దాడికి పాల్పడితే.. హిస్టరీ షీట్స్! కండక్టర్‌పై దాడి కేసులో మహిళ అరెస్ట్
హైదరాబాద్‌లోని హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఇటీవల నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన వ్యవహారంలో
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఇటీవల నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన వ్యవహారంలో నిందితురాలైన అంబర్‌పేటకు చెందిన సయ్యద్ సమీనాను రాచకొండ కమిషనరేట్ ఎల్బీనగర్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితురాలికి రంగారెడ్డి జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసు విచారణను త్వరతిగతిన చేపట్టి.. నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
నేరస్తులపై హిస్టరీ షీట్స్!
టీఎస్ ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించిన, దాడులకు పాల్పడిన యాజమాన్యం ఏమాత్రం సహించదని, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. పోలీస్ శాఖ సహకారంతో నేరస్తులపై హిస్టరీ షీట్స్ తెరిచేలా సంస్థ చర్యలు తీసుకుంటుందన్నారు. 45 వేల మంది టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు మనోవేదనకు గురి చేసే ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. క్షణికావేశంలో సహనం కోల్పోయి దాడులు చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.