Women's Commission: మహిళా కమిషన్ సభ్యులకు చైర్‌ పర్సన్ నోటీసులు

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ తన సొంత సభ్యులపైనే సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.

Update: 2024-08-24 15:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ తన సొంత సభ్యులపైనే సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, పారదర్శకతను పాటిస్తూ, ప్రజల్లో విశ్వసనీయత పెంచేలా వ్యవహరించాల్సిన కమిషన్ మెంబర్లు కేటీఆర్‌కు రాఖీ కట్టడాన్ని చైర్‌పర్సన్ నేరెళ్ళ శారద సీరియస్‌గా తీసుకున్నారు. మహిళలను కించపరిచేలా కామెంట్లు చేసిన కేటీఆర్‌ను వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని గతంలో జారీ చేసిన నోటీసులకు స్పందనగా శనివారం చైర్‌పర్సన్ ముందు అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆఫీసు ప్రాంగణంలోనే ఆరుగురు కమిషన్ మెంబర్లు ఆయనకు రాఖీ కట్టడాన్ని చైర్‌పర్సన్ క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణించారు. న్యాయ నిపుణుల నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకున్న ఆమె.. రాఖీ కట్టిన ఆరుగురు సభ్యురాళ్ళకు నోటీసులు జారీ చేయాల్సిందిగా కమిషన్ సెక్రెటరీని ఆదేశించారు.

నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటూ సభ్యులకు ముందుగానే హెచ్చరించినట్లు సెక్రెటరీకి నేరేళ్ళ శారద వివరించారు. కమిషన్ ప్రాంగణంలో మొబైల్ ఫోన్లకు అనుమతి లేకపోయినా సీక్రెట్‌గా మొబైల్ ఫోన్ తీసుకెళ్లి రాఖీ కట్టిన వీడియోలను చిత్రీకరించడాన్ని సీరియస్ తప్పిదంగా పరిగణించారు. రాఖీ కట్టిన ఆరుగురు సభ్యులకు నోటీసులు ఇవ్వడమే కాక వారిపై తీసుకోవాల్సిన చర్యలపైనా చైర్‌పర్సన్ నేరెళ్ళ శారద న్యాయ సలహా తీసుకుంటున్నారు. మహిళా కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా సభ్యులు ప్రవర్తించారని ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. 


Similar News