Etela Rajender: మీ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తా.. డాక్టర్ల బృందానికి ఈటెల హామీ

కలకత్తా డాక్టర్ ఘటనపై పార్లమెంట్‌లో మీ వాయిస్ వినిపించి న్యాయం జరిగేలా చూడాలని, డాక్టర్స్ మీద దాడులు జరగకుండా కఠిన చట్టాలు అమలు చేసేలా మీ వంతు ప్రయత్నం చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్‌ను మేడ్చల్ డాక్టర్స్ బృందం కోరారు.

Update: 2024-08-21 08:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కలకత్తా డాక్టర్ ఘటనపై పార్లమెంట్‌లో మీ వాయిస్ వినిపించి న్యాయం జరిగేలా చూడాలని, డాక్టర్స్ మీద దాడులు జరగకుండా కఠిన చట్టాలు అమలు చేసేలా మీ వంతు ప్రయత్నం చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్‌ను మేడ్చల్ డాక్టర్స్ బృందం కోరారు. బుధవారం ఈటెల నివాసంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మేడ్చల్ డాక్టర్స్ బృందం ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కలకత్తా డాక్టర్ ఘటన వెనుక ఉన్న కారణాలు బయటకు రాకుండా చేస్తున్నట్లు అనిపిస్తోందని, దీనిపై పార్లమెంట్‌లో మీ వాయిస్ వినిపించి, న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

అలాగే డాక్టర్స్ మీద దాడులు ఆపేలా చూడాలని, దాడులు జరగకుండా, హాస్పిటల్‌లో సెక్యూరిటీ పెంచేలా కఠిన చట్టాలు తీసుకొని రావాలని, వాటిని అన్ని రాష్ట్రాలు అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావడానికి మీవంతు ప్రయత్నం చేయాలని డాక్టర్స్ ఈటెలతో విన్నవించుకున్నారు. అంతేగాక కలకత్తా ఘటన తరువాత మహిళా డాక్టర్స్‌లో ఒక విధమైన భయం మొదలైందని, దీనిని పొగొట్టాల్సిన బాధ్యత మనందరిమీద ఉందని తెలిపారు. హాస్పిటల్ మీద డాక్టర్స్ మీద దాడి జరిగితే అంతిమంగా నష్టం జరిగేది పేదరోగులకు మాత్రమేనని, మీలాంటి నాయకులు ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పాలని డాక్టర్స్ బృందం సూచించారు.

మహిళలుగా మేము కూడా 36 గంటల పాటు డ్యూటీ చేస్తున్నామని, అయినా హాస్పిటల్లో సరైన టాయిలెట్స్, విశ్రాంతి తీసుకునే సదుపాయాలు, రక్షణ లేవని మహిళా డాక్టర్స్ ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. కలకత్తా ఘటన తీవ్రంగా కలిచివేసిందని, ఈ ఘటనపై దేశమంతా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. పేదలకు ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కని చెబుతూ.. సమాజంలో ఉన్న ఆందోళనలకు రాజకీయ నాయకులు ఫెయిల్ అవ్వడమే కారణమని స్పష్టం చేశారు. ఇక మీ సమస్యలు అన్నింటిపై నాకు సంపూర్ణ అవగాహన ఉందని తెలుపుతూ.. ఖచ్చితంగా వాటిని తీర్చడానికి నా వంతు కృషి చేస్తానని ఈటెల హామీ ఇచ్చారు.

Tags:    

Similar News