ఏ ఒక్కరో చేరనంత మాత్రాన బీజేపీ నష్టం జరగదు: మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ బీజేపీ నుండి కొందరు కీలక నేతలు బయటకు వెళ్తారని ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ నుండి కొందరు కీలక నేతలు బయటకు వెళ్తారని ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీలో పొసగని నేతలు మరో పార్టీ వైపు చూస్తున్నారని.. త్వరలోనే కమలానికి గుడ్ బై చెబుతారని వార్తలు జోరుగా వినిపించాయి. ఈ క్రమంలో బీజేపీ నుండి కొందరు నేతలు బయటకు వెళ్తారనే ప్రచారంపై బీజేపీ కీలక నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.
బీజేపీ నుంచి ఎవరూ వెళ్లిపోవడం లేదని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నేతలు బయటకు వెళ్తారని జరుగుతోన్న ప్రచారం అవాస్తవమని కొట్టి పారేశారు. అంతేకాకుండా బీజేపీలో ఏ ఒక్కరో చేరనంత మాత్రాన పార్టీకి ఏం నష్టం జరగదని.. నాయకులు చేరినంత మాత్రాన పార్టీ గెలవదన్నారు. ప్రజల ఆశీస్సులు ఉంటేనే గెలుస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలో బీజేపీ ఓటమి చెందడం పట్ల నిరాశ చెందడం లేదని చెప్పారు.
అయితే, ఇటీవల బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరుతారని తొలుత ప్రచారం జరిగింది. కానీ ఆ నేతల కదలికలు చూస్తే వారు బీజేపీలో చేరేలా కనిపించడం లేదు. దీంతో వారిని దృష్టిలో ఉంచుకునే కిషన్ రెడ్డి తాజా కామెంట్స్ చేశారని తెలుస్తోంది. అంతేకాకుండా టీ బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ స్వయంగా పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమని చెప్పిన విషయం తెలిసిందే.
Also Read..
.బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు: మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు