కలగానే మహిళా సాధికారత.. పెత్తనమంతా వారిదే!
పేరుకే మహిళా సర్పంచ్, ఎంపీటీసీ. కుర్చీల్లోనే ఆమె కూర్చుంటుంది.
దిశ, కూసుమంచి: పేరుకే మహిళా సర్పంచ్, ఎంపీటీసీ. కుర్చీల్లోనే ఆమె కూర్చుంటుంది. కానీ పాలనా పగ్గాలు, పెత్తనం మాత్రం ఆమె చేతిలో ఉండవు. భర్త చేతిలోనో, కుటుంబ సభ్యుల చేతిలోనో ఉంటాయి తప్ప ఏఒక్క విషయంలోనూ స్వాతంత్ర్యం ఉండదు. తప్పనిసరైతే తప్ప ఇంటి గడప దాటడం లేదు. కూసుమంచి మండలంలో మొత్తం 41గ్రామాలు ఉండగా 21 మంది మహిళలు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు.
ముచ్చట్లగా మూడేళ్లు పూర్తిచేసుకొని నాలుగో ఏడాది పదవి కాలంలోకి అడుగుపెట్టారు. వీరిలో 10శాతం మహిళలు సైతం సొంతగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. గ్రామ సర్పంచ్‌గా ఇంట్లో నుంచి కాలుమెదపడం లేదు. అసలు ఆయా గ్రామాల్లో ఏం జరుగుతుందనే విషయం సైతం వారికి తెలియకపోవడం శోచనీయం. నిధులు డ్రా చేయడానికి, చెక్కులపై, తీర్మానాలపై సంతకాలు చేసేందుకు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించే సమయంలో ఫొటోలకు ఫోజులు ఇవ్వడం, రిబ్బన్ కట్ చేయడం, కొబ్బరికాయ కొట్టడానికే పరిమితం అవుతున్నారు.
పరిపాలన వ్యవహారాలన్నీ వారి భర్తలే చక్కబెడుతున్నారు. క్షేత్రస్థాయిలో వీరి అజమాయిషీని అడ్డుకోవాల్సిన సంబంధిత అధికారులు నోరు మెదపడం లేదు. కూసుమంచి మండలంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మహిళలకు గ్రామాల్లో జరుగుతున్న పాలనా పరమైన అన్ని విషయాలు కచ్చితంగా తెలియాల్సిందే. కానీ కొన్ని గ్రామ పంచాయతీల్లోని మహిళ సర్పంచ్‌లకు ఆయా గ్రామాల్లో ఎన్ని నిధులు మంజూరయ్యాయో, ఏయే పనులు చేపట్టారో, ఎన్ని పనులు పూర్తి చేశారనే కనీస వివరాలు కూడా తెలియడం లేదు.
ఈ విషయంలో సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. భర్తల పెత్తనంతో మహిళా ప్రజాప్రతినిధులంతా రబ్బరు స్టాంప్‌ల్లా మిగిలిపోతున్నారు. కొందరు మహిళా ప్రజాప్రతినిధులు తమదైన శైలిలో రాణిస్తున్నా అధికారుల ప్రోత్సాహం లభించడం లేదు. పరిపాలనలో మహిళా ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ, ఎప్పటికప్పుడు మండల స్థాయిలో పర్యవేక్షణ చేయాల్సిన ఎంపీడీఓ, ఎంపీఓలు అలసత్వం వహిస్తున్నారు.
కలగానే మహిళ సాధికారత...
జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారుల వద్ద మహిళ ప్రజాప్రతినిధుల ఫోన్ నంబర్లు సైతం ఉండవు. అధికారులు కూడా భర్తలతోనే మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయా గ్రామపంచాయతీల్లో అసలు సర్పంచ్ ముఖం కూడా స్థానిక అధికారులకు తెలియదంటే అతిశయోక్తి కాదు. అధికారిక, ప్రభుత్వ కార్యక్రమాల్లో, సమావేశాల్లో సైతం భర్తలే హాజరవుతున్నారు. మహిళా ప్రజాప్రతినిధులను ప్రోత్సహించి, మహిళా సాధికారికత కోసం కృషి చేయాల్సిన అధికారులే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. సంబంధిత అధికారులు షాడో సర్పంచ్(భర్త)ల ఆగడాలను నిరోధించాల్సింది పోయి ఏం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీన్ని బట్టి వీరి మధ్య కుదుర్చుకున్న చీకటి వ్యవహారం బహిరంగంగానే తేటతెల్లమవుతుంది.
కానరాని చర్యలు...
మహిళా ప్రజాప్రతినిధుల భర్తలు ప్రజాప్రతినిధులుగా వ్యవహరించవద్దని అనేక మార్లు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించినా వారిలో మార్పు కనిపించడం లేదు. పరిపాలన వ్యవహారాలు, సభలు, సమావేశాల్లో మహిళా ప్రజాప్రతినిధికి బదులు భర్తలు, బంధువులు కూర్చుంటే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ప్రోత్సహించిన సంబంధిత అధికారులపై పంచాయతీ రాజ్ చట్టం 2018 సెక్షన్ 37 (5) ప్రకారం చర్యలు తీసుకోవాలి.
కానీ కూసుమంచి మండలంలోని సంబంధిత శాఖ అధికారులు పంచాయతీ రాజ్ చట్టాన్ని షాడో సర్పంచ్‌లకు చుట్టంలా మార్చారని, అందుకే చర్యలు తీసుకోవడంలో వెనుకబడుతున్నారని పలువురు మండల వాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్,సంబంధిత అధికారులు స్పందించి సర్పంచ్ భర్తల అజమాయిషీ లేకుండా చూడాలని కోరుతున్నారు.