విమెన్ ఎంపవర్‌మెంట్‌పై సర్కార్ స్పెషల్ ఫోకస్.. 5 ఏళ్లలో రూ.5వేల కోట్లతో..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు వడ్డీలేని రుణాలు, చిరు వ్యాపారాలే కాకుండా కోటి రూపాయలతో వ్యాపారం చేసేందుకు సర్కార్ ప్రోత్సహించాలని నిర్ణయించింది.

Update: 2024-10-28 03:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు వడ్డీలేని రుణాలు, చిరు వ్యాపారాలే కాకుండా కోటి రూపాయలతో వ్యాపారం చేసేందుకు సర్కార్ ప్రోత్సహించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మున్సిపల్ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన మిషన్ (మెప్మా) పేదల స్వయం-స్థిరమైన సంస్థలను ప్రోత్సహించడానికి, బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది. అందులో భాగంగానే స్వయం సహాయక మహిళా సంఘాలకు ప్రభుత్వ కార్యాలయాల్లో క్యాంటీన్ల నిర్వహణ, క్యాటరింగ్ సర్వీసెస్ లో పెద్ద పీట వేయాలని నిర్ణయించారు. వీటితోపాటు మరో 20రకాల వ్యాపారాలు చేసుకునేవిధంగా ప్రోత్సహాకాలు అందించాలని పురపాలక శాఖ నిర్ణయించింది.

1.74లక్షల సంఘాలు..

రాష్ట్రంలో జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ బోర్డులతో కలిపి 144 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈప్రాంతాల్లో 1.74లక్షల స్వయం సహాయక మహిళా సంఘాలు ఉన్నాయి. వీటిలో 17.65లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఒక్కో సంఘంలో 10మందికి తగ్గకుండా సభ్యులు ఉంటారు. సుమారుగా 15 నుంచి 20 మహిళా సంఘాలతో కలిపి ఒక ఏరియా లెవల్ ఫెడరేషన్(ఏఎల్ఎఫ్) ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,390 ఏఎల్ఎఫ్ లు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్కో సర్కిల్ కు ఒకటి చొప్పున టౌన్ లెవల్ ఫెడరేషన్(టీఎల్ఎఫ్)లను ఏర్పాటు చేశారు. ఇతర జిల్లాల్లో ఒక్కో మున్సిపాలిటీకి ఒకటి చొప్పున టీఎల్ఎఫ్ ఉంటుంది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో అయితే 4 నుంచి 5 టీఎల్ఎఫ్ లు ఉన్నాయి.

వ్యాపారాలు ఇలా…

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని, సుస్థిరత సాధించాలనే లక్ష్యంతో వ్యక్తిగతంగాను, గ్రూపులవారీగాను వ్యాపారవేత్తలను తయారుచేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే 1,299 గ్రూపు ఎంటర్ ప్రైజెస్ లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో క్యాంటీన్లు/ఫుడ్ ట్రక్స్- 150, క్యాటరింగ్ సర్వీసెస్- 250, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు- 250, కన్ స్ట్రక్చన్ ఎక్విప్ మెంట్స్ -350, స్ట్రీట్ వెండర్ కలెక్టివ్స్/కోల్డ్ స్టోరేజీలు- 75, మీసేవా సెంటర్లు -114, ఈవెంట్ మేనేజ్ మెంట్ -110 యూనిట్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. వీటితోపాటు వ్యక్తిగత ఎంటర్ ప్రైజెస్ విభాగంలో 7,500 యూనిట్లను గుర్తించారు. వాటిలో కూరగాయలు/స్ట్రీట్ వెండింగ్ -2,107 యూనిట్లు, బేకరి- 878, కిరాణ -267, పుడ్ ట్రక్స్ -612, డెయిరీ ప్రొడక్ట్స్ అవుట్ లెట్స్ -905, మైక్ అండ్ సౌండ్స్ సెట్స్ -668, బ్యూటీ అండ్ వెల్ నెస్ సెంటర్స్ -733, టెంట్ హౌస్ -454, సారీ రోలింగ్ -285, ఫ్యాన్సీ స్టోర్స్ -360, మహిళా సంఘాల ప్రొడక్ట్స్ అవుట్ లెట్స్ -233 యూనిట్లను గుర్తించారు.

వీళ్లకే క్యాంటీన్లు, క్యాంటరింగ్ …

గ్రూపు, వ్యక్తగత ఎంటర్ ప్రైజెస్ ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్లు, దేవాలయాలు, టూరిజం హబ్స్, ఇండస్ట్రీయల్ పార్కులు, మైనార్టీ వెల్పేర్, సాంఘీక సంక్షేమ, గిరిజన, బీసీ సంక్షేమ గురుకులాల్లోనూ క్యాటరింగ్ సర్వీస్ లను మహిళా సంఘాలకు ఇవ్వనున్నారు. వీటితోపాటు జిల్లా కోర్టులు, రిజిస్ట్రేషన్ ఆఫీసులు, మున్సిపల్ ఆఫీసులు, ప్రభుత్వ ఆస్పత్రులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ క్యాంటీన్ సర్వీసులను మహిళా సంఘాల సభ్యులకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఐదేండ్లపాటు రూ.5వేల కోట్లతో..

రాష్ట్ర ప్రభుత్వం ఐదేండ్ల కాలంలో రూ.5వేల కోట్లతో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా మైక్రో ఎంటర్ ప్రైజెస్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏడాదికి 1000 ఏరియా లెవల్ ఫెడరేషన్(ఏఎల్ఎఫ్)లకు ఒక్కో ఏఎల్ఎఫ్ కు కోటి రూపాయల చొప్పున రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. అంటే ఏఎల్ఎఫ్ లో 20మహిళా సంఘాలున్న ఒక్కో సంఘానికి సుమారు రూ.50లక్షలు వచ్చే అవకాశముందని అధికారులు లెక్కలేశారు. దీంతోపాటు ఏడాదిలో ఒక్కో గ్రూపునకు రూ.20లక్షల చొప్పన రూ.500కోట్లతో మరో 2500 గ్రూపు ఎంటర్ ప్రైజెస్ లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు. 32జిల్లాల్లో రూ.1025కోట్లతో 1000 ఏఎల్ఎఫ్ ల ద్వారా ఇంకో 17,500 ఎంటర్ ప్రైజెస్ లను ఏర్పాటు చేయనున్నారు.


Similar News