మళ్ళీ యాదికొచ్చారని అన్నారు. ఇల్లు, ఉద్యోగం, భూమి ఇస్తానని చెప్పి వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడు కేసీఆర్ అని ఆమె ధ్వజమెత్తారు. అమరుల పేర్లు సువర్ణాక్షరాలతో లిఖిస్తానని చెప్పి కుటుంబాన్ని బంగారం చేసుకున్నాడే తప్పితే వారి పేర్లు ఎక్కడా చెక్కలేదని షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇన్నాళ్లు గుర్తుకు రాని శంకరమ్మను పిలిచి ఎమ్మెల్సీ ఇస్తానన్నాడని, కొత్తగా అమరులకు న్యాయం చేస్తానని గప్పాలు కొడుతున్నాడని ఫైరయ్యారు. ఉద్యమాన్ని అణగదొక్కిన ఉద్యమద్రోహులను అక్కున చేర్చుకొని, తెలంగాణ తల్లికి ఆత్మఘోష రగిల్చిన మారీచుడు కేసీఆర్ అని షర్మిల విరుచుకుపడ్డారు. ఏడాదిలోనే ప్రగతిభవన్ కోటలు కట్టుకున్న దొరకు.. అమరవీరుల స్మారక చిహ్నం పూర్తిచేసేందుకు మాత్రం తొమ్మిదేండ్లు పట్టిందని షర్మిల విమర్శించారు. కేసీఆర్ లాంటి ఉద్యమద్రోహులు అమరవీరుల స్మారక స్తూపం ఆవిష్కరించడమంటే అమరవీరులను, తెలంగాణ సమాజాన్ని అవమానించినట్టేనని షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు.