వారి రక్షణ కోసం మ‌హిళా సంఘాలు ముందడుగు వేయాలి: మంత్రి సీత‌క్క

మ‌హిళా సంఘాలు స్వయం ఉపాధికే ప‌రిమితం కాకుండా మ‌రో అడుగు ముందుకు వేసి మహిళా రక్షణ కోసం పనిచేయాలని పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీత‌క్క పిలుపునిచ్చారు.

Update: 2024-08-14 15:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మ‌హిళా సంఘాలు స్వయం ఉపాధికే ప‌రిమితం కాకుండా మ‌రో అడుగు ముందుకు వేసి మహిళా రక్షణ కోసం పనిచేయాలని పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీత‌క్క పిలుపునిచ్చారు. ఆర్థిక భద్రత తో పాటు సామాజిక భద్రత కల్పించేలా మహిళా సంఘాలు పని చేయాలన్నారు. బ్యాంకు మెట్లేక్కాలంట‌నే బ‌య‌ప‌డే స్థితి నుంచి బ్యాంకులు, ప్రభుత్వ సంస్థల‌కే రుణాలిచ్చే స్థాయికి మ‌హిళా సంఘాలు ఎదిగాయ‌న్నారు. మ‌హిళా భ‌ద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం చేప‌ట్టబోయే కార్యక్రమాల్లో మ‌హిళా సంఘాలు కీల‌క పాత్ర పోషించాల‌ని కోరారు. రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో బుధ‌వారం జ‌రిగిన స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ 11 వ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

స్త్రీనిధితో వడ్డీ వ్యాపారుల నుంచి మ‌హిళ‌ల‌కు విముక్తి క‌లగ‌డ‌మే కాకుండా పేద‌రికాన్ని రూపు మాపే దిశలో మ‌హిళా సంఘాలు చేస్తున్న కృషి అభినంద‌నీయ‌మ‌న్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం బాగుపడుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా ప‌క్షపాత‌ ప్రభుత్వమ‌న్నారు. మ‌హిళ‌ల‌కోసం రూ.500 కే గ్యాసు సిలిండర్, గృహ‌జ్యోతి కింద 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్, ఆర్టీసీ బ‌స్సులో ఉచిత ప్రయాణంవంటి ఎన్నో కార్యక్రమాల‌ను రాష్ట్రంలో అమ‌లువుతున్నాయన్నారు. మహిళా సాధికారతను తట్టుకోలేకే..ఆ స్కీంపై దుష్ప్రచారం చేస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.

అమ్మ ఆదర్శ కమిటీలకు ప్రభుత్వ పాఠ‌శాల‌ల నిర్వహ‌ణ బాధ్యత‌లు అప్పచెప్పిన త‌ర్వాత పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయన్నారు. మ‌హిళా సంఘాల‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు ప్రొత్సహిస్తుంద‌ని, ప్రభుత్వ పాఠ‌శాల విద్యార్థుల యూనిఫామ్ కుట్టు పనులను మహిళా సంఘాలకు అప్పజెప్పామన్నారు. అంతేగాక జత కుట్టు కూలీని రూ.50 నుంచి రూ. 70 పెంచిన‌ట్టు తెలిపారు. సచివాలయంలో ప్రారంభమైన మహిళా శక్తి క్యాంటీన్ లను జిల్లాల‌కు విస్తరిస్తున్నట్లు చెప్పారు. 17 రకాల వ్యాపారాల్లో మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చి వారిని మ‌రింత ఆర్దికంగా బ‌లోపేతం చేస్తామ‌న్నారు. మహిళా సంఘాలకు రూ. 2 లక్షల రుణ బీమా, రూ.10 లక్షల ప్రమాద బీమాను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.

గ్రామీణ స్థాయిలో మ‌హిళా సంఘాల్లో 63 లక్షల మంది మహిళలు చేర‌డ‌మే, మహిళా సంఘాల ప‌ట్ల సమాజంలో గౌరవం పెరిగిందనడానికి నిద‌ర్శన‌మ‌న్నారు. మ‌హిళా స‌భ్యులు అనుకుంటే కానిది లేద‌ని, అంతా ఒక్క మాట మీద నిలిస్తే స‌మాజంలో పెను మార్పులు సాధ్యమ‌న్నారు. మ‌హిళా భ‌ద్రత కోసం ప్రభుత్వాలు ప‌నిచేస్తే స‌రిపోద‌ని, మ‌హిళా సంఘాలు తోడ్పాటు అందించాల‌ని కోరారు. ఎన్కౌంటర్లతో స‌మాజంలో మార్పు రాదన్నారు. మహిళలపై నేరాలు జరక్కుండా రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపడతామ‌ని, అందులో మ‌హిళా సంఘాలు కీల‌క పాత్ర పోషించాల‌ని కోరారు. స్వయం స‌హాయ‌క సంఘాల వెలుప‌ల ఉన్న మహిళలను సంఘాల్లో చేర్పించే బాద్యత‌ను మ‌హిళా సంఘాలు తీసుకోవాల‌న్నారు. స‌భ్యులు కోరిన విధంగా స్త్రీనిధి భవన నిర్మాణం కోసం హైదరాబాదులో స్థలం కేటాయించేందుకు త‌మ‌ ప్రభుత్వ సిద్ధంగా ఉందని, ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెల్లి త‌గు నిర్ణయం తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ కార్యద‌ర్శి లోకేష్ కుమార్, సెర్ప్ సీఈఓ దివ్యా దేవ‌రాజ‌న్, స్త్రీనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ అధ్యక్షురాలు జీ ఇందిరా, మేనేజింగ్ డైరెక్టర్ విద్యాసాగ‌ర్ రెడ్డి, ఇత‌ర ఉన్నతాధికారులు, స్త్రీనిధి మ‌హిళా సభ్యులు పాల్గొన్నారు.

Tags:    

Similar News