Errabelli : అవును..బరాబర్ నేను రాక్షసుడినే : ఎర్రబెల్లి

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వరంగల్ సభలో చేసిన విమర్శలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao)మండిపడ్డారు.

Update: 2024-11-20 05:59 GMT

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వరంగల్ సభలో చేసిన విమర్శలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao)మండిపడ్డారు. నన్ను రాక్షసుడని రేవంత్ రెడ్డి విమర్శించారని.. నేను రాక్షసుడినే అని..ప్రజల కోసం ఎంతవరకైనా తెగిస్తానని ఎర్రబెల్లి ఫైర్ అయ్యారు. నేను సొంత జిల్లాలో ఏడుసార్లు గెలిచానని.. నువ్వు గెలిచినచోట మళ్లీ గెలవని వాడివని ఎద్దేవా చేశారు. నా జిల్లాలో నేను గెలిచినా..నీవు నీ జిల్లాలో ప్రజలు తరిమితే రంగారెడ్డి జిల్లా వాసులకు మయామాటలు చెప్పి గెలిచినవ్ అంటూ మండిపడ్డారు. తెలంగాణలో వరుసగా ఏడుసార్లు గెలిచింది కేసీఆర్ తర్వాత నేను ఒక్కడినే అని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఓచోట ఓడితే మరోచోటకు వలసపోయే నువ్వు.. నన్ను విమర్శిస్తావా? అని ఎర్రబెల్లి సీఎం రేవంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లపై రేవంత్ రెడ్డి పిచ్చిపిచ్చిగా విమర్శలు చేస్తున్నాడని, వారు ఏనాడు కూడా ప్రజా తిరస్కారానికి గురై ఎన్నికల్లో ఓడలేదన్న సంగతి మరువరాదన్నారు. ఓటమి లేని కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావులపై పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఎక్కడా లేని నీవు తెలంగాణ కోసం నీతులు చెబుతున్నావన్నారు. కాళోజీని ఎన్నడు కలవని రేవంత్ రెడ్డి పిచ్చి మాటలు మాట్లాడవద్దన్నారు. బాబ్లీ కోసం ఆందోళన చేసినప్పుడు లాఠీచార్జీ చేస్తే పారిపోయి వచ్చాడన్నారు. ఏడాదిలో అసలు నీవు ఏమి చేశావో కొత్తగా జనాలకు చెప్పలేదన్నారు. అన్ని కేసీఆర్ చేసినవేనన్నారు. మహిళా సదస్సు పెట్టి వారికి కోటీశ్వరులను చేస్తానని కొత్తగా చేసిందేమి లేదన్నారు. తన బంధువులను కోటీశ్వరులను చేసేందుకే అధికారాన్ని వాడుకుంటున్నాడని ఎర్రబెల్లి ఆరోపించారు. వస్త్ర పరిశ్రమ, పండ్ల రసం పరిశ్రమ పెట్టింది ఇక్కడే బీఆర్ఎస్ హయాంలోనేనన్నారు. బతుకమ్మ చీరలు ఇవ్వలేదని, నెలకు 2500ఇస్తా అని, తులం బంగారమని ఇవ్వలేదన్నారు. రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ లో ఎన్ని అమలు చేశావో రేవంత్ రెడ్ది ముందుగా చెప్పాలన్నారు. రేవంత్ వచ్చాకా వరంగల్ లో ఉన్న కంపెనీలు వెళ్లిపోతున్నాయన్నారు. కాళోజి కళా భవనాన్ని కేసీఆర్ కట్టిస్తే దాన్ని ప్రారంభించి నేనే కట్టించినా అని చెప్పుకుంటున్నాడని విమర్శించారు. ధర్మసాగర్ నుంచి నీళ్లు తెచ్చే పనులు చేయించాలన్నారు. కేంద్రం నుంచి కోచ్ ఫ్యాక్టరీ తెస్తమని తేలేదని దాన్ని తీసుకరావాలన్నారు. కేసీఆర్ మొక్కను మళ్లీ మొలవనివ్వమంటున్నాడని, ఎవరిని మొలవనివ్వమో చూద్ధామన్నారు. నీవు రియల్ ఎస్టేట్ బ్రోకర్, దొంగ అని ఎర్రబెల్లి మండిపడ్డారు. వరంగల్ లో జరిగిన ఏడాది విజయోత్సవాలకు వారి మంత్రులే రాలేదన్నారు. ఇందిరాగాంధీ, సోనియాగాంధీలపై, కేసీఆర్ పై గతంలో రేవంత్ రెడ్డి చేసిన మాటలను ఎర్రబెల్లి గుర్తు చేస్తూ నిన్ను ఢిల్లీలో రానిస్తలేరని, అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని, మంత్రివర్గం కూడా విస్తరించలేని అసమర్ధుడని విమర్శించారు. కేసీఆర్ మర్రి చెట్టు అని, రేవంత్ రెడ్డి గంజాయి మొక్క అని, నిన్ను కాంగ్రెసోళ్లే పీకేస్తరన్నారు. 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..